
దీపావళి పండుగకు నగరం ముస్తాబవుతోంది.. ముఖ్యంగా ఈ పండుగలో స్వీట్స్‌దే అగ్రభాగం.. ఈ సందర్భంగా ఇచ్చిపుచ్చుకునే గిఫ్ట్స్ ప్యాకింగ్ కూడా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా పలుకరించుకుని స్వీట్స్, లేదా డ్రైఫ్రూట్స్ వంటి గిఫ్ట్ బాక్సులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ సారి దీపావళికి అందమైన ర్యాపింగ్‌తో ఆకట్టుకునే గిఫ్ట్ ప్యాక్స్ హడావుడి మొదలైంది.. మార్కెట్‌లో వివిధ రకాల స్వీట్స్, డ్రైఫ్రూట్స్ వంటి వాటితో ఈ గిఫ్ట్ ప్యాకింగ్స్ అందుబాటులో ఉన్నాయని పలువురు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
రంగు రంగుల ర్యాపింగ్, రకరకాల మోడళ్లలో గిఫ్ట్ ప్యాకింగ్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఔత్సాహికులతో నగరంలోని బేగంబజార్ సందడిగా కనిపిస్తోంది. సంప్రదాయ వెరైటీ డిజైన్లలో తయారు చేసిన డ్రైఫ్రూట్స్, స్వీట్ బాక్సులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఇవి వివిధ రకాల ఆకారాల్లో, వివిధ రకాల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి.
ఇమిడిపోయిన సంప్రదాయం..
దీపావళికి గిఫ్ట్ బాక్సులు ఇచ్చే సంస్కృతిని మార్వాడీలు, గుజరాతీలు ఎక్కువగా పాటిస్తారు. ఇదే పద్ధతి ప్రస్తుతం నగరంలోని ప్రజల్లోనూ క్రమంగా ఇమిడిపోయింది. దీంతో పండుగ పూట ఇంటికి వచ్చే అతిథులకు, లేదా ఇరుగు పొరుగు వారికి, మరీ ముఖ్యంగా సన్నిహితులకు ఈ గిఫ్ట్ బాక్సులు అందజేస్తుంటారు.
కొనుగోళ్లు షురూ..
ఇప్పటికే బేగంబజార్‌లో కొనుగోళ్లు షురూ అయ్యాయి. డ్రై ఫ్రూట్ మార్కెట్ కిటకిటలాడుతోంది. స్వీట్‌షాపుల నిర్వాహకులు, సాధారణ ప్రజలు కొనుగోళ్లకు వస్తున్నారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. నగరంలో ఉద్యోగులు, వ్యాపారుల్లో ఈ గిఫ్ట్స్ ఇచ్చే సంస్కృతి పెరిగిపోయింది. దీంతో గిఫ్ట్ బాక్సుల అమ్మకాలకు డిమాండ్ ఏర్పడింది.
– రాజ్‌కుమార్ టండన్, కశ్మీర్ హౌస్ యజమాని
బాక్స్‌ల ధరలు ఇలా..
సాధారణంగా ఈ గిఫ్ట్ బాక్స్‌ల ధరలు రూ.250 నుంచి రూ.2 వేల వరకూ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయమైన బాక్స్‌ల్లో బాదం, కాజు, కిస్‌మిస్, పిస్తా, ఆప్రికాట్‌తో పాటు అంజీర వంటి డ్రై ఫ్రూట్స్ పెడుతుంటారు. వీటితో పాటు కొందరు వివిధ రకాల స్వీట్లు కూడా ప్యాక్ చేస్తుంటారు. ఈ బాక్స్‌ల్లో డ్రైఫ్రూట్స్ 750 గ్రాములు, 500 గ్రాములు, 250 గ్రాములు ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు.