
శ్రీమహావిష్ణువు ఒకప్పుడు దానవులతో పదివేల సంవత్సరాలు యుద్ధం చేయవలసి వచ్చింది. యుద్ధంలో దానవులను దునుమాడిన తర్వాత అలసిన అతడు పద్మాసనంపై కూర్చుని, ధనుస్సుకు చివర తలవాల్చి, నిద్రలోకి జారుకున్నాడు.అదే సమయంలో ఇంద్రాది దేవతలు విష్ణువు సహాయంతో ఒక యాగాన్ని చేయాలని సంకల్పించుకున్నారు. ఈ సంగతిని విన్నవించుకోవడానికి దేవతలందరూ మహావిష్ణువు దగ్గరకు వెళ్లారు. అప్పుడు ఆయన ఆదమరచి నిద్రపోతూ కనిపించాడు. అలాంటి పరిస్థితిలో ఆయనకు మేల్కొలపడం ఎలాగని దేవతలు చింతాక్రాంతులయ్యారు.
‘నిద్రాభంగం చేయడం దోషం. అలా చేయవద్దు’ అన్నాడు ఇంద్రుడు.అప్పుడు బ్రహ్మ కలగజేసుకుని, ‘నేను ఒక చెదపురుగును సృష్టించి, దానిని విష్ణుధనువు నారిని కొరికేలా ఆజ్ఞాపిస్తారు. నారి తెగినప్పుడు ఏర్పడే ధ్వనికి దేవదేవుడు మేల్కొంటాడు’ అని చెప్పి, చెదపురుగును సృష్టించి, వింటినారిని కొరకమని ఆజ్ఞాపించాడు. ‘ఈ పాపకార్యం చేయడం వల్ల నాకు నరకం తప్ప ఒరిగేదేమిటి?’ అని బ్రహ్మదేవుడిని అడిగింది చెదపురుగు.‘నీకు నరకం ఉండదు. మేం తలపెట్టిన యాగంలో నీకూ కొంత భాగం ఇస్తాం’ అని మాట ఇచ్చాడు బ్రహ్మదేవుడు.
చెదపురుగు వెంటనే వెళ్లి, విష్ణువు వింటినారిని కొరికింది. భీకరమైన ధ్వని ఏర్పడింది. దేవతలు చూసేసరికి కిరీట కుండలాలతో ప్రకాశించే విష్ణువు తల కనిపించలేదు. నారి తాకిడికి అతడి తల తెగిపోయింది. ఇది చూసి దేవతలు హాహాకారాలు చేశారు.
బృహస్పతి జోక్యం చేసుకుని, ‘ఇప్పుడు ఇలా ఏడ్వడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? తరుణోపాయం ఏమిటో ఆలోచించాలి గాని’ అన్నాడు. ‘ఇంతటి విపత్కర పరిస్థితి నుంచి బయటపడాలంటే, పరదేవతను ఆశ్రయించడం తప్ప గత్యంతరం లేదు’ పలికాడు బ్రహ్మదేవుడు.
దేవతలందరూ హుటాహుటిన జగన్మాత వద్దకు వెళ్లి, ఆమెను వేనోళ్ల స్తుతించి, తమను ఈ విషమ పరీక్ష నుంచి గట్టెక్కించమని ప్రార్థించారు.‘దేవతలారా! వినండి. శ్రీహరి శిరస్సు తెగిపడటానికి ఒక కారణం ఉంది. పూర్వం అతడు తన ప్రియురాలి ముఖం చూసి నవ్వాడు. ఆమె కుపితురాలై, నీ తల తెగిపడుగాక అని శపించింది. ఆ శాపం ఇప్పుడిలా ఫలించింది. ఇందులో మరో విషయం కూడా ఉంది. పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు సరస్వతీ నదీతీరంలో నా గురించి ఘోరతపస్సు చేశాడు. నేను అతడికి ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, మరణం లేకుండా వరం కావాలన్నాడు.
పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు గనుక అది అసాధ్యమని చెప్పాను. దానికి బదులుగా మరో వరం కోరుకోమని చెప్పాను. తనకు గుర్రం ముఖం ఉండేవాని వల్ల తప్ప మరెవరివల్లా మరణం లేకుండేలా అనుగ్రహించమన్నాడు. నేను సరేనని వరమిచ్చాను. అతడు వరగర్వంతో లోకులను, బ్రాహ్మణులను పీడించడం మొదలుపెట్టాడు. అతడి ఆగడాలు నానాటికీ శ్రుతిమించుతుండటంతో భక్తులు మొరపెట్టుకుంటున్నారు. అతడి అంతానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. అందువల్ల ఇప్పుడు బ్రహ్మదేవుడు గుర్రం తలను తెప్పించి, శ్రీహరికి అతికించినట్లయితే, అతడు పునర్జీవితుడై, ఆ రాక్షసుడిని సంహరించగలడు’ అని జగన్మాత పలికింది.
ఆమె మాటలకు దేవతలు సంతోషించి, ఆమెను మరోసారి స్తుతించారు.బ్రహ్మదేవుడు వెంటనే విశ్వకర్మను పిలిపించాడు.అతడికి జరిగినదంతా చెప్పి, తెగిపడిన శిరస్సు స్థానంలో శ్రీహరికి గుర్రం శిరస్సును అతికించాలని ఆదేశించాడు. విశ్వకర్మ ఒక గుర్రం తలను నరికి తీసుకువచ్చాడు. దానిని విష్ణువుకు అతికించాడు. అలా విష్ణువు హయగ్రీవ అవతారం దాల్చాడు. హయగ్రీవుడిగా మేల్కొన్న శ్రీహరికి ఇంద్రాది దేవతలందరూ జయజయ ధ్వానాలు పలికారు. హయగ్రీవుడనే అసురుడి ఆగడాలను తెలిపి, జగన్మాత చెప్పిన ప్రకారం అతడిని సంహరించి, లోకాలకు పీడను విరగడ చేయమని కోరారు.హయగ్రీవావతారంలో శ్రీహరి హయగ్రీవుడనే అసురుడిపై యుద్ధానికి వెళ్లాడు.హోరాహోరీగా సాగిన యుద్ధంలో శ్రీహరి తన సుదర్శనచక్రాన్ని ప్రయోగించి, హయగ్రీవాసురుడిని సంహరించాడు.
∙సాంఖ్యాయన