
ఆకలేస్తే కిచెన్ వైపు చూసే రోజులు పోయాయి.
ఆకలేస్తే జనాలిప్పుడు స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారు.
ఫుడ్ డెలివరీ యాప్‌లను క్షుణ్ణంగా శోధిస్తున్నారు.
నచ్చిన వంటకాలను వెతికి మరీ ఆర్డర్ చేస్తున్నారు.
కూర్చున్న చోటుకే కావలసిన వాటిని రప్పించుకుంటున్నారు.
మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలన్నాడు ‘ముత్యాలముగ్గు’లో రావుగోపాల్రావు. ఆ సినిమాలో ఆయన ముళ్లపూడివారు రాసిన ఆ డైలాగు చెప్పాడని కాదు గాని, మనవాళ్లు ఎంతోకొంత కళాపోషకులు. ఒక్కొక్కరి కళాపోషణ ఒక్కొక్కరకం. ఇప్పుడు ఈ ఆన్‌లైన్ జమానాలో భోజన కళాపోషణ తాజా ట్రెండ్. పొద్దున్న లేచినది మొదలుకొని అర్ధరాత్రి దాటే వరకు మనవాళ్లు ఎడాపెడా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లతో బిజీ బిజీగా భోజన కళాపోషణ కానిస్తున్నారు. ఒకవైపు రెస్టరెంట్లు, హోటళ్లపై ఆహార భద్రతా అధికారులు తరచుగా దాడులు చేస్తూ, ఆహార కల్తీ వ్యవహారాలను బయటపెడుతున్నా, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లలో మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ‘స్విగ్గీ’, ‘జొమాటో’, ‘ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్’ (ఓఎన్‌డీసీ) వంటి సంస్థలు వెల్లడించిన తాజా నివేదికలు మన భారతీయుల ఆహారప్రీతికి అద్దం పడుతున్నాయి. మనవాళ్ల ఆహార ధోరణులపై ఒక విహంగ వీక్షణం...
బిర్యానీ నంబర్ వన్
భారతీయులు ఆన్‌లైన్‌లో అత్యధికంగా ఆర్డర్ చేస్తున్న వంటకం బిర్యానీ. గడచిన 2024 సంవత్సరంలో ఏకంగా 8.30 కోట్ల బిర్యానీలను ఆర్డర్ చేశారు. అంటే, ప్రతి సెకనుకు సగటున 2.63 బిర్యానీ ఆర్డర్లు స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సంస్థలకు వస్తున్నాయి. ఇవే గణాంకాలను చూసుకుంటే, 2023లో ప్రతి సెకనుకు సగటున 2.5 బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. బిర్యానీ తర్వాత పిజ్జాకు 2024 సంవత్సరంలో అత్యధిక ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ ఏడాది పిజ్జాకు 5 కోట్ల ఆర్డర్లు నమోదయ్యాయి.
ఈ ఏడాదిలో మసాలా దోసెకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. ఏకంగా 2.30 కోట్ల ఆర్డర్లతో మసాలా దోసె మూడో స్థానంలో నిలిచింది. ఇదే సంవత్సరంలో చాకో లావా కేక్‌కు 36 లక్షలు, చికెన్ రోల్‌కు 24.80 లక్షలు, చికెన్ బర్గర్‌కు 18.40 లక్షలు, చికెన్ మోమోస్‌కు 16.30 లక్షల ఆర్డర్లు, బంగాళ దుంపల ఫ్రెంచ్ ఫ్రైస్‌కు 13 లక్షలు చొప్పున ఆన్‌లైన్ ఆర్డర్లు నమోదయ్యాయి.
తాజా ఆహార ధోరణులు
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు సునాయాసంగా వండిన పదార్థాలను ఇళ్లకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాగని వీటి ప్రయోజనం అంతవరకు మాత్రమే పరిమితం కాదు. వీటి గణాంకాలను అధ్యయనం చేస్తే, జనాల్లో మారుతున్న ఆహార ధోరణులు అవగతమవుతాయి. వివిధ ఫుడ్ డెలివరీ సంస్థలు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం ఈ ఏడాదిలో జనాల ఆహార ధోరణుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. జనాలలో వచ్చిన మార్పులకు తగినట్లుగానే ప్రముఖ రెస్టరెంట్లలోని షెఫ్‌లు తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుంటూ, జనాలు కోరుకునే ఆహారాన్ని వండి వడ్డిస్తున్నారు. స్విగ్గీ తాజాగా విడుదల చేసిన ‘టాప్ ఫుడ్ ట్రెండ్స్– 2025’ నివేదిక ప్రకారం ఈ ఏడాది ప్రాచుర్యంలోకి వచ్చిన ఆహార ధోరణులు ఇవీ:
ఏఐ డైట్ ప్లాన్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం అన్ని రంగాల్లోనూ పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య స్పృహ ఉన్నవారు తమ శరీరతత్త్వానికి, ఆరోగ్య పరిస్థితులకు తగిన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడానికి ఏఐని ఆశ్రయిస్తున్నారు. ఏఐ సూచనల ఆధారంగానే ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన వంటకాలను ఆర్డర్ చేసుకుంటున్నారు.
పర్యావరణ స్పృహ
ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో పర్యావరణ స్పృహ పెరుగుతోంది. ఇది ప్రజల ఆహారపు ఎంపికలోనూ ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తోంది. పర్యావరణానికి హాని కలిగించరాదనే ఉద్దేశంతో చాలామంది తక్కువ కర్బన ఉద్గారాలు కలిగిన ఆహార పదర్థాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఆన్‌లైన్ ఆర్డర్లు చేసేటప్పుడు ఈ మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నారు. జనాల్లో వచ్చిన ఈ మార్పును గమనించిన షెఫ్స్ చాలావరకు స్థానికంగా కాలానుగుణంగా దొరికే పదార్థాలను, పర్యావరణానికి చేటు కలిగించని రీతిలో కర్బన ఉద్గారాలు తక్కువగా ఉండే పదార్థాలను తమ వంటకాల కోసం ఎంపిక చేసుకుంటున్నారు.
జీరో వేస్ట్ కుకింగ్
జీరో వేస్ట్ కుకింగ్ ట్రెండ్ మాత్రమే కాదు, ప్రపంచానికి అవసరం కూడా! ఆహార పదార్థాలను వండటంలో ఎంతో కొంత వృథా కావడం సహజం. ఇటీవలి కాలంలో వండేటప్పుడు ఆహార వృథాను అరికట్టేందుకు షెఫ్‌లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనాలు కూడా జీరో వేస్ట్ కిచెన్‌లలో వండిన ఆహారానికే మొగ్గు చూపుతున్నారు. ఆహార వృథాను వీలైనంతగా అరికట్టాలనే స్పృహ జనాల్లో పెరుగుతూ వస్తుండటం ఒకరకంగా మంచి పరిణామమే!

చక్కెర తక్కువ
డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో జనాలు చక్కెర కలిగిన పదార్థాల పట్ల ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. చక్కెరను అతి తక్కువగా వినియోగించే పదార్థాల వైపు, చక్కెరకు ప్రత్యామ్నాయ పదార్థాల వైపు మళ్లుతున్నారు. పలు రెస్టరెంట్లలోని షెఫ్‌లు కూడా జనాలలో వచ్చిన ఈ మార్పుకు అనుగుణంగా చక్కెర తక్కువగా వినియోగిస్తున్నారు.
ప్రోబయోటిక్స్
జీర్ణకోశ సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. అందువల్ల చాలామంది రోజువారీ ఆహారంలో ప్రోబయోటిక్స్ ఉండేటట్లు చూసుకుంటున్నారు. ప్రజల్లో వచ్చిన ఈ మార్పుకు అనుగుణంగా చాలా రెస్టరెంట్లలోని షెఫ్‌లు కడుపుకు, పేగులకు మేలు చేసే పెరుగు, పులియబెట్టిన పిండి, పులియబెట్టిన ఇతర పదార్థాలతో వంటకాలను వండి వడ్డిస్తున్నారు.
ఫ్యూజన్ రుచులు
ఆరోగ్య స్పృహతో వంటకాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రజలు రుచుల్లో కొత్తదనాన్ని కూడా కోరుకుంటున్నారు. ప్రజల అభిరుచికి తగినట్లుగానే పలు రెస్టరెంట్లు దేశ దేశాల రుచులను సమ్మిళితం చేసి, ఫ్యూజన్ రుచులను అందిస్తున్నాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఈ జాబితాలో ఇండియన్ రామెన్, కొరియన్ టాకోస్, మెడిటరేనియన్ సూషి వంటివి చాలానే ఉన్నాయి. అంతేకాదు, ఈ జాబితాలోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాత్మక వంటకాలు చేరుతూనే ఉన్నాయి.
మూడ్ బూస్టింగ్ ఫుడ్
ఇటీవలి కాలంలో జనాలు ఆహారం వల్ల ఆరోగ్యంతో పాటు అంతకు మించిన ప్రయోజనాలను కూడా కోరుకుంటున్నారు. ఉదయాన్నే రోజును తాజాగా ప్రారంభించడానికి; సాయంత్రం పని ఒత్తిడి పోగొట్టుకోవడానికి; రాత్రివేళ ప్రశాంతమైన నిద్రకు తగిన ఆహారాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. జనాల ‘మూడ్ బూస్టింగ్’ ఎంపికను గమనించిన రెస్టరెంట్లు కూడా అందుకు తగిన పదార్థాలను ఎప్పటికప్పుడు వండి వడ్డిస్తున్నాయి.
హైపర్ లోకల్
భోజన ప్రియుల్లో కొందరు కొత్తదనం కోసం ఫ్యూజన్ రుచులను కోరుకుంటూ ఉంటే, ఇంకొందరు మాత్రం పూర్తిగా స్థానిక రుచులకే ప్రాధాన్యమిస్తున్నారు. స్థానికంగా పండే పంటలు, స్థానికంగా పేరుపొందిన వంటకాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని పలు రెస్టరెంట్లు స్థానికంగా పండే చిరుధాన్యాలు, కూరగాయలతో వండిన పదార్థాలను; స్థానికంగా ప్రసిద్ధి పొందిన వంటకాలను అందిస్తున్నాయి.
ఐదో స్థానంలో భారత్
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ల మార్కెట్‌లో 2024 సంవత్సరం నాటికి భారత్ ఐదో స్థానంలో ఉంది. భారత్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ 2019 నాటితో చూసుకుంటే, 2024 నాటికి 2.8 రెట్ల వృద్ధి సాధించినా, ఇప్పటికి ఐదో స్థానానికే పరిమితం కావడం గమనార్హం. ఈ మార్కెట్‌లో చైనా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా ఉన్నాయి. ఈ దేశాల ఆన్‌లైన్ ఫుడ్ మార్కెట్ విలువ 2024 నాటికి నమోదైన వివరాలు:
టాప్ 5 నగరాలు
మన దేశంలోని మెట్రో నగరాలు ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లలో ముందంజలో ఉంటున్నాయి. వీటిలో బెంగళూరు మొదటి స్థానంలో ఉంటే, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పుణే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ఈ నగరాలు ఎంత శాతం మేరకు ఫుడ్ ఆర్డర్లు చేస్తున్నాయంటే...
విస్తరణకు మరిన్ని అవకాశాలు
జనాభాలో చైనాను అధిగమించినప్పటికీ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో భారత్ ఇప్పటికి కొంతవరకు వెనుబడే ఉంది. అయితే, మెట్రో నగరాల నుంచి ఈ ధోరణి శరవేగంగా ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఈ మార్కెట్ శరవేగంగా విస్తరించగలదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావడం; నగర జీవితాలు తీరికలేకుండా మారడం; చిన్న నగరాలు, పట్టణాల్లో సైతం జీవనశైలిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటుండటం; జనాల్లో ఆరోగ్య స్పృహతో పాటు రుచుల వైవిధ్యాన్ని చవిచూడాలన్న కోరిక పెరగడం వంటి కారణాల వల్ల చాలామంది ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇదివరకు సెలవు రోజుల్లోను, తీరిక వేళల్లోను సకుటుంబంగా లేదా బంధు మిత్రులతో కలసి రెస్టరెంట్లకు స్వయంగా వెళ్లేవారు సైతం ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు చేస్తున్నారు. నగరాల్లోని ఇరుకిరుకు ట్రాఫిక్‌లో తంటాలు పడటం కంటే, నేరుగా ఇంటికే కోరుకున్న వంటకాలు వచ్చేస్తుండటం సౌకర్యవంతంగా ఉండటంతో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్లు చేయడానికే ఇష్టపడుతున్నారు. ‘కోవిడ్’ కాలం నుంచి ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు గణనీయంగా పెరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలు అందుబాటులో ఉన్న నగరాలు, పట్టణాల సంఖ్య వెయ్యికి లోపు మాత్రమే ఉంది. దేశంలోని ప్రధానమైన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల్లో జొమాటో 800 నగరాల్లోను, స్విగ్గీ 580 నగరాల్లోను సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికి ఈ సేవలు అందుబాటులో లేని నగరాలు, పట్టణాలకు సేవలను విస్తరించడానికి ఈ సంస్థలకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద రెస్టరెంట్లకు దీటుగా నగరాలు, పట్టణాల్లో క్లౌడ్ కిచెన్‌లు పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ దేశంలో గణనీయంగా విస్తరించగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.