చంద్రబాబు సర్కారుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు
మేం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి క్రమం తప్పకుండా అమలు చేశాం
ఇప్పుడు బాబు అప్పులు చేయడానికి క్యాలెండర్ విడుదల చేస్తున్నారు
ఐదేళ్లలో మేం చేసిన అప్పులు రూ.3.31 లక్షల కోట్లు
అందులో సంక్షేమ పథకాల కింద డీబీటీ ద్వారా ప్రజలకు రూ.2.73 లక్షల కోట్లు జమ
మేం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో 90.87 శాతం రెండేళ్లు తిరక్కుండానే అప్పు చేసిన చంద్రబాబు సర్కార్
రూ.3.02 లక్షల కోట్లు అప్పు చేసినా ప్రజలకు చేసిన మంచేమీ లేదు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ రద్దు.. సూపర్ సిక్స్ ఊసే లేదు
పైగా రిజిస్ట్రేషన్ చార్జీలు 50% పెంపు.. వాహనాల కొనుగోళ్లపై రోడ్ సెస్.. గ్రామాల్లో తాగునీటిపైనా చార్జీలు
రూ.20,135 కోట్ల మేర విద్యుత్ చార్జీలు బాదుడే బాదుడు
ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, లేటరైట్ ఇలా ప్రతిదీ కుంభకోణం
ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు, ప్రతి ఊళ్లో రేషన్ మాఫియా, ప్రతి పనికీ లంచం
సాక్షి, అమరావతి: ‘మా ప్రభుత్వంలో ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి, దాన్ని క్రమం తప్పకుండా అమలు చేశాం. అదే ఇప్పుడున్న చంద్రబాబు అప్పులు తెచ్చుకోవడానికి క్యాలెండర్ విడుదల చేస్తున్నారు’ అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దునుమాడారు. తమ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే.. రెండేళ్లు కూడా తిరక్కముందే రూ.3.02 లక్షల కోట్లు.. అంటే తాము ఐదేళ్లలో చేసిన అప్పులో 90.87 శాతం అప్పును చంద్రబాబు ప్రభుత్వం ఈ 18 నెలల్లోనే చేసేసిందంటూ కాగ్ నివేదికల్లో గణాంకాలను చూపుతూ కడిగిపారేశారు. ఇన్ని అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రజలకేమైనా మేలు చేశాడా? అంటే అదీ లేదన్నారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లేకుండా పోయాయని, వైఎస్సార్‌సీపీ హయాంలో అమలైన పథకాలన్నీ రద్దు చేసేశారని నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ గాలికి పోయాయని ఎద్దేవా చేశారు. రైతులు, విద్యార్థులు, అక్కచెల్లెమ్మలు, ఉద్యోగులకు దిక్కులేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు దాదాపుగా రూ.30 వేల కోట్లు బకాయి పడిందని చెప్పారు. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్సీ ఊసే లేదన్నారు. ఇక సరెండర్ లీవుల గురించి చెప్పాల్సిన పనే లేదన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ఆశ్చర్యం కలిగించేలా అప్పులు
ళీ చంద్రబాబు పదే పదే తప్పులు చేస్తూ.. మరో వైపు దు్రష్పచారం చేస్తుంటారు. వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.10 లక్షల కోట్ల నుంచి రూ.14 లక్షల కోట్ల మేర అప్పులు చేసేశారని ఎన్నికలకు ముందు దు్రష్పచారం చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబును ఎవరైనా గిల్లినా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీసినా, ఉద్యోగులు సమ్మెల్లోకి వెళ్లినా మళ్లీ మనమే గుర్తుకొస్తాం. అసెంబ్లీలో ఒకటి చెబుతారు. ప్రభుత్వ రికార్డుల్లో ఒకటి చూపుతారు. బహిరంగ సభల్లో ఇంకో మాట మాట్లాడతారు.
⇒ 2014లో బాబు గద్దెనెక్కే నాటికి ప్రభుత్వ అప్పులు, రాష్ట్ర ప్రభుత్వ హామీతో తీసుకున్న అప్పులు, హామీ లేని రుణాలు అన్నీ కలిపి రూ.1,40,717 కోట్లు ఉన్నాయి. ఈ అప్పులు చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.3,90,247 కోట్లకు చేరాయి. ఈ లెక్కన ఆయన రూ.2,49,530 కోట్లు అప్పు చేశారు. అంటే.. చంద్రబాబు సర్కార్ హయాంలో రుణాల సగటు వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్) 22.63 శాతం నమోదైంది. అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.3,31,671 కోట్లు అప్పు చేశాం. ఈ లెక్కన గమనిస్తే అప్పుల్లో సీఏజీఆర్ 13.57 శాతం మాత్రమే ఉంది.
ప్రజలపై విపరీతంగా బాదుడు
⇒ చంద్రబాబు ఓ వైపు అప్పులు చేస్తూనే, మరో వైపు ప్రజల మీద విపరీతంగా బాదేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఐదేళ్లపాటు కరెంటు చార్జీలు పెంచనని చంద్రబాబు అన్నారు. కానీ, రెండేళ్లు కూడా గడవకుండానే ఏకంగా రూ.20,135 కోట్ల కరెంటు చార్జీలు బాదారు. ట్రూ అప్, ఇంకా రకరకాల చార్జీల పేరిట భారం మోపుతున్నారు. ఇంధనం, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఫ్యూయల్, పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జెస్ట్‌మెంట్ – ఎఫ్‌పీపీసీఏ) కింద 2024 నవంబర్ 29న రూ.9,412 కోట్లు, 2024 అక్టోబర్ 25న మరో రూ.6,072 కోట్లు, 2025 సెపె్టంబర్ 27న మరో రూ.1863 కోట్లు, ప్రొవిజనల్ ఎఫ్‌పీపీసీఏ చార్జెస్ కింద మరో రూ.2,787 కోట్లు వెరసి రూ.20,135 కోట్ల విద్యుత్ చార్జీలు బాదుడే బాదుడు.
⇒ రిజిస్ట్రేషన్ చార్జీలు 50% పెంచారు. దీంతో భూములు కొనాలంటేనే షాక్ కొట్టే పరిస్థితి. గ్రామాల్లో ప్రజలు తాగే తాగునీటిపైనా చార్జీలు వసూలు చేస్తున్నారు. తాజాగా కొత్తగా వాహనాల కొనుగోళ్లపై రోడ్ సెస్ వేశారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించింది. వాళ్లు తగ్గించిన పన్ను మొత్తాన్ని రహదారి సుంకం రూపంలో వీళ్లు మళ్లీ వేస్తున్నారు. అన్ని రకాల రోడ్లకూ టోల్ గేట్లు పెట్టి వసూలు చేయడం ఒక వడ్డన అయితే, రోడ్ సెస్ పేరిట వాహనాల మీద వడ్డిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం వీళ్ల జేబుల్లోకి పోతోంది.
⇒ మేము చేసిన రూ.3.31 లక్షల కోట్ల అప్పుల్లో రూ.2.73 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కింద ప్రజలకు అందించిన ఘనత మాది. డీబీటీ కింద ఎవరికి ఇచ్చామో పేరు, ఆధార్, బ్యాంక్ ఖాతాతో సహా పూర్తి వివరాలు అందిస్తాం. మేం ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, కేవలం రెండేళ్లు కూడా తిరక్కుండానే బాబు రూ.రూ.3,02,303 కోట్లు అప్పు చేశారు. అంటే మేం ఐదేళ్లలో చేసిన అప్పులో 90.87 శాతం ఇప్పటికే చేసేశారు. మరోవైపు వచ్చే మూడు నెలల కాలంలో మరో రూ.11 వేల కోట్లు అప్పు చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ముందు ప్రతిపాదన పెట్టారు. అప్పులు తేవడంలో ఓ పద్ధతి పాడు లేకుండా పోయింది. రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారు.
⇒రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం వీళ్ల జేబుల్లోకి పోతోంది. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, లేటరైట్ ఇలా ప్రతిదీ కుంభకోణం అయిపోయింది. రాష్ట్రంలో గ్రామ గ్రామాన మద్యం మాఫియా కనిపిస్తోంది. కమీషన్ల కోసం అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రూపంలో కుంభకోణాలు చేస్తున్నారు. ప్రతి ఊళ్లో రేషన్ మాఫియా, ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు దర్శనమిస్తున్నాయి. ఏ పనికి అయినా సరే కింది నుంచి పైదాక లంచం ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. - వైఎస్ జగన్


