
ఒకప్పుడు తెరపై మాయాజాలం ప్రదర్శించిన వస్తువులు నేడు మన చేతిలోకి వచ్చేశాయి. సారథిలేని రథాలు కలల దృశ్యాల్లో నడిచేవి. ఇప్పుడు డ్రైవర్‌లెస్ కార్లు రోడ్ల మీదకు వచ్చేశాయి. పురాణాల్లో అక్షయపాత్ర కోరిన భోజనాన్ని వెంటనే వడ్డించేది. నేడు ఫుడ్ డెలివరీ యాప్‌లు దాదాపు అదే తీరులో పనిచేస్తున్నాయి. విలన్ కోటలోని మంత్రదర్పణం నిఘా సాధనంగా ఉంటే, ఇపుడు సీసీ కెమెరాలు ప్రతిచోటా కాపలా కాస్తున్నాయి.శాస్త్ర సాంకేతికతలు ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో సినిమాలు ప్రేక్షకులకు చూపిన అద్భుత స్వప్నాలివి. మానవ మేధ వీటిని ఒక్కొక్కటిగా సాకారం చేస్తూ, వాస్తవ జీవితంలోకి తీసుకొచ్చేసింది.
ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో హీరోలు గాల్లో రెక్కలు కట్టుకొని ఎగిరిపోతే, కార్లు డ్రైవర్ లేకుండా పరిగెత్తితే, గడియారం తిప్పగానే కాలంలో వెనక్కు వెళ్లిపోతే – థియేటర్‌లో కూర్చున్న మనకు ఒక్కటే అనిపించేది: ‘అయ్యో! ఇది కలల్లోనూ జరగదు.’ కాని, జీవితం కూడా ఒక సినిమా కథలాంటిదే కదా! అందుకే, ఆ కల్పనలు ఒక్కొక్కటిగా నిజం అవుతూనే ఉన్నాయి. నేడు స్మార్ట్‌వాచ్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నాం. తెరపై కనిపించిన మాయా అక్షయపాత్రలాగా, ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్ రూపంలో ఇంటి గుమ్మం వద్దకే పిజ్జా చేరుస్తోంది. వర్చువల్ కళ్లజోడు పెట్టుకుంటే మనం గదిలో కూర్చుని కూడా చంద్రుడి మీద నడుస్తున్నాం. మరమనిషి ఒకప్పుడు హీరోకి తోడుగా పోరాడితే, ఇప్పుడు మనకి ఇళ్లలో వాక్యూమ్ క్లీనర్ రూపంలో గచ్చు తుడుస్తోంది. మనుషులు, వస్తువులను మాయం చేసే అదృశ్యశక్తుల పరికరాల ఆవిష్కరణలు, ఇప్పుడు పరీక్షల్లో నిజమయ్యే ఫలితాలను చూపిస్తున్నాయి. మొత్తానికి, సినిమాల్లో కనిపించిన కలల గాడ్జెట్‌లు ఒక్కొక్కటిగా మన దగ్గరికి వచ్చి, మనల్ని బులిపిస్తున్నాయి, ఆశ్చర్య పరుస్తున్నాయి. రేపు తెరపై కనిపించే కొత్త గాడ్జెట్ ఏ రూపంలో మన ఇంటి లివింగ్ రూమ్‌లో దిగిపోతుందో! ఒకవేళ అలా దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
జెట్‌ప్యాక్ – థండర్‌బాల్ (1965)
సినిమాలో హీరో జెట్‌ప్యాక్ వేసుకొని భవనం మీద నుంచి ఎగిరిపోతాడు. ఆ సన్నివేశం చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయి ‘ఇది అసలు సాధ్యమేనా?’ అనుకున్నారు. కాని, 1961లోనే అమెరికా రక్షణ పరిశోధన సంస్థ బెల్ ఏరోసిస్టమ్స్ కంపెనీతో కలిసి మొదటి జెట్‌ప్యాక్‌ను పరీక్షించింది. తర్వాత 2011లో ఫ్రాన్స్‌లో, 2019లో అమెరికాలో పర్యాటక ప్రదర్శనల్లో వాడారు. కొన్ని దేశాల సైన్యాలు కూడా శిక్షణలో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నాయి. ఇంకా మన దగ్గరకు రాలేదు కాని, ఒకవేళ వస్తే? మొదటగా ట్రాఫిక్ దాటడానికి ఉపయోగించవచ్చు.
లేజర్ కట్టర్ – గోల్డ్‌ఫింగర్ (1964)
సినిమాలో హీరోను కుర్చీకి కట్టి, కింద నుంచి లేజర్ ఆన్ చేసే సన్నివేశం మరచిపోలేనిది. అప్పట్లో అది కత్తి కంటే భయంకరంగా అనిపించింది. ఆ కాలంలో లేజర్ టెక్నాలజీ కొత్తగా ఉండేది, ప్రజలు అద్భుతంగా భావించారు. కాని, 1960లో అమెరికా శాస్త్రవేత్త థియోడోర్ మైమన్ మొదటి లేజర్‌ను రూపొందించారు. 1970ల నుంచి వైద్యరంగంలో కంటి శస్త్రచికిత్సలకు, 1980లలో పారిశ్రామిక రంగంలో లోహాలను కత్తిరించడానికి ఉపయోగించడం మొదలైంది. నేడు పచ్చబొట్లను తొలగించడం నుంచి ఎన్నోరకాల శస్త్రచికిత్సల వరకు లేజర్ వాడకం సాధారణంగా మారింది.
రోలెక్స్ గాడ్జెట్ వాచ్ – లివ్ అండ్ లెట్ డై (1973)
గడియారం అంటే అప్పట్లో సమయం చెప్పే యంత్రం మాత్రమే! కాని, బాండ్ వాచ్? శత్రువు బుల్లెట్లను దూరంగా తోసే మాగ్నెట్, తలుపులు తెరిచే లేజర్, అవసరమైతే విద్యుత్ షాక్ కూడా! అది చూసి, ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇప్పుడు ఆ పనులన్నీ మన వాచ్ కూడా చేస్తుంది. 1972లో హామిల్టన్ కంపెనీ మొదటి డిజిటల్ వాచ్ విడుదల చేసింది. 2010లలో యాపిల్, శాంసంగ్ స్మార్ట్‌వాచ్‌లు మార్కెట్లోకి వచ్చాయి. ఒకప్పుడు బాండ్ వాచ్ శత్రువులను ఎదుర్కొంటే, ఇప్పుడున్న వాచ్ అంతకంటే ఎక్కువ పనులే చేస్తుంది. అడుగులు లెక్కపెడుతుంది, నిద్ర కొలుస్తుంది, గుండె కొట్టుకోవడమే కాదు – ‘నువ్వు ఎక్కువగా కూర్చున్నావు, ఇక లే’ అని హెల్త్ అలర్ట్ కూడా ఇస్తుంది.
సబ్‌మరైన్ కారు – ది స్పై హూ లవ్డ్ మీ (1977)
బాండ్ లోటస్ కారు నీటిలోకి దూకి సబ్‌మరైన్ గా మారిపోతే థియేటర్‌లో చప్పట్లు మిన్నంటాయి. ఆ సమయంలో ఇలాంటిది ఊహించడమే గొప్ప. ఇప్పుడు చిన్న పర్సనల్ సబ్‌మరైన్ ్స ఉన్నాయి. 2008లో టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ కారుకు ప్రేరణగా ఒక సబ్‌మరైన్ కారు ప్రాజెక్ట్ ప్రకటించాడు. చిన్నపాటి వ్యక్తిగత సబ్‌మరైన్లు ఇప్పటికే లగ్జరీ యాట్స్‌లో ఆటబొమ్మల్లా వాడుతున్నారు. మన దగ్గర అయితే? పెద్ద పెద్ద చేపలు పట్టి బజారులో అమ్మడానికి కూడా వాడుతున్నారు.
కమ్యూనికేటర్ వాచ్ – డిక్ ట్రేసీ (1946)
హీరో తన గడియారంలోనే ఫోన్ కాల్ మాట్లాడిన సీన్ అప్పట్లో ప్రేక్షకులకు అద్భుతం. చాలామందికి అది జాదూగా అనిపించింది. ఇప్పుడేమో మనకు స్మార్ట్‌వాచ్‌లు సాధారణమే. 1970లలో మొదటి వాచ్ రేడియో వచ్చింది. 2000ల తర్వాత స్మార్ట్‌వాచ్‌లు అభివృద్ధి చెందాయి. ఇప్పుడు వాచ్‌తోనే వీడియో కాల్స్ కూడా చేయగలుగుతున్నారు. దీంతోనే జీపీఎస్ ఆధారంగా లొకేషన్ షేరింగ్, అలెర్ట్ బటన్స్ వంటివి కూడా ఉపయోగించుకోగలుగుతున్నారు.
స్టార్‌ట్రెక్ కమ్యూనికేటర్ – స్టార్‌ట్రెక్ (1966)
చిన్న పరికరంలా కనిపిస్తూ ఓపెన్ చేసే ఫోన్. అంటే మన ఆధునిక భాషలో ఫోల్డబుల్ ఫోన్. అప్పట్లో ఫోన్ మూసే శబ్దం ‘క్లక్!’ ఒక స్టయిల్ ఐకాన్‌గా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరినీ ఆకట్టుకున్న విషయం. ఇప్పుడు మనకు టచ్ స్క్రీన్ ఫోన్లకు డిమాండ్ ఉన్నా, ఫ్లిప్ ఫోన్ డిజైన్‌కే క్రేజ్ ఉంది.
ట్రైకార్డర్ – స్టార్‌ట్రెక్ (1966)
ఒక చిన్న పరికరం శరీరాన్ని స్కాన్ చేసి ఆరోగ్య ఫలితాలు చెబుతుంది. అప్పట్లో అది అద్భుతం. కాని, 2017లో అమెరికా ‘క్వాల్కమ్ ట్రైకార్డర్ ఎక్స్ ప్రైజ్’ పోటీలో కొన్ని కంపెనీలు వాస్తవికంగా రోగ నిర్ధారణ చేసే స్కానర్లు అభివృద్ధి చేశాయి. ఇప్పుడు పోర్టబుల్ మెడికల్ స్కానర్లు సాధారణం అవుతున్నాయి. మన ఇంట్లో ఉంటూనే రోజూ స్కాన్ చేసి మన ఆరోగ్య విషయాలను తెలుసుకోవచ్చు.
హోవర్‌బోర్డ్ – బ్యాక్ టు ది ఫ్యూచర్ 2 (1989)
గాల్లో ఎగిరే స్కేట్‌బోర్డ్ అప్పట్లో కలలా కనిపించింది. 2015లో లెక్సస్ కంపెనీ మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో హోవర్‌బోర్డ్‌ను ప్రదర్శించింది. ఇప్పుడు వాటిల్లో ఎన్నో ప్రోటోటైప్‌లు ఉన్నాయి, అయితే ఖరీదు ఎక్కువ. వినియోగం పరిమితం. మన దగ్గర ఉంటే? ఎక్కువగా వర్షకాలంలో గుంతలు దాటడానికి ఉపయోగిస్తామేమో!
ఎలక్ట్రికల్ కారు, ఎగిరే కార్లు – బ్యాక్ టు ది ఫ్యూచర్ (1985)
ఇంధనంతో నడిచే కార్లు కామన్ కాని, విద్యుత్ శక్తితో నడిచే కారు– అది కూడా అవసరమైనప్పుడల్లా గాల్లో ఎగురుతుంది. ఇది చూసి, అందరూ ఆశ్చర్యపోయారు. కాని, ప్రపంచంలోనే మొదటి విద్యుత్ కారు 1880లలోనే తయారైంది! కాలక్రమంలో పెట్రోల్ చౌక కావడంతో దాదాపు శతాబ్దానికి పైగా అవి మూలపడ్డాయి. పూర్తిగా, 1996లో అమెరికా ‘జీఎం ఈవీ1’ అనే ఆధునిక ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లోకి తెచ్చింది. 2008 తర్వాత టెస్లా రాకతో విద్యుత్ కార్లు మళ్లీ పుంజుకున్నాయి. భారత్‌లో 2010 తర్వాత టాటా, మహీంద్రా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం మొదలుపెట్టాయి. 2021లో జపాన్ ‘స్కైడ్రైవ్’ కంపెనీ ఫ్లైయింగ్ కారును విజయవంతంగా పరీక్షించింది. ఒకవేళ మన దగ్గర వస్తే? ట్రాఫిక్ టెన్షనే ఉండదు.
వాయిస్ కార్ (కిట్) – నైట్‌రైడర్ (1982)
హీరో కారుతో మాట్లాడుతూ – ‘హే కిట్, రా!’ అని పిలిస్తే వెంటనే కారు వచ్చేది. ఇప్పటి సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్స్ ఇదే చేస్తున్నాయి. కాని, కొన్నిసార్లు ఇవి పొరపాటున తప్పు దారి చూపించడం మాత్రం ఇంకా మానలేదు.
భారతీయ సినిమాలు ఎప్పటి నుంచో కేవలం వినోదం మాత్రమే కాదు, ఊహాశక్తికి అద్దం పట్టే వేదికలు కూడా. ఇక్కడ హీరో పాట పాడితే పూలు కురుస్తాయి, విలన్ చేతిలోంచి మంటలు ఎగసిపడతాయి, దేవతలు ఆకాశం నుంచి దిగిపోతారు. కాని, వీటన్నింటికంటే ఆసక్తికరమైనవి సినిమాల్లో కనిపించే గాడ్జెట్లు.
‘మాయాబజార్’లో ఘటోత్కచుడు తెరిచిన మాయాపేటిక– ప్రియదర్శిని, ‘ఆదిత్య 369’లో టైమ్ మెషిన్, జగదేకవీరుడు అతిలోకసుందరిలో కనిపించిన శ్రీదేవి ఉంగరం. ఇవన్నీ అప్పట్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాయి. ‘ఇలాంటివి నిజంగా ఎప్పుడైనా వస్తాయా?’అనుకున్నారు. ఆ కలలే తర్వాత ఒక్కొక్కటిగా వాస్తవ రూపం దాల్చాయి.
టైమ్ మెషిన్ – ఆదిత్య 369 (1991)
బాలకృష్ణ టైమ్ మెషిన్ లో కూర్చుని గతానికి, భవిష్యత్తుకి వెళ్తాడు. ఈ కాలయానం ఇప్పటికీ పూర్తిగా ఊహే. కానీ 1905లో ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతం ప్రకారం కాంతి వేగానికి దగ్గరగా వెళ్తే కాలప్రవాహం మారుతుందని నిరూపించారు. అంటే సినిమా కల్పన అయినా, దానికి శాస్త్రీయ పునాది ఉంది. భవిష్యత్తులో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
అదృశ్య గడియారం – మిస్టర్ ఇండియా (1987)
అనిల్ కపూర్ గడియారం పెట్టుకున్న వెంటనే కనబడకుండా పోతాడు. ఇది 2006లో అమెరికాలో శాస్త్రవేత్తలు మెటా పదార్థాలు వాడి చిన్న వస్తువులను అదృశ్యం చేయగలిగారు. 2015లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మరింత మెరుగైన ప్రయోగాలు చేసి, మరికొన్ని వస్తువులను అదృశ్యం చేయడాన్ని ప్రదర్శించింది.
మాయాపేటిక – మాయాబజార్ (1957)
ఘటోత్కచుడు పెట్టె తెరిస్తే ఎవరు కోరుకున్నవి వాళ్లకు కనిపిస్తాయి– బంగారం కావచ్చు, భోజనం కావచ్చు. ఇప్పుడు ఒక్క బటన్ నొక్కితే భోజనం మన ఇంటి తలుపు దగ్గరే! 2010 తర్వాత ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ఈ కలను వాస్తవం చేశాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్ కూడా అచ్చం ఆ పెట్టెలా – మనం ఏం కోరుకుంటామో, దాన్నే చూపిస్తుంది.
మరమనిషి – రోబో (2010)
రజనీకాంత్ ఈ సినిమాలో ‘చిట్టి’ పాత్రలో జనాలను మెప్పించారు. ‘చిట్టి’ చదివే, ప్రేమించే, కోప్పడే మరమనిషి. 2016లో హాంకాంగ్ ‘హాన్సన్ రోబోటిక్స్’ రూపొందించిన ‘సోఫియా’ రోబో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2021లో టెస్లా కూడా మానవాకార రోబో ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. నేడు రోబోలు ప్రధానంగా పరిశ్రమల్లో, స్మార్ట్ హోమ్‌లలో సహాయకులుగా ఉన్నా, మన ‘చిట్టి’లా భావోద్వేగాలు పంచుకునే రోబోలు ఇంకా పూర్తిస్థాయిలో రాలేదు.
భవిష్యత్ కళ్లజోడు – రావన్ (2011)
ఈ సినిమాలో కళ్లజోడు పెట్టుకుంటే హీరో ఆటలోకి ప్రవేశిస్తాడు. 2012లో మొదటి వర్చువల్ రియాలిటీ పరికరాలు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని గేమ్స్, పాఠశాలలు, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల్లో వాడుతున్నారు.
శక్తిమంతమైన దుస్తులు – క్రిష్ (2006)
హీరో ప్రత్యేక దుస్తులు వేసుకున్న వెంటనే అద్భుత శక్తులు పొందుతాడు. 2013లో అమెరికా సైన్యం ‘ఎక్సోస్కెలిటన్ ’ సూట్లను అభివృద్ధి చేసింది. ఇవి ధరిస్తే భారాన్ని మోయడం సులభం అవుతుంది, ప్రమాదాల నుంచి రక్షణ కలుగుతుంది. భవిష్యత్తులో ఇవి సామాన్యులకు కూడా అందుబాటులోకి రానున్నాయి.
మాయా పరికరం– జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)శ్రీదేవి దగ్గర ఉన్న మాయా ఉంగరం ఏ పనైనా ఇట్టే చేసేస్తుంది. 2007 తర్వాత స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలోకి వచ్చి బ్యాంకింగ్, షాపింగ్, భోజనం ఆర్డర్, సంభాషణ – అన్నీ ఒకే పరికరంలో సాధ్యమయ్యాయి. సినిమాలో మాదిరే బటన్ నొక్కగానే ఇంట్లో తలుపులు తెరుచుకోవడం, భోజనం సిద్ధమవ్వడం, బట్టలు మడతవేయడం చూసి ప్రేక్షకులు ‘అరే వాహ్!’ అనుకున్నారు. కాని, నేడు మన ఇళ్లలోని వాషింగ్ మెషిన్ , డిష్ వాషర్, మైక్రోవేవ్, వాక్యూమ్ క్లీనర్ అన్నీ ఆటోమేటిక్. ఇంకా మొబైల్‌తో నియంత్రించే ‘స్మార్ట్ హోమ్’ అప్లికేషన్స్ ఎన్నో వచ్చేశాయి. ఒక్క సైగ చేస్తే లైటు వెలిగిపోతుంది, ఫ్యాన్ ఆగిపోతుంది.
సీసీ కెమెరా – రాక్షసరాజు, గజని గంధర్వుడు
పాత సినిమాల్లో విలన్ కోటలోకి ఎవరెవరు వస్తున్నారో కనిపెట్టడానికి ఒక పెద్ద అద్దం ముందు కూర్చుని ‘సీసీ టీవీ’లా చూపించే సన్నివేశాలు గుర్తున్నాయా? అప్పట్లో అది మాంత్రిక ప్రభావంలా అనిపించింది. కాని, 1960లోనే మొదటి సీసీ కెమెరాలను జర్మనీలో సైనిక వినియోగానికి వాడారు. తర్వాత 1990లలో వాణిజ్య రంగంలోకి వచ్చి, 2000ల తర్వాత భారత్‌లో ఇళ్లలో, ఆఫీసుల్లో, రోడ్లపైకి కూడా విస్తరించాయి. ఇప్పుడు ఇవి లేకుండా భద్రత ఊహించలేము.
హోలోగ్రామ్ సన్నివేశం – జీన్స్ (1998)
హీరోయిన్ హోలోగ్రామ్ టెక్నాలజీని వినియోగించి సంగీతం, నృత్యం, కొన్ని విచిత్ర సందర్భాలు చూపిస్తూ నవ్వించే ప్రదర్శన ఇస్తుంది. ఆ హోలోగ్రామ్ సన్నివేశం అప్పట్లో కేవలం సినిమా మ్యాజిక్, స్పెషల్ ఎఫెక్ట్ మాత్రమే! కాని, హోలీగ్రామ్ టెక్నాలజీ నిజ జీవితంలో అంతకుముందే రూపుదిద్దుకుంది. 1960లో లేజర్ ఆవిష్కరణతో హోలోగ్రఫీ శాస్త్రానికి పునాది పడింది. 2012లో టుపాక్ షకూర్ అనే ర్యాపర్ మరణించినా, అతని హోలోగ్రామ్ ప్రదర్శన కోచెల్లా స్టేజ్‌పై ప్రత్యక్షమై ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. ఆ తర్వాత మైకేల్ జాక్సన్ , ఎల్విస్ ప్రెస్లీ వంటి ప్రముఖుల ప్రదర్శనలకు కూడా హోలోగ్రామ్‌ను వినియోగించారు. నేడు హోలోగ్రామ్‌లు విద్య, వైద్యం, వ్యాపార సమావేశాలు, వర్చువల్ ఈవెంట్స్ వంటి అనేక రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. ఇక భవిష్యత్తులో మన ఇళ్లలో, పెళ్లిళ్లలో, సమావేశాల్లో హోలోగ్రామ్ రూపంలో అతిథులకు ‘హాయ్!’ చెప్పే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి.
డ్రైవర్ లేని కార్లు – శ్రీకృష్ణ పాండవీయమ్ (1966)
ఘటోత్కచుడు తన మాయాశక్తితో రథాన్ని సారథి లేకుండానే నడిపిస్తాడు. ఇదే విధంగా మరెన్నో పాత చిత్రాల్లో రథం లేదా కారు దేవతా శక్తితో తనంతట తానే నడుస్తుంది. డ్రైవర్ లేని వాహనం అప్పట్లో కల్పన. 2010 తర్వాత గూగుల్, టెస్లా, ఊబెర్ వంటి కంపెనీలు అమెరికా, జపాన్ , యూరప్‌లలో స్వయంచాలిత కార్లను రోడ్లపై పరీక్షించాయి. 2020లలో కొన్ని నగరాల్లో టాక్సీ సర్వీసులుగా కూడా ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి.
నిన్న సినిమాల్లో కలలా కనబడినవి, నేడు శాస్త్రవేత్తల చేతుల్లో వాస్తవమయ్యాయి. రేపు మరెన్నో ఆవిష్కరణలతో, ఊహలకు కూడా అందని పరికరాలు జీవితంలో భాగమవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలా రీల్ నుంచి రియల్‌కి ప్రయాణించే ఈ గాడ్జెట్ కథలు అంతులేని కథలా కొనసాగుతూనే ఉంటాయి!
ఊహలకు అందని ఆవిష్కరణలు!
భవిష్యత్తు ఊహలు ఇప్పటికీ తెరపై మాయాజాలంలా కనబడుతున్నా, రేపటికి అవి మన జీవితంలో రొటీన్ గా మారిపోవడం ఖాయం. ఒక టెలిపోర్టేషన్ మెషిన్ తో ఇంటి గుమ్మం నుంచి నేరుగా ఆఫీసు కుర్చీలో కూర్చోవచ్చు. అప్పుడు ట్రాఫిక్ అనే టెన్షన్ ఉండదు. మెమరీ ట్రాన్ ్సఫర్ గాడ్జెట్‌తో పరీక్ష ముందు రాత్రుళ్లు నిద్ర మానుకుని పుస్తకం చదవాల్సిన అవసరమే లేదు, సబ్జెక్ట్ డౌన్ లోడ్ చేసుకుంటే చాలు! ఆలోచన చదివే పరికరం మన మైండ్‌లో దాగి ఉన్న మాటల్ని బయటపెడుతుంది, అప్పుడు ‘ఏం అనుకుంటున్నావు?’ అనే ప్రశ్నే ఉండదు. రోబో–షెఫ్ మన ఇష్టం అడిగి భోజనం సిద్ధం చేస్తాడు, డ్రోన్లు కిరాణా వస్తువులను గుమ్మం ముందు పడేస్తాయి. నిద్రలో చూసిన కలలను కలల ప్రొజెక్టర్‌లో సినిమాలా తిరిగి చూడగలిగే రోజులు కూడా వస్తాయి. గాల్లో ఎగిరే మనుషుల్లా మారిపోతే, ట్రాఫిక్‌ను చరిత్రలోకి నెట్టేయవచ్చు. స్వయంచాలిత డ్రోన్ ప్యాకేజీలతో పాటు మనల్ని కూడా ఎయిర్‌టాక్సీలా తీసుకెళ్తాయి. ఇక ఇంట్లో పనులు? రోబో మేడ్స్, స్మార్ట్ ఫర్నిచర్ అన్నీ స్వయంగా చూసుకుంటాయి. నేడు ఇవన్నీ సైన్ ్స ఫిక్షన్ లా అనిపిస్తున్నా, నిన్న ఫోన్ లేకుండా ఊహించలేనట్టు, రేపు ఈ గాడ్జెట్‌లు లేకుండా కూడా జీవితాన్ని ఊహించలేకపోవచ్చు.