
చండీగఢ్: ప్రముఖ హర్యానా ఐపీఎస్ అధికారి వై.పురాన్ కుమార్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐపీఎస్ ఆత్మహత్యకు కారణమైన రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు పురాన్ కుమార్ మరణానికి కారణమైన వారిలో పోలీస్ శాఖలో పనిచేసిన కీలక ఉన్నతాధికారి పేరు ఉండటమేనని తెలుస్తోంది.
తనని పోలీస్ శాఖలో రిటైర్డ్ ఉన్నతాధికారులు వేధిస్తున్నారని, ఆ వేధింపులు తాళలేక పోతున్నానంటూ ఐపీఎస్ పురాన్ కుమార్ బుధవారం ఛండీఘడ్‌లోని తన నివాసంలో రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి ముందు ఎనిమిది పేజీల సూసైడ్ నోటు రాశారు. అందులో సదరు అధికారుల పేర్లు కూడా రాశారు.
అయితే, తన భర్త మరణానికి కారణమైన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ పురాన్ కుమార్ భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పీ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
నా భర్త ఐపీఎస్ పురాన్ కుమార్‌ను పోలీస్ శాఖలో పనిచేసి రిటైరైన ఉన్నాతాధికారులు, పలువురు పనిచేస్తున్న వారు వేధింపులకు గురి చేయడం,అవమానించడంతో పాటు మానసిక హింసకు గురి చేశారని వాపోయారు. అందుకే ఆయన మరణించినా.. చండీగఢ్ పోలీసులు పట్టించుకోలేదు.హర్యానా పోలీసు, అడ్మినిస్ట్రేషన్‌లో శక్తివంతమైన ఉన్నతాధికారులు ఈ కేసులో నిందితులుగా ఉండటం,వారు చండీగఢ్ పోలీసులను ప్రభావితం చేయడం వల్ల ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం’అని సీఎం నయాబ్ సింగ్ సైనీకి రాసిన లేఖలో ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పీ కుమార్ పేర్కొన్నారు.