‘రాయలసీమ ఎత్తిపోతల’ నిలిపివేతపై వైఎస్ జగన్ నిలదీయడంతో దిక్కుతోచని బాబు సర్కార్
దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మరో డ్రామా
రాజధానిపై వైఎస్ జగన్ మాటలను వక్రీకరిస్తూ మంత్రులు, ఎల్లో మీడియా దు్రçష్పచారం
రివర్ బెడ్‌కు.. రివర్ బేసిన్‌కూ తేడా తెలియకుండా అజ్ఞానంతో కారుకూతలు
రాజధాని రైతుల ఆవేదనపై ప్రభుత్వాన్ని నిలదీస్తే.. ఇంత ఉలికిపాటు ఎందుకంటున్న మేధావులు, రైతులు
సాక్షి, అమరావతి: చీకటి ఒప్పందాలతో రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేసిన సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను నీరుగార్చడాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీయడంతో ఆత్మరక్షణలో పడ్డ టీడీపీ కూటమి సర్కారు ఎల్లో మీడియాతో కలిసి మరోసారి డైవర్షన్ డ్రామాకు తెర తీసింది. రాజధానిలో రెండో విడత భూసమీకరణపై గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం ఇస్తూ.. తొలి విడత భూములిచ్చిన రైతుల ఆక్రందనను ప్రస్తావించడంతో ఉలిక్కిపడిన చంద్రబాబు సర్కారు విషప్రచారానికి దిగింది.
రివర్ బేసిన్ (నదీ పరివాహక ప్రాంతం)లో రాజధాని నిర్మిస్తున్నారని వైఎస్ జగన్ అంటే.. రివర్ బెడ్ (నదీ గర్భం)లో నిర్మిస్తున్నారని అన్నట్లుగా వక్రీకరిస్తూ, దూషణలకు దిగుతూ దుష్ప్రచారం చేస్తోంది. బేసిన్‌కు.. బెడ్‌కూ తేడా తెలియని మంత్రులు ఎల్లో మీడియాతో కలసి, రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపివేసిన విషయాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
ఖండించకపోగా... ఎదురు దాడి, దుష్ప్రచారం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతలను ఆపివేయించా..! పనులు ఆగాయో లేదో కావాలంటే చెక్ చేసుకోవచ్చంటూ తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం చంద్రబాబుగానీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడుగానీ రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తారనుకుంటే అది చేయలేదు. పైగా వారిద్దరి మాటలు వింటే.. ఆ ఎత్తిపోతల అవసరం లేదనడం చూస్తే.. రేవంత్‌రెడ్డితో చంద్రబాబుకు ఉన్న రహస్య ఒప్పందానికి అధికారికంగా ఆమోదముద్ర వేసినట్లేనని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఎంతౖకైనా దిగజారుతారు.. ఎవరికైనా వెన్నుపోటు పొడుస్తారన్నది మరోసారి నిరూపితమైందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చడానికే రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేశారన్నది తేటతెల్లమవడంతో చంద్రబాబు సర్కార్‌పై ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే రాజధానిపై వైఎస్ జగన్ మాటలను వక్రీకరిస్తూ మంత్రులు, ఎల్లో మీడియా డైవర్షన్ డ్రామాకు తెరతీశాయి.
నిర్మాణ వ్యయానికి అంతెక్కడ..?
విభజన తర్వాత అధికారం చేపట్టి, అమరావతిని రాజధానిగా ప్రకటించి.. 2014–19 మధ్య ఐదేళ్లలో అదే రాజధాని నిర్మాణం కోసం రూ.5,500 కోట్లు చంద్రబాబు సర్కార్ ఖర్చు చేసింది. కానీ.. ఒక్కటంటే ఒక్క శాశ్వత నిర్మాణం చేయలేదు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని.. ఆ ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడదని సీఎం చంద్రబాబు చెబుతూ వచ్చారు. కానీ.. ఇప్పుడు 19 నెలల్లోనే రూ.47 వేల కోట్ల రుణం రాజధాని కోసం తెచ్చారు. తొలి విడత తీసుకున్న 50 వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని కేంద్రానికి చంద్రబాబు సర్కార్ డీపీఆర్ సమర్పించింది. రెండో విడతగా తీసుకుంటున్న భూముల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ.లక్ష కోట్లు అవసరం.
అంటే.. మొత్తమ్మీద రాజధాని నిర్మాణానికి ఏకంగా రూ.2 లక్షల కోట్లు అవసరం. ఇప్పటికే రూ.60 వేల కోట్లతో చేపట్టిన పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ, పనుల్లో ఎక్కడా పురోగతి లేదు. రాజధాని పేరుతో అప్పులు తేవడం, పనుల అంచనా వ్యయాలు పెంచడం, కాంట్రాక్టర్లకు అప్పగించడం, మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు చెల్లించడం, కమీషన్లు వసూలు చేసుకోవడం మినహా నిర్మాణ పనుల్లో ఎలాంటి పురోగతి కన్పించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధానిలో వర్షం కురిస్తే ఆ నీరు కృష్ణాలోకి వెళ్లడం లేదనే నెపంతో ఇప్పటికే రూ.222 కోట్లతో ఉండవల్లి వద్ద కొండవీటివాగు వరద ఎత్తిపోతల నిర్మించారు. తాజాగా రూ.523 కోట్లతో ఉండవల్లి వద్ద రెండో ఎత్తిపోతలను చేపట్టారు.
వరదను నియంత్రించడానికి మూడు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు.. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తే మంత్రులు, ఎల్లో మీడియా గగ్గోలు పెడుతున్నారు. ప్రజలకు నిజంగానే మేలు చేయాలన్న సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే రాజధాని నిర్మాణం ఎప్పుడో జరిగిపోయి ఉండేది. కానీ అలా జరగలేదు కదా? ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ ప్రశ్నిస్తే ఎందుకంత ఉలుకు? ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల విశాల ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలి. అలాగే రాజధాని ప్రాంత రైతులకు న్యాయం జరగాలి. అదే విషయాన్ని వైఎస్ జగన్ చెప్పారు. రాజధాని రైతులకు అన్యాయం జరుగుతోందనే కదా వైఎస్ జగన్ చెప్పింది! ఇకనైనా రాజధాని రైతులకు న్యాయం చేయడంపై దృష్టి పెట్టండి.. రాజధాని నిర్మాణం పేరుతో ప్రజలపై ఇంకా భారం మోపడం ఆపాలని సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎల్లో మీడియాకు మేధావులు, రైతులు హితవు పలుకుతున్నారు.
ఏడేళ్లలో ఏం చేశావ్ బాబూ..?
రాజధాని నిర్మాణం కోసం టీడీపీ హయాంలో తొలి విడతగా 53 వేల ఎకరాలు సమీకరించారు. 2014–19 మధ్య ఐదేళ్లు.. ఇప్పుడు రెండేళ్లు వెరసి దాదాపు ఏడేళ్లు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. కానీ..ఇప్పటికీ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒక కొలిక్కి రాకముందే రెండో విడత భూసమీకరణను ప్రభుత్వం ప్రారంభించడంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. తొలి విడత భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను వాగులు, వంకలు, చెరువుల్లో ఇవ్వడం.. ఇప్పుడు రహదారుల నిర్మాణం పేరుతో నివాసం ఉంటున్న ఇళ్లను సైతం చంద్రబాబు ప్రభుత్వం గుంజుకోవడంపై రైతులు మానసికంగా కుంగిపోతున్నారు.
ఇదే అంశంపై ఇటీవల రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన రామారావు అనే రైతు గుండె పగిలి మరణించారు. రెండో విడత భూసమీకరణ కోసం వడ్డమానులో నిర్వహించిన గ్రామసభలో ప్రభుత్వాన్ని రైతులు నిలదీశారు. తొలి విడతలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు.. ఇప్పుడు రెండో విడతలో భూములివ్వాలంటే, మూడేళ్లలోగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆవేదననే వైఎస్ జగన్ ప్రస్తావించారు.


