
కుంతలదేశాన్ని రత్నాకరుడు పాలించేవాడు. అతని కూతురు ప్రభావతి. ఒకసారి ప్రభావతి తన ఇష్టసఖులతో చెరువు గట్టున ఉన్న చెట్టుకు తాడుతో ఊయలలు వేసుకుని ఊగుతుండగా, పట్టు జారి నీళ్లలో పడిపోయింది. ఇష్టసఖులు ‘కాపాడండి... కాపాడండి’ అని గట్టిగా కేకలు వేశారు. అటుపక్కగా పడవలో ఉన్న జాలరి చిన్నయ్యకు ఆ కేకలు వినిపించాయి. వెంటనే అతడు నీటిలోకి దూకాడు. ఈదుతూ వెళ్లి, మునిగిపోతున్న ప్రభావతిని కాపాడి, ఒడ్డుకు చేర్చి తాగిన నీటిని కక్కించాడు. ‘కొన్ని క్షణాలు ఆలస్యం అయితే ఆమె ప్రాణానికే హాని కలిగేది’ అన్నాడు చిన్నయ్య. ఇష్టసఖులు ఆతనికి కృతజ్ఞతలు చెప్పారు.
యువరాణితో పాటు అందరూ రథంలో కోటకు చేరారు. విషయం తెలిసిన మహారాజు ఇక మీదట నీటి ప్రాంతం వైపు వెళ్లవద్దని యువరాణిని మందలించాడు. మహారాణి ప్రభావతి మెడలో వజ్రాలహారం కనబడలేదు అని గుర్తించింది. మంత్రితో చెప్పి ఆ జాలరిని పిలిపించమన్నాడు రాజు. చిన్నయ్య వచ్చాడు. ‘యువరాణిని కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు. కాని, ఆమె మెడలో వజ్రాలహారం మాయమైంది. ఇందుకు నీ సమాధానం!’ అన్నాడు రాజు.‘మహారాజా! అరుపులు విని యువరాణిని కాపాడాను. ఆ హారం గురించి నాకేమీ తెలియదు!’ అన్నాడు చిన్నయ్య. ‘ఆ హారం దొరికే వరకు ఇతణ్ణి చెరసాలలో బంధించండి’ అని ఆదేశించాడు రాజు. విషయం తెలిసిన చిన్నయ్య తల్లిదండ్రులు లచ్చి,పెద్దయ్య వచ్చి, మహారాజును ఎంతగా వేడుకున్నా ఫలితం లేకపోయింది. ‘మహారాజా! ఆ జాలరి లేకపోతే ఆ సమయంలో యువరాణిని ఎవరు కాపాడేవారు’ అన్నాడు న్యాయాధికారి. ‘యువరాణిగారి జాతకంలో ఆమెను ప్రాణాపాయం నుండి కాపాడిన వాడితోనే వివాహం జరుగుతుంది అని ఉంది మహారాజా!’ అన్నాడు మంత్రి.
ఇద్దరి మాటలూ విన్న రాజు మౌనంగా తన ప్రత్యేక మందిరానికి వెళ్లిపోయాడు. ఇంటికి విచారంగా వచ్చిన పెద్దయ్య, లచ్చి ‘మనవాడు రెండు, మూడుసార్లు బంగారు రంగు చేప గురించి చెప్పాడు. వలలో పడ్డా విడిచి పెట్టానని’ అన్నాడు పెద్దయ్య. ‘అవును మావా! రేపు మనం కూడా పడవ వేసుకుని ఆ చెరువులోకి వెళదాము’ అంది లచ్చి.మరుసటి రోజు పడవలో చెరువుకు వెళ్లి వల వేశారు కాని, బంగారు రంగు చేప పడలేదు. అలా రెండు మూడు రోజులు వెళ్ళాక ఒక రోజు చిన్నయ్య పడవను గుర్తు పట్టిన ఆ బంగారు చేప వలలో పడింది.
‘చినయ్య లేడా... మీరు ఎవరు?’ అని అంది ఆ చేప. ‘మేము చిన్నయ్య అమ్మా అయ్యలం’ అని జరిగింది చెప్పారు. ‘నేను నీటిలో దొరికిన చాలా వస్తువులను నీటి అడుగున ఒక స్థలంలో దాచాను. ఈ మద్యనే ఒక వజ్రాల హారం దొరికింది. రేపు రాజుగారిని ఇదే చోటుకు తీసుకు రండి. ఇక నన్ను వదలండి, ఊపిరి ఆడడం లేదు’ అంది ఆ బంగారు రంగు చేప.
‘అలాగే’ అని నీటిలో వదిలేశారు లచ్చి, పెద్దయ్యలు. మరుసటి రోజు లచ్చి,పెద్దయ్యలు కోటకు వెళ్లి చేప విషయం చెప్పారు. రాజు, మంత్రి వారితో కలసి పడవలో ఆ చెరువుకు వెళ్లి చేప చెప్పిన ప్రదేశం వద్ద ఆగారు. కాసేపటికి ఆ బంగారు చేప వచ్చి వారిని చూసి ‘ఇప్పుడే వస్తాను’ అని మళ్లీ నీటిలోకి వెళ్లి, నోటితో ఒక్కొక్క నగ తెచ్చి వారికి ఇచ్చింది. వాటిలో ఎన్నో నగలతో పాటు ప్రభావతి వజ్రాలహారం కూడా ఉంది. ‘ఇందులో మా రాజవంశానికి చెందిన వారు పోగొట్టుకున్న బంగారు వస్తువులు కూడా ఉన్నాయి. నీకు కృతజ్ఞతలు’ అన్నాడు రాజు.‘నీటిలో దొరికిన వీటిని మా పిల్లల కోసం దాచాను’ చెప్పింది బంగారు చేప. మంత్రి కూడా చేపను మెచ్చుకున్నాడు.‘రాజా! ఇక చిన్నయ్యను వదిలేయండి. నేను ఉంటాను’ అని నీటిలోకి వెళ్లిపోయింది ఆ చేప. ‘కోటకు చేరుకోగానే మీ అబ్బాయిని విడుదల చేస్తాము’ అన్నాడు రాజు, చిన్నయ్య తల్లిదండ్రులతో.‘అలాగే మారాజా!’ అన్నారు వారు.
మహారాజుతో మంత్రి, న్యాయాధికారి సమావేశమయ్యారు. ‘చూశారా మహారాజా... అమాయకుడు అయిన జాలరి చిన్నయ్యను చెరలో పెట్టించారు. పోయిన వజ్రాల హారంతో ఎప్పుడో పోయిన విలువైన బంగారు వస్తువులు అతని వల్లనే కదా దొరికాయి. అతని వలలో పడ్డ ఆ బంగారు చేపను మన కోటకు తెచ్చి అమ్ముకొని ఉంటే ఆ ధనం కొన్ని నెలలు వారి కుటుంబ పోషణకు వచ్చేది. చిన్నయ్య దయగల వాడు కనుకనే నీటిలో వదిలేశాడు’ అన్నాడు న్యాయాధికారి. ‘అవును మహారాజా! అతను జాలరి అయితే కావచ్చు. అతనిని గురుకులంలో చేర్పించి, అన్ని విద్యలూ నేర్పించి ప్రయోజకుడు అయ్యాక యువరాణిని ఇచ్చి వివాహం జరిపించడం ఉత్తమమైన పని’ అన్నాడు మంత్రి. ‘అవును మీరు అన్నట్లు ప్రాణాలు కాపాడినవాడు ఉత్తముడు’ అన్నాడు రాజు. తరువాత చిన్నయ్యను గురుకులంలో చేర్పించి, అతడు సకల విద్యలూ పూర్తి చేశాక యువరాణితో వివాహం జరిపించాడు రాజు. చిన్నయ్యతో పాటు అతని తల్లిదండ్రులు, గూడెం ప్రజలు రాజుగారి సంస్కారాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు.
జాలరి చిన్నయ్య..!