
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఆన్‌లైన్ పెట్టుబడుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్ తదితర జిల్లాల్లో నాలుగు క్రిప్టో కరెన్సీ యాప్‌ల ద్వారా కేటుగాళ్లు సుమారు రూ. 300 కోట్లు కొల్లగొట్టి జనాన్ని నిండా ముంచారు. ఈ వ్యవహారంలో పరారీలో ఉన్న ముంబైకి చెందిన ప్రధాన నిందితుడు హిమాన్ష్‌ను గత నెల 31న హైదరాబాద్‌లోని ఉప్పల్ పరిధిలో మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముంబైకి చెందిన డాక్టర్ హిమాన్ష్ మొదట ఓ క్రిప్టో యాప్ ద్వారా సుమారు రూ. 150 కోట్ల మేర పెట్టుబడులు సేకరించాడు. ఆపై ఉన్నపళంగా దాన్ని మూసేసి దుబాయ్ పరారయ్యాడు. కొన్ని రోజులకు తిరిగివచ్చి ఇంకో యాప్‌లో సుమారు రూ. 130 కోట్ల మేర పెట్టుబడులు రాబట్టాడు. ఆ యాప్‌ను కూడా 6 నెలల క్రితం మూసేసి మళ్లీ దుబాయ్ చెక్కేశాడు. ఇటీవలే మళ్లీ వచ్చి ఇంకో యాప్ ద్వారా పెట్టుబడులు సేకరించాడు. పెట్టుబడి పెట్టిన వారిలో 40 మందిని ఇటీవలే విహారయాత్ర కోసం బ్యాంకాక్‌కు తీసుకెళ్లాడు. గత నెల 31న హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహిస్తుండగా మేడిపల్లి పోలీసులు హిమాన్ష్‌ను అరెస్ట్ చేశారు.
కరీంనగర్‌కు చెందిన జమీల్, అనిల్, సిరిసిల్లకు చెందిన వంశీ, నిజామాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెట్టుబడుల సొమ్మును హిమాన్ష్ దుబాయ్ మళ్లించడంతో ఈ స్కాం వెనుక అంతర్జాతీయ ముఠా ప్రమేయం ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నిందితులు నెక్ట్స్‌బిట్ అనే క్రిప్టో కరెన్సీ యాప్ ద్వారా రూ. 19 కోట్లు సేకరించినట్లు సుమారు 400 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో హిమాన్ష్‌కు రికీ ఫామ్ (ఫారిన్ ఆపరేటర్), అశోక్ శర్మ (థాయ్‌లాండ్ ఆపరేటర్), డీజే సొహైల్ (రీజినల్ రిక్రూటర్), మోహన్ (సహాయకుడు), అశోక్‌కుమార్ సింగ్ (హిమాన్ష్ సహాయకుడు) సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే హిమాన్ష్ గతంలో రిక్సోజ్ అనే క్రిప్టో యాప్‌ను నడిపించినట్లు కనుగొన్నారు. అయితే బాధితులు మాత్రం హిమాన్ష్ మరో రెండు యాప్‌లను సైతం నిర్వహించి తమను మోసగించారని ఆరోపిస్తున్నారు.
త్వరలో మెటా యాప్‌పైనా చర్యలు..
ఇదే తరహాలో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్లలో మెటా యాప్ పేరుతో రూ. 100 కోట్ల వరకు కొల్లగొట్టిన మెటా యాప్ నిర్వాహకులపైనా పోలీసులు దృష్టిపెట్టారు. దీనిపై ఇప్పటికే డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి. నిఘా వర్గాలు సైతం ఈ కేసులో సూత్రధారిగా ఉన్న లోకేశ్, ఓ మాజీ కార్పొరేటర్, ప్రకాశ్, రమేశ్, రాజు అనే వ్యక్తులపై పూర్తి వివరాలు సేకరించారు. లోకేశ్ ప్రస్తుతం దేశం విడిచి పరారయ్యాడని పోలీసులు నిర్ధారించుకున్నారని సమాచారం. ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలైతే నిందితుడిని ఇండియాకు రప్పించడం ప్రహసనంగా మారనుంది.