
మెదక్: ఇంటికి వెళ్లేందుకు దారి ఇవ్వకుండా మూసివేసినా, తన సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పురుగు మందు సేవించిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మండల పరిధిలోని వాడి గ్రామానికి చెందిన బూర్గుపల్లి సుభాశ్‌రెడ్డి(44) కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన పాలివారు తన ఇంటి వద్దకు వెళ్లేందుకు దారి ఇవ్వకుండా మూసివేశారు. దీంతో మండల, జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఈనెల 3న పురుగు మందు సేవించాడు. తాను మృతిచెందిన తర్వాత తన సమస్యను పరిష్కరించి, ఆ దారి వెంటే తన మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ అధికారులకు విన్నవించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గ్రామంలో ఉద్రిక్తత, భారీ బందోబస్తు
సుభాశ్‌రెడ్డి మృతికి కారణమైన వారిని శిక్షించి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ బంధువులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతికి కారణమైన వారిని శిక్షించి కుటుంబానికి న్యాయం చేయాలని పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న మెదక్ రూరల్ సీఐ జార్జ్, ఎస్‌ఐ నరేశ్ ముందస్తు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుభాశ్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లకుండా అడ్డంగా ఉంచిన గేట్‌ను తొలగించారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని హామీ ఇచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించమబోమంటూ మొండికేశారు. మృతుడికి భార్య అనూష, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.