
ప్రపంచంలో ఎన్నో నగరాలు ఉన్నాయి. వీటిలో చారిత్రక ప్రాశస్త్యం గల నగరాలు కొన్ని; ఆధ్యాత్మిక ప్రాధాన్యం గల నగరాలు ఇంకొన్ని; పర్యాటక ఆకర్షణలు గల నగరాలు మరికొన్ని ఉన్నాయి. ఇలాంటి నగరాల గురించి చాలామందికి తెలుసు. వీటికి భిన్నంగా ప్రపంచంలో అక్కడక్కడా రహస్య నగరాలు కూడా ఉన్నాయి. వీటి గురించి బయటి ప్రపంచానికి ఏమీ తెలియదు. ప్రపంచ పటాల్లో కూడా ఈ నగరాలు కనిపించవు. అలాంటి కొన్ని రహస్య నగరాల గురించి,
ఆ నగరాల్లో జరిగే కార్యకలాపాల గురించి తెలుసుకుందాం.
సిటీ 40
ఇది రష్యాలో ఉంది. సోవియట్ ప్రభుత్వం 1946లో అణ్వాయుధాల తయారీ కోసం ఏర్పాటు చేసిన రహస్య నగరాల్లో ఇదొకటి. ఈ నగరంలో దాదాపు లక్షమందికి పైగా జనాభా ఉండేవారు. ఇక్కడకు ఇతరుల రాకపోకలపై కట్టుదిట్టమైన ఆంక్షలు ఉండేవి. రష్యాలోని మిగిలిన నగరాలు, పట్టణాల్లోని పౌరుల కంటే ఈ రహస్య నగరంలోని పౌరులకు నిత్యావసరాల సరఫరా మొదలుకొని రకరకాల సౌకర్యాలు చాలా మెరుగ్గా ఉండేవి. చుట్టూ ఎత్తయిన ఇనుప కంచెల మధ్యనున్న ఈ నగరంలో ఇప్పటికీ ‘అణు’ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇదివరకు ఇక్కడ కొన్ని అణు ప్రమాదాలు జరిగినా, వాటి వివరాలు బయటి ప్రపంచానికి తెలియకుండా నాటి సోవియట్ ప్రభుత్వం కప్పిపుచ్చింది. చెర్నోబిల్ దుస్సంఘటన ప్రపంచాన్ని కుదిపేసిన తర్వాతే ‘సిటీ 40’లో కూడా అణు ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసింది. వాతావరణంలో అణు ధర్మాకత నిండి ఉన్న ఈ నగరంలో ఇప్పటికీ జనాలు నివసిస్తున్నారు. కార్మికులు పనులు సాగిస్తూనే ఉన్నారు. ఈ నగరం మ్యాపుల్లో కనిపించదు. అంతేకాదు, ఇక్కడి పౌరుల వివరాలు కూడా ప్రభుత్వ రికార్డుల్లో కనిపించవు.
ఇది రష్యాలో ఉంది. ఇప్పటి తరానికి చెందిన రష్యన్లలో చాలామందికి ఈ నగరం ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు. ఎందుకంటే, ఈ నగరాన్ని రష్యా మ్యాపుల నుంచి 1947లోనే తొలగించారు. ఇదివరకు దీనిని ‘అర్జామాస్–16’ అనే పేరుతో పిలిచేవారు. సోవియట్ హయాంలో ఇక్కడ అణ్వాయుధాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాక, దీనిని మ్యాపుల నుంచి తొలగించారు. అప్పట్లో ఏర్పాటు చేసిన అణ్వాయుధ తయారీ కేంద్రం ఇప్పటికీ పనిచేస్తోంది. ఈ నగరాన్ని మ్యాపుల నుంచి తొలగించిన విషయాన్ని రష్యా ప్రభుత్వం 1994లో తొలిసారిగా అంగీకరించింది. ఈ నగరంలో పద్దెనిమిదో శతాబ్ది నాటి చర్చి ఉంది. సెయింట్ సెరాఫియన్ ఈ చర్చిలో ప్రార్థనలు జరిపేవారు. ప్రేమ, కరుణ, మానవత్వం వంటి అంశాలపై తన బోధలు వినిపించేవారు. ఆయన బోధలకు భిన్నంగా ఇక్కడ భీకర హింసకు దారితీసే అణ్వాయుధాల తయారీ కొనసాగుతుండటమే విచిత్రం.
బర్లింగ్టన్ బంకర్
ఇది ఇంగ్లండ్‌లో ఉంది. నిజానికి ఇది నగరం కాదు. కేవలం ఒక సువిశాల భూగర్భ స్థావరం మాత్రమే! అయితే, ఇందులో అభివృద్ధి చెందిన నగరాల్లో ఉండే సమస్త సౌకర్యాలూ ఉన్నాయి. కర్మకాలి ఎప్పుడైనా అణు యుద్ధం తటస్థిస్తే, ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి భద్రత కల్పించడానికి యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం ఈ భూగర్భ నగరాన్ని 1950లలో నిర్మించింది. బ్రిటిష్ రాచకుటుంబ సభ్యులు సహా ప్రభుత్వంలోని కీలక పదవుల్లో ఉండే నాలుగువేల మంది ఇందులో సురక్షితంగా ఆశ్రయం పొందడానికి అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. ఈ స్థావరాన్ని ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి నిర్మించి, దశాబ్దాలు గడిచినా దీనిని వినియోగించుకునే అవసరం ఏర్పడలేదు. అవసరం లేని ఈ నిర్మాణానికి ఏటేటా నిర్వహణ వ్యయం పెరుగుతూ రావడంతో ప్రభుత్వం 2016లో దీనిని కారుచౌకగా కేవలం 1.5 మిలియన్ పౌండ్లకు (రూ.17.42 కోట్లు) అమ్మకానికి పెట్టింది. అయినా ఇప్పటి వరకు దీనిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వం దీనిని అమ్మకానికి పెట్టేంత వరకు జనాలకు దీని గురించి తెలియదు.
ఓక్‌రిడ్జ్
ఇది అమెరికాలో ఉంది. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలంలో అమెరికా, దాని మిత్ర దేశాలు యుద్ధాన్ని వీలైనంత త్వరగా పరిసమాప్తం చేయడానికి అణుబాంబు ప్రయోగించడం ఒక్కటే మార్గమని తలచాయి. అణుబాంబు తయారీ కోసం రహస్య స్థావరం, ఆ స్థావరానికి తగిన ఏర్పాట్లు కావలసి వచ్చాయి. అందువల్ల అమెరికా ప్రభుత్వం టెనసీ రాష్ట్రంలోని నాక్స్‌విల్‌కు పడమరన నలభై కిలోమీటర్ల దూరంలో అరవైవేల ఎకరాల ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి, 1943లో ఈ రహస్య నగరాన్ని నిర్మించింది. ఇక్కడ పెద్దసంఖ్యలో సైనికులు, శాస్త్రవేత్తలు, కార్మికులు పనిచేసేవారు. ఈ రహస్య పట్టణాన్ని అమెరికా తన మ్యాపుల్లో చూపలేదు. ఇక్కడ పనిచేసే కార్మికులకు తాము చేసే పని తప్ప, ఇక్కడ జరిగే కార్యకలాపాలేవీ తెలిసేవి కావు. కొంతకాలం పనిచేశాక ఓక్‌రిడ్జ్‌లోని శాస్త్రవేత్తలు అణుబాంబు తయారీకి కీలకమైన శుద్ధి చేసిన యురేనియంను తయారు చేయగలిగారు. ఇక్కడ రెండు యురేనియం శుద్ధి కర్మాగారాలు, ఒక ప్లూటోనియం శుద్ధి కర్మాగారం పనిచేసేవి. దీని గురించి సాధారణ పౌరులకు వివరాలేవీ తెలియవు.
క్యాంప్ సెంచరీ
ఇది గ్రీన్‌లాండ్‌లో ఉంది. బయటి నుంచి చూస్తే, ఇది మంచుకొండల్లో ఏర్పడిన గుహలా కనిపిస్తుంది గాని, నిజానికి ఇది సువిశాల భూగర్భ నగరానికి ప్రవేశమార్గం. గ్రీన్‌లండ్ భూభాగంలో అమెరికా ఏర్పరచుకున్న రహస్య సైనిక స్థావరం ఇది. సోవియట్ కాలంలో రష్యా–అమెరికాల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలంలో రష్యాను దీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో అమెరికా దీనిని నిర్మించింది.
భూగర్భంలో నాలుగువేల కిలోమీటర్ల పొడవున సొరంగ రహదారులతో సైనిక అవసరాలకు కావలసిన శాస్త్ర సాంకేతిక పరిశోధనల కోసం అమెరికా భారీ వ్యయంతో ఈ భూగర్భ నగరాన్ని నిర్మించుకుంది. ‘ప్రాజెక్ట్ ఐస్ వర్మ’ పేరుతో ఇక్కడ సైనిక పరిశోధనలు సాగించింది. ఈ నగరంలో శాస్త్రవేత్తలు, సైనికాధికారులు, ఇతర సిబ్బంది, వారి కుటుంబాలు నివసించడానికి కావలసిన సకల సౌకర్యాలూ ఉన్నాయి.
వారి కోసం ఒక సినిమా థియేటర్, ఒక ప్రార్థన మందిరం కూడా ఉండటం విశేషం.
వన్స్‌డార్ఫ్
ఇది జర్మనీలో ఉంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ రహస్య నగరాన్ని జర్మన్ రాజ్యం 1871లో నిర్మించింది. అప్పట్లో ఇక్కడ ముస్లిం ఖైదీలను బంధించేవారు. వారి కోసం ఇక్కడ మసీదు కూడా నిర్మించారు. ఇదే జర్మనీలోని తొలి మసీదు. నాజీల ప్రాబల్యం పెరిగాక, 1935 నుంచి రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలంలో ఇది నాజీల ప్రధాన రహస్య స్థావరంగా ఉండేది. తర్వాత సోవియట్ రెడ్ ఆర్మీ వశమైంది. అప్పట్లో సోవియట్ సైనికులు వారి కుటుంబాలతో ఇక్కడ నివసించేవారు. దాదాపు 75 వేల జనాభా ఉండే ఈ నగరం ‘లిటిల్ మాస్కో’గా, ‘ఫర్‌బిడెన్ సిటీ’గా పేరుమోసింది. అమెరికాతో ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలంలో రష్యన్ బలగాలు ఇక్కడి నుంచి రహస్య కార్యకలాపాలు సాగించేవి. ఇప్పుడు ఈ నగరం శిథిలావస్థకు చేరుకుంది. నగరం నడిబొడ్డున సోవియట్ బలగాలు నెలకొల్పిన లెనిన్ విగ్రహం మాత్రం ఆనాటి కార్యకలాపాలకు సాక్షీభూతంగా నిలిచి ఉంది.