జడ్జి అరుణ సారిక కారును తనిఖీ చేస్తున్న పోలీసులు
ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని హెచ్చరిక
ఏపీ పోలీసులను అప్రమత్తం చేసిన ఎన్‌ఐఏ
చిత్తూరు అర్బన్: ఏపీలోని పలు జిల్లా కోర్టులను పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గురువారం చిత్తూరు, అనంతపురం, ఏలూరు, విశాఖ జిల్లా కోర్టులను మానవ బాంబులతో పేల్చుతామని, ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు వాడుతున్నట్లు కోర్టులకు మెయిల్స్ వచ్చాయి. బుధవారం రాత్రి వచి్చన మెయిళ్లను న్యాయమూర్తులు గురువారం కోర్టులకు హాజరయ్యాక గమనించి, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అన్ని చోట్ల బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేపట్టారు.
తమిళనాడులోని ఓ రాజకీయ పార్టీ ద్వారా అవమానానికి గురైన తాము లిబరేషన్ టైగర్స్ ఆఫ్ టైగర్స్ ఈలం (ఎల్‌టీటీఈ) నుంచి విడిపోయి, కశ్మీర్ ఐఎస్‌ఐ ఉగ్రవాదులతో కలిసి ఈ పేలుడుకు ప్రణాళిక రూపొందించినట్లు, మధ్యాహ్నం 1.15 గంటలకు ఆత్మాహుతి దాడులు చేయనున్నట్లు మెయిల్స్‌లో పేర్కొన్నారు. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సైతం రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసింది. సాయంత్రం వరకు కొనసాగించిన గాలింపుల్లో ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ మెయిల్స్ ఆకతాయిలు పంపారా? లేక ఎక్కడి నుంచి వచ్చాయి? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.


