
‘థాంక్యూ మేడం..! ఐ లవ్ యు మేడం..!!’ కృతజ్ఞతా ప్రేమపూర్వకంగా చెప్పాడు రాజేష్.‘ఇట్స్ ఓకే..!... బట్ లవ్..?! నా కౌన్సెలింగ్‌తో పూర్తిగా నయమయ్యావు కదా! ఇక జాగ్రత్తగా జీవితాన్ని గడుపు. లవ్ అంటూ మరో మానసిక రోగివి కాకు! సీరియస్‌గా హితవు చెప్పింది సైకాలజిస్ట్ కోమలి.‘సారీ మేడం..! నా ఉద్దేశం అది కాదు..! అదీ..!’... సంజాయిషీ ఇచ్చుకోబోతుండగా...‘స్టాప్ నాన్సె¯Œ ్స... సారీ ఒకటి..! ఒక అమ్మాయి నాలుగు రోజులు మంచిగా మాట్లాడితే అడ్వాంటేజ్‌గా తీసుకొని ‘లవ్’... ఆ తర్వాత ఇంకోటి అంటూ వచ్చే మగాళ్ళ తీరు అసహ్యం వేస్తుంది. వృత్తిరీత్యా సన్నిహితంగా ఉంటే, ఈ విధంగా వచ్చే వారి పట్ల ఏ విధంగా ఉండాలో నాకు బాగా తెలుసు.
‘లవ్’ అనే పేరుతో ట్రాప్ చేయాలనుకునే మనస్తత్వం గలవాళ్లను ఒక కౌన్సెలర్‌గా దూరం పెట్టడమూ తెలుసు.కుదుటపడిన ఆరోగ్యంతో మంచిగా బతుకు. నా ట్రీట్మెంట్ పూర్తయింది. ఇంకెప్పుడూ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. బై!’ అంటూ ఫోన్ పెట్టేసింది కోమలి. ఏదో చెబుదామనుకొని మళ్లీ కాల్ చేయాలని చూస్తే, ఎంతకూ కలవకపోవడంతో తనను బ్లాక్ చేసిందని అర్థమైంది రాజేష్‌కి.‘ఏమిటి..? ఈ రోజు మూడీగా ఉన్నావు. ఏమైంది..? ఏమంటున్నారు మీ పేషెంట్లు?’ఏదో ఆలోచనలో పరధ్యానంగా ఉన్న కోమలిని అడిగాడు ప్రదీప్.‘ఆ... ఏమీ లేదు లెండి..! కొందరు మగవాళ్లకు తిక్క ఎక్కువైంది. ఎవరైనా అమ్మాయి నాలుగు రోజులు మంచిగా మాట్లాడితే చాలు వాళ్ళ పైత్యం చూపిస్తున్నారు. రాజేష్ చెప్పిన విషయం ప్రదీప్‌కి చెప్పింది.
ఈ అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రదీప్ వెంటనే స్పందిస్తూ, నువ్వు అందరినీ సమదృష్టితో చూడాలని, కౌన్సెలింగ్‌పరంగా వారికి దగ్గరవుతావు కదా! ఇలాంటివి వస్తూ ఉంటాయి. అంతకుముందు నీ కౌన్సెలింగ్ తీసుకున్న రాజీవ్, చక్రి, సురేష్.. వీళ్లంతా చివరకు లవ్ ప్రపోజల్ తెచ్చారు కదా! ఇప్పుడు అదే జాబితాలో రాజేష్ చేరాడేమో!? అవునూ! నీ పేషెంట్లను కొందరిని వాయిస్ కాల్‌లో, మరికొందరిని వీడియో కాల్‌లో కౌన్సెలింగ్ చేస్తావెందుకని?’ చికిత్స విధానం గురించి ఆరా తీశాడు ప్రదీప్.
‘నేను చేసేది మానసిక చికిత్స. అది కూడా కౌన్సెలింగ్ మాత్రమే! వారి మానసిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఎంచుకుంటాను. సమస్య పరిష్కారం కావాలి’ తను ప్రత్యేకంగా ఉపయోగించే చికిత్స విధానాన్ని చెప్పింది కోమలి.‘నీ కౌన్సెలింగ్ ఏమో గాని, చివరకు నాకు దక్కకుండా పోతావా ఏంది?’ నవ్వుతూ చురకేశాడు ప్రదీప్.
‘నో.. నెవర్..! అంత సీన్ లేదు. ఆ పరిస్థితి నాకు రాదు. ఈ ప్రదీప్‌కి కాకుండా ఇంకెవరికీ నో చా ఎటాల్! అవతలి వాళ్ళ ఆటిట్యూడ్ ప్రకారం నేను వెళ్తుంటాను. వృత్తిరీత్యా ఇవన్నీ తప్పవండీ..!’‘కొందరికి కౌన్సెలింగ్ ఫీజు కూడా లేకుండా ఉచితంగా సర్వీస్ చేస్తావెందుకని?’‘ఏమండీ..! చెదిరిన వాళ్ల జీవితాలు చక్కబడితే, మానసిక వేదన, ఒత్తిడి నుంచి బయటపడి సాధారణ జీవితంలోకి వస్తే, అంతే చాలు. అదే వెలకట్టలేని ఫీజు. అది కూడా వాళ్ల స్థాయిని బట్టి పోతుంటాను. కొందరికి ఉచితం తప్పదు. అయినా నా రీసెర్చ్ పని కోసం రెండు సంవత్సరాల పాటు కౌన్సెలింగ్ ప్రాక్టీస్‌కి ఫుల్‌స్టాప్ పెడుతున్నాను’ అంటూ తన రూమ్‌లోకి వెళ్లి రీసెర్చ్ బుక్ ముందరేసుకుంది కోమలి.కోమలి.. పేరుకు తగ్గట్టుగానే కోమలంగా ఉంటుంది. మూడేళ్ల కిందట దంపతులైన ప్రదీప్, కోమలి ఇద్దరూ వారి వారి వృత్తులలో బిజీగా ఉంటున్నారు.
ప్రదీప్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా, కౌన్సెలర్‌గా ఆన్‌లైన్‌లో కావాల్సిన వారికి కౌన్సెలింగ్ ఇస్తుంది కోమలి. ఆమె మాట తీయదనం, సమస్యల పరిష్కార దిశలో ఓ అమ్మలా లాలించడం, సాంత్వన చేకూర్చడంతో మానసికతత్త్వ వికాస నిపుణురాలిగా మంచిపేరు తెచ్చుకొని ఎందరికో నూతన జీవితాలను అందించింది. కాని ‘లవ్’ పేరుతో కొందరి ప్రవర్తనతో విసిగివేసారింది. ఆ మాట అంటేనే హృదయం భగ్గుమంటుంది. లవ్ అంటూ శారీరక వాంఛతో దానిని పూర్తి చేసుకోవాలనుకునే వారిని తప్పిస్తూ, తన వృత్తిని కొత్త చాలెంజ్‌గా ఎదుర్కొంటూ మంచి కౌన్సెలర్‌గా రాణిస్తుంది కోమలి. వ్యక్తిగతంగా లవ్ విషయంలో తన జీవితంలో జరిగిన అనేక చేదు అనుభవాలు, మానసిక అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఒక సైకాలజిస్ట్‌గా తన మనసును దిటవుపరచుకొని, ఇక ‘లవ్’ని దరిచేరనీయకుండా స్ట్రాటజీస్ ఉపయోగించుకుంటూ వృత్తిని విజయవంతంగా కొనసాగిస్తోంది.
‘ఏవండీ..! ఈ అసోసియేషన్ వాళ్లు వాచ్‌మన్‌ను మార్చారా? కొన్ని రోజులుగా నాగయ్య, లక్ష్మి కనిపించడం లేదు’ అనుమానంగా అడిగింది కోమలి.‘ఆ.. అవును..! వాళ్లు వాళ్ల ఊరు వెళ్లిపోయారట! కొత్త వాచ్‌మన్‌ను పెట్టారు..చంద్రయ్య అట!’‘సర్లేండి..! వర్షం వస్తోంది. టాబ్లెట్స్ తేవాలి ఎలా? వాచ్‌మన్‌కి చెప్పనా?’‘చెప్పి చూడు కొత్తవాడు కదా! వీలుంటే తెస్తాడేమో!’ఇంటర్ కమ్ నొక్కి కబురు పంపగానే, పరుగు పరుగున రెండవ అంతస్తుకు చేరుకున్నాడు చంద్రయ్య.‘నువ్వేనా కొత్త వాచ్‌మన్‌వి? సార్ వర్క్ చేసుకుంటున్నారు. గొడుగేసుకుని వెళ్లి ఈ టాబ్లెట్స్ తెస్తావా?’ మృదువుగా అడిగింది కోమలి .‘అలాగే అమ్మగారూ..!’ పీల గొంతుతో, తలూపి ఆమె ఇచ్చిన ఖాళీ స్ట్రిప్, పైసలు తీసుకుని పది నిమిషాల్లో తిరిగొచ్చాడు చంద్రయ్య.
తడిసి వచ్చిన చంద్రయ్యను చూసి‘అదేంటి..? గొడుగు వేసుకొని వెళ్లలేదా పూర్తిగా తడిసిపోయావు’‘గొడుగు లేదమ్మగారూ..!’‘అవును.. నీ పేరేమిటి అన్నావ్..?’‘చంద్రయ్య.. అమ్మగారు’ అంటూ మిగిలిన చిల్లర ఇవ్వబోతుండగా,..‘ఉంచుకో..! టీ తాగు..’ అంది‘వద్దమ్మగారు..’ అంటూ వణుకుతూ వెళుతున్న చంద్రయ్య వైపు జాలిగా చూసింది కోమలి.వర్క్ చేసుకుంటూ ఇదంతా గమనిస్తున్న ప్రదీప్‘తల్లీ..! అతనికేం కౌన్సెలింగ్ అవసరం ఉండదులే..! వదిలేయ్..! నీ మంచితనంతో చస్తున్నా..!’ సరదాగా నవ్వుతూ అన్నాడు ప్రదీప్.‘సహానుభూతి ఉండాలండీ..! మనకు సాయం చేసే వాళ్లకు కనీసం మంచి మాటైనా తిరిగి ఇవ్వకపోతే, మనం మనుషులమే కాదు’ తనలో పురివిప్పిన సైకాలజిస్ట్ మాటలకు చెప్పేదేమీ లేక ‘మరి.. అంతేగా.. అంతేగా..’ అనుకుంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు ప్రదీప్.
కాసేపటికి మళ్ళీ ఏదో గుర్తొచ్చి,‘ఇంకో విషయం.. ఈ వాచ్‌మన్‌కు భార్య లేదట! రెండేళ్ల కొడుకున్నాడు. వాడితోనే ఇక్కడికి వచ్చాడు. మరి పాత వాచ్‌మన్ భార్య నీకు అంట్లు, బట్టలు, ఇంటి పని ఆమెనే చేసేది కదా, ఇప్పుడెలా?’ అన్నాడు ప్రదీప్.పనిమనిషి సమస్య ఎప్పుడూ రావణకాష్టమే! ‘ఒకసారి చంద్రయ్యను అడిగి చూద్దాం! ఎవరినైనా కుదురుస్తాడేమో!’ అంది.ఇస్త్రీ బట్టలు పైకి తీసుకొచ్చి ఇవ్వడానికి వచ్చిన చంద్రయ్యను ఇదే విషయం అడిగింది.‘అమ్మా! మీకు అభ్యంతరం లేకపోతే, నేనే అంట్లు, బట్టలు, ఇంటి పని చేస్తాను. చిన్నోడి ఖర్చులకు వెళుతుంది కదమ్మా! మీరు ఎంత ఇచ్చినా పర్లేదు’ బావిలో నుంచి వచ్చినట్లుగా లో గొంతుకతో అన్నాడు.‘అవును..! మా ఇద్దరికీ టైం ఉండదు. ఎంతైనా పనిమనిషి లేనిది వెళ్లదు.
ఇంటి పనిలో ఇతనిని పెట్టుకుంటే పదిమంది ఏమైనా అనుకుంటారా? కాని, అతని పిల్లాడి పోషణ ఖర్చుకు పనికొస్తుంది కదా! ఎవరేమైనా అనుకోనీ! అనుకున్న వాళ్లు ఏమీ చేయరు. నా ప్రదీప్ ఓకే అంటే చాలు’ అనుకుంటూ భర్తను ఒప్పించి, ఇంటి పని మొత్తాన్ని చంద్రయ్యకు అప్పగించింది కోమలి.అప్పటì æనుంచి చంద్రయ్య వాళ్ళ కుటుంబంలో ఒకడయ్యాడు. చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఏ సమస్య వచ్చినా, అందరికన్నా ముందుండేది అతనే. వాచ్‌మన్‌గా డ్యూటీ చేస్తూనే, సమయాన్ని కుదుర్చుకుంటూ కార్ డ్రైవర్‌గా, సర్వెంట్‌గా, ప్రదీప్‌కు అన్నిట్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఏమీ ఆశించడు. కల్మషం లేని చిత్తశుద్ధి. మొదటిసారి చంద్రయ్యను నిశితంగా చూడాలనిపించింది కోమలికి. ముప్పయ్యేళ్ళు వుంటాయేమో! మాసిన గడ్డం.. తెల్లగా చెదిరిన మనసుకు అద్దంలా వున్నాడు. మంచి డ్రెస్ కూడా వేసుకోకుండా బేలగా ఓ పిల్లోడిలా కనిపించాడు.
వారం రోజులుగా చంద్రయ్య ఇంటి వైపుకు రాకపోవడంతో ‘మీరు కిందికి వెళ్ళినప్పుడు, చంద్రయ్యను రమ్మనమని చెప్పండి’ భయాందోళనగానే అంది కోమలి.‘ఇంకెక్కడి చంద్రయ్య! పిల్లోడిని తీసుకొని తన ఊరెళ్ళాడట! ఆరోగ్యం దెబ్బతిందని అసోసియేషన్ వాళ్ళు చెప్పారు. మళ్ళీ మనకు మరో కొత్త వాచ్‌మన్.. అంతే!’చంద్రయ్య లేకపోవడంతో కోమలి మనసులో మనసు లేదు. ఏదో వెలితి ఆవరించినట్లయింది.‘ఏవండీ! మనకు ఇంత సర్వీస్ చేసిన చంద్రయ్యను వాళ్ల ఊరెళ్ళి ఒకసారి చూసొద్దాం అండీ’ బతిమాలింది కోమలి.‘ఏం చేస్తాం! కాదంటానా? నీ మాటే నా మాట. ఈ రోజే పోదాం పద’ కోమలి మాటను ఎప్పుడూ కాదనని ప్రదీప్– చంద్రయ్య ఊరు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అసోసియేషన్ వాళ్ళకు చంద్రయ్య ఇచ్చిన ఆధార్ కార్డు ఆధారంతో ఆ అడ్రస్‌తో ఆ ఊరికి చేరుకుని చంద్రయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి ఆరా తీయగా, ఇంట్లో వాళ్లు బయటకు వచ్చి‘చంద్రయ్య గొంతు వ్యాధితో నాలుగు రోజుల క్రితం చనిపోయాడు.
మీరు కోమలి, ప్రదీప్ గారేనా?హైదరాబాద్ నుంచి వచ్చారా? మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తారని, చనిపోయే ముందురోజు మాకు చెప్పి ఈ ఉత్తరం మీకు ఇవ్వమన్నాడు’ అంటూ ఉత్తరాన్ని ఇచ్చారు.అప్పటికే ఆ విషాద వార్త విన్న కోమలి గుండె చెరువై బరువవుతుండగా, ఆ ఉత్తరాన్ని తీసి చదవడం ప్రారంభించింది.‘ఐ లవ్ యూ.. మేడం..!’ఈ పిలుపు మీకు ఎక్కడో తాకుతుంటుంది.. నేనమ్మా..! మీ పాత పేషెంట్ రాజేష్ చంద్రను. గుర్తొచ్చానా అమ్మా! ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నన్ను మీ కౌన్సెలింగ్‌తో బతికించి ఊపిరి పోశారు. అంతేకాదు ఓ నెలరోజుల పాటు ప్రతిరోజూ ఫోన్‌లో క్రమం తప్పకుండా వేసుకునే మందులను సూచించడం, చేయాల్సిన వ్యాయామం, మంచి మాటలు, జీవన నైపుణ్యాలు, మానవ సంబంధాలను ఓ అమ్మలా చెప్పారు.
ఆ విధంగా నాకు మీరు పునర్జన్మనిస్తే, చాలాకాలం తర్వాత కడుపుతో ఉన్న నా భార్య సైకోగా, హిస్టీరిక్‌గా చేస్తుంటే, ఆమెకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చి, మంచి డాక్టర్ తో వైద్యం చేయించి మామూలు మనిషిని చేసి.. ఇదిగో...! ఈ వారసుడి జననానికి కారణమయ్యారు. ఆ తర్వాత నా భార్య అనారోగ్యంతో పోయింది. మీకు ఈ విషయాలు చెప్పుకోవాలని తపించినా, ఎంత తాపత్రయపడినా, ఫోన్ కలవకపోవడంతో చెప్పుకోలేకపోయాను. ఒక రోజు అటక పైన ఉన్న ఆనాడు మీరు నాకు పంపిన మందుల పార్సిల్ కవర్ కింద పడటంతో దాని పైన గల ఫ్రమ్ అడ్రస్‌తో పిల్లాడితో ఈ సిటీకి చేరుకున్నాను. మీ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్ ఉద్యోగం కోసం నాలుగు నెలలు వేచి చూస్తే గాని ఈ ఉద్యోగం నాకు దొరకలేదు.
ఆ భగవంతుడు మీ దగ్గరికి రప్పించేందుకు కూడా నాకు వరం ఇచ్చాడు తల్లి..! అదేంటో తెలుసా..? నాకు కౌన్సెలింగ్ ఇచ్చే ఆ రోజుల్లో నా గొంతు మీకు తెలిసి ఉంటుంది కదా! మరి మీ సన్నిధికి రావడానికి నన్ను గుర్తుపట్టకుండా ఉండేందుకు నాకు గొంతు వ్యాధిని ఇచ్చాడు. దాంతో పీలగా అయిన గొంతును గుర్తుపట్టలేకపోయారు. మీ తీయటి మాట, పలకరింపు, ప్రేమ, వాత్సల్యం, మానవత్వం ఫోన్‌కాల్‌లో చూశాను. దగ్గరుండి అవన్నీ మీ చల్లని చూపుల్లో, చేతల్లో చూసే అదృష్టం కలిగింది.
కౌన్సెలర్‌గా మాలాంటి వాళ్లను బాగు చేసేంత వరకే మీ బాధ్యతగా, ఆ తర్వాత మాతో సంబంధాలను ఎంతవరకు ఉంచాలో అంతవరకే చేసే మీ విధానం నిజంగా గ్రేట్ మేడం! ఎందుకంటే కౌన్సెలింగ్ పరంగా ఏర్పడే మీ సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకునే కొందరు వెధవల్ని దరిచేరనీయకపోవడమే కరెక్ట్. ఒక డాక్టర్, ఒక రోగికి ఉన్న సంబంధంలాగా అంతవరకే! కాని, త్వరలో చనిపోయే నాకు మీ రుణం తీర్చుకోవాలనిపించింది. ఆ రుణం తీర్చుకోవడమే ఈ ‘లవ్’ మేడం.. అంతే! మన మధ్య ఏ బంధమున్నదని ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా కౌన్సెలింగ్ చేసి, మా రెండు జీవితాలను బతికించి, పిల్లాడిని కూడా అందించారు చెప్పండి! పూర్వజన్మ సంగతి, మరుజన్మ సంగతి నాకు తెలియదమ్మా! కాని, ఈ జన్మలో మీరు చేసిన సహాయానికి నేను తిరిగి నా వంతుగా బాధ్యత గల సర్వీసును అందించాలని మీ చెంతకు చేరాను.నేనెలాగో ఎక్కువకాలం బతకనని తెలుసు.
బతికినన్ని రోజులు మీరు చేసిన దానికి రుణం తీర్చుకునేందుకు నా చేతనైనంత సేవ చేయాలనే ఉద్దేశంతోనే మీ వద్దకు చేరాను. ఈ బంధానికి పేరేమి పెడతారో తెలియదు కాని, చెదిరిపోని ‘లవ్’ ఉంటుంది. అంతే! ఆనాడు మీరు మాపై చూపించింది కూడా బాధ్యతగల ప్రేమనే!నేను చూపించేది కూడా కొందరి అవాంఛిత దృష్టి మాదిరిగా స్వార్థం, కోరికతో కూడిన ప్రేమ కాదు. ఇది బాధ్యతతో ఒక అమ్మకు చేసే సేవా ప్రేమ ఇది. కాదంటారా అమ్మా! ఒప్పుకుంటారా తల్లీ..? నిశీధిలో కొట్టుమిట్టాడుతున్న ఎందరో నాలాంటి జీవితాలకు వెలుగునిచ్చే వెలుగు దివ్వెమ్మా..! మీకు, మీ కుటుంబానికి చేసే ప్రతి పనిలో కష్టమనిపించలేదు, ఇష్టంతో చేశాను.
ఎండలో వానలో, తినీ తినక అనారోగ్యాన్ని లెక్క చేయక చేసిన నా ఇష్టమైన పనులే నా ఆత్మ శాంతించడానికి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. చిన్నోడి రూపంలో వున్న ఈ ఆత్మరుణానుబంధానికి మీ పేరే పెట్టుకున్నానమ్మా! వాడే ఈ కోమల్!!ఇక నా ప్రాణం పోయినా పర్లేదు. ఆత్మసంతృప్తి మిగిలింది. ఆ రాత్రి గొంతు నొప్పి ఎక్కువ కావడంతో, ఇక నేను ఎక్కువ రోజులు బతకనని తెలిసి పిల్లోడిని తీసుకొని మా ఊరు వచ్చాను. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అందుకే ఈ లేఖ ముందస్తుగా రాస్తున్నా. మీ మంచితనం, మానవత్వం పదికాలాలపాటు చెరిగిపోకుండా మరెందరో అభాగ్యులకు కొత్త జీవితాలు అందిస్తే అదే చాలు. నేను చేసిన దానికి అర్థం! పరమార్థం!ఇంకో విషయం తల్లీ! మన సార్ పాత బండికి సరిగా బ్రేకులు లేవు. ఇంజిన్ కూడా రిపేరుకు వచ్చింది. అందుకే నేను చేసిన సర్వీస్‌కు మీరిచ్చిన జీతాన్ని దాచుకొని, ఆ పైకంతో మన సార్‌కు నా గిఫ్ట్‌గా కొత్త బైక్ కొన్నాను. సెల్లార్‌లో మీ పార్కింగ్‌లో పెట్టాను. కీస్ వాచ్మెన్ రూమ్‌లో ఉన్నాయి. తీసుకోండి!
ఇక... సార్..నమస్తే..! మేడంకు ఇవ్వడమే కాని, ఎవరి నుంచి ఏదీ తీసుకోదు. అందుకే నేనెవరో తెలియకుండా వచ్చి నా రుణం నేను తీర్చుకున్నాను. మీరు ఆపద్బాంధవులు. ఒకరోజు నా పిల్లోడికి జ్వరం వస్తే రాత్రికి రాత్రి మీరు ఆసుపత్రికి తీసుకెళ్లి దగ్గరుండి వైద్యం చేయించిన గుర్తులు మరువలేనివి. ఒకసారి గుర్తుందా సార్ మీకు...! మీ డ్రైవింగ్‌లో బైక్ పైన ఇద్దరం వెళ్తుంటే, మీ బైకుకు బ్రేకులు సరిగా లేవుగా.. అదుపుతప్పి ఇంకో బైక్‌కు తగిలితే పెద్ద గొడవైంది ఆరోజు.. వెంటనే మిమ్మల్ని ఆటో ఎక్కించి ఇంటికి పంపాను కదా..! ఆ తర్వాత అక్కడికి పోలీసులు వస్తే, నేనే డ్రైవ్ చేశానని చెబితే వాళ్లు కొట్టిన లాఠీ దెబ్బలు ఇంకా మానలేదు.. అయితేమాన్లే సార్..! ఇష్టంతో తిన్న దెబ్బలు కదా..! అవి తీయగా తడుముతున్నాయి..
ఈ విషయం ఎందుకు చెప్పానంటే అది యాక్సిడెంట్ కేస్ చేశారు కదా! పోలీసులు నాకోసం మీ దగ్గరికి వస్తారేమో? లేడు.. చనిపోయాడని చెప్పండి! ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెడుతున్నానని అనుకోకండి! కాని, చెప్పకుండా అదృశ్యమైతే మీరన్న జాబితాలో చేరిన మనిషిగానే మిగిలిపోతాను కదా సార్!ఒక్కసారి నవ్వండి సార్..! ‘చంద్రా’..! అని కేకేయండి! మీ ముందు వాలుతానేమో!ఇక ఉంటాను..! సెలవు!’చదువుతున్న కోమలి కంట నీటి ధార కారుతుండగా ఆ కాగితం తడుస్తుంటే, అక్షరాలు చెదిరిపోకుండా ఆ కాగితాన్ని మృదువుగా తడుముకుని హృదయానికి హత్తుకుంది. మెలి పెడుతున్న బాధతో వున్న కోమలిని పొదివి పట్టుకుని నిలబడ్డాడు ప్రదీప్.తల్లి, తండ్రిని కోల్పోయి బేలగా చూస్తున్న కోమల్ వైపు చూస్తూ..
‘ఏవండీ! ఆ బాబు! కన్నీటితో అంటుండగా... అర్థం చేసుకున్న ప్రదీప్,‘నీ ఇష్టమే నా ఇష్టం! మన చంద్రయ్య గుర్తులు మానవ సంబంధాలకు, అనుబంధాలకు చాలా అవసరం’ అంటూ ఆ పిల్లోడిని అక్కడి వారి అనుమతితో కారులో ఎక్కించుకొని, హైదరాబాద్ బయలుదేరారు. తన వెచ్చని ఒడిలో చల్లగా నిద్రపోతున్న ఆ పిల్లోడు కోమలి తలపై నిమురుతూ, ‘ఆత్మబంధాన్నిచ్చావా.. చంద్రయ్యా! పిల్లలు లేరని బాధపడుతున్న తమకు ఆ దేవుడు ఈ రూపేణా వీడిని ప్రసాదించాడా? ఈ రుణానుబంధాన్ని బాధ్యతగా చూసుకుంటా! ఇది కదా! నిజమైన ‘లవ్ ’... ఐ లవ్ యు టూ రాజేష్..! ఐ మిస్ యు.. రాజేష్ చంద్రయ్య!’ అనుకుంటూ తన అంతరంగ తరంగాలను సముదాయించుకుంటూ, హృదయస్పర్శతో మనసులోనే చంద్రయ్య పాదాలను తడిమింది కోమలి.