వైఎస్సార్‌సీపీ కార్యాలయ భవనం విషయంలో మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్‌పై హైకోర్టు మండిపాటు
చట్టం కంటే ఎక్కువని అధికారులు భావిస్తున్నారు
అలాంటి వారిని ఎక్కడ నిలబెట్టాలో మాకు బాగా తెలుసు
ఒక అధికారిని కటకటాల్లోకి పంపితే అందరూ దార్లోకి వస్తారు
లిఖితపూర్వక అఫిడవిట్ దాఖలు చేయండి
మునిసిపల్ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) మచిలీపట్నం టౌన్, ఈడేపల్లిలో నిబంధనలకు అనుగుణంగా నిరి్మంచిన పార్టీ కార్యాలయ భవనం విషయంలో మునిసిపల్ కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు గురువారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయ భవన నిర్మాణంలో లోపాలు ఉన్నాయంటూ ఇప్పటికే పలు నోటీసులు జారీ చేసిన మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మళ్లీ పదే పదే నోటీసులు జారీ చేయడంపై మండిపడింది.
‘ఇంపాక్ట్ ఫీజు వసూలు చేసి ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ (ఓసీ) జారీ చేయాలన్న మా ఆదేశాలకు విరుద్ధంగా, అలాగే సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా మళ్లీ ఎలా నోటీసులు ఇస్తారు? మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్ చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయి. సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపడుతాం. మా ఆదేశాల మేరకు ఎందుకు ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ ఇవ్వలేదో, ఎందుకు పదే పదే నోటీసులు ఇస్తున్నారో కమిషనర్ వివరణ ఇవ్వాలి. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలి. కోర్టు ఆదేశాలను ఎందుకు ఉల్లంఘించారో స్పష్టంగా చెప్పాలి. కోర్టు ఆదేశాలంటే నవ్వులాట అనుకుంటున్నారా? కోర్టు పవర్ ఏంటో రాష్ట్రంలోని అధికారులందరికీ చూపిస్తాం. చట్టం కంటే ఎక్కువని అధికారులు భావిస్తున్నారు.
ఇలాంటి వారిని ఎక్కడ నిలబెట్టాలో తమకు బాగా తెలుసు. ఒక అధికారిని కటకటాల వెనక్కి పంపితే అధికారులందరూ దార్లోకి వస్తారు’’ అని హెచ్చరించింది. వాదనల సమయంలో కమిషనర్ తరఫు న్యాయవాది ఆయన చర్యలను సమర్థిస్తుండగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ‘కోర్టు ఆదేశాలను అమలు చేయలేదంటే కమిషనర్‌కు ఇంగ్లీష్ రాదని అనుకోవాలా? లేక అర్ధం కాలేదని అనుకోవాలా?’ అంటూ మండిపడ్డారు. తానిచ్చిన ఉత్తర్వులతో పాటు సీజే ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని న్యాయమూర్తి గుర్తు చేశారు. కమిషనర్ జారీ చేసిన నోటీసులను రద్దు చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తే,. ఇవ్వడం సాధ్యం కాదన్నారు..
తమ పార్టీ కార్యాలయ భవనానికి ఆక్యుపెన్సీ సర్టీఫికేట్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలకు, అలాగే తాము సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా అక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీపై నిర్ణయం తీసుకోవాలన్న సీజే ధర్మాసనం ఉత్తర్వులకు విరుద్ధంగా మచిలీçపట్నం మునిసిపల్ కమిషనర్ తిరిగి తమకు నోటీసులు జారీ చేశారంటూ వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయడానికి నిరాకరిస్తూ జారీ చేసిన ఎండార్స్‌మెంట్‌ను కూడా ఆయన సవాలు చేశారు. నాని తరఫున న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ పార్టీ కార్యాలయ భవన నిర్మాణంపై అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు వివరణలు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా పదే పదే నోటీసులు ఇస్తున్నారన్నారు. భవన నిర్మాణం రెండేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ, నిర్మాణ పనులను ఆపాలంటూ నోటీసు ఇచ్చారని తెలిపారు.


