
దక్షిణ కొరియాలోని జియోంగ్‌సాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న జింజు నగరంలో ఏటా జరిగే ఈ జింజు లాంతర్ ఫెస్టివల్ చాలా ప్రత్యేకంగా నడుస్తుంది. రంగురంగుల లాంతర్లతో జింజులోని నామ్‌గాంగ్ నది ప్రాంగణం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోతుంది.
ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో వచ్చే ఈ దీపాల పండుగ.. సుమారు రెండువారాలకు పైగానే కొనసాగుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 19 వరకు జింజు నగరాన్ని మెరిపిస్తుంది. ఈ పండుగ మూలాలు సుమారు 400 సంవత్సరాల నాటి పురాతన చరిత్రను చెప్పుకొస్తాయి.
జింజు నగరం 1592లో సైనిక కేంద్రంగా ఉండేది. ఆనాడు జపాన్ దండయాత్ర జరిగినప్పుడు జింజు కోటను రక్షించుకోవడానికి వేలాది మంది దక్షిణ కొరియా సైనికులు ప్రాణాలను కోల్పోయారు. వారి ప్రాణత్యాగాలకు గుర్తుగా నేటికీ ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. జపాన్ సైన్యం నామ్‌గాంగ్ నదిని దాటకుండా నిరోధించడానికి, వారిని తికమకపెట్టడానికి– కొరియన్ సైనికులు నీటిపై లాంతర్లను వదిలేవారని, అలాగే యుద్ధసమయంలో తమ కుటుంబ సభ్యులకు తమ క్షేమ సమాచారం తెలియజేయడానికి కూడా తేలియాడే లాంతర్లను ఉపయోగించేవారని చరిత్ర చెబుతుంది.
ఈ వేడుకలో సాంస్కృతిక, వినోదాత్మక కార్యక్రమాలు చక్కగా సాగుతాయి. వేలకొద్దీ రంగురంగుల దీపాలు నామ్‌గాంగ్ నదిపై తేలుతూ, కళ్ళకు ఇంపుగా మెరుస్తాయి. ఈ వేడుకలో పాల్గొనేవారు తమ కోరికలు రాసిన లాంతర్లను నదిలో వదలిపెట్టవచ్చు లేదా ఆ ఆర్టిఫిషియల్ బ్రిడ్జీలకు వేలాడదీయవచ్చు. ప్రపంచంలోని వివిధ దేశాల మైలురాళ్లను పోలిన భారీ లాంతరు శిల్పాల ప్రదర్శన కనువిందు చేస్తుంది. పండుగ సందర్భంగా పర్యటకులకు, నదిపై తాత్కాలికంగా నిర్మించిన వంతెనలపై నడుస్తూ, లాంతర్లను దగ్గరగా చూసే అవకాశం కల్పిస్తారు. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో రాత్రిపూట– కళ్లు చెదిరే బాణాసంచాలు, డ్రోన్ లైట్ షోలతో ఆకాశం కాంతిమయమవుతుంది.
అరుదైన లైట్‌హౌస్
బోనవిస్టా ద్వీపకల్పంలో తీరం వెంబడి తరతరాలుగా ప్రయాణించే నావికులకు– కేప్ బోనవిస్టా లైట్‌హౌస్‌తో గొప్ప అనుబంధం ఉంది. పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో ఉపయోగించిన సీల్ (ఒక సముద్రజీవి) ఆయిల్‌తో మండే అరుదైన కాటోప్ట్రిక్ లైట్ ఉపకరణాన్ని ఇక్కడ చూడొచ్చు. న్యూఫౌండ్‌లాండ్, లాబ్రడార్‌లలో అత్యధికంగా ఫొటోలు తీసిన ప్రదేశాలలో ఇది ఒకటి! తిమింగలాలు, మంచు పర్వతాలు, పఫిన్ పక్షులను చూడటానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. అందుకే ఇక్కడికి పర్యాటకులు ఎగబడుతుంటారు.