
జర్మనీ దేశం గురించి తెలియని సిటిజనులు ఉంటారేమో కానీ అక్టోబర్ ఫెస్ట్ గురించి తెలియని పార్టీ ప్రియులు ఉండరు. సెపె్టంబర్ నెలాఖరులో మొదలై అక్టోబరు తొలివారం వరకూ జరిగే ఈ వార్షిక ఈవెంట్‌ను అంతర్జాతీయంగా అక్టో బీరు ఫెస్ట్ అని కూడా బీర్ లవర్స్ ముద్దుగా పిలుచుకుంటారు. ఇంటర్నేషనల్ ఇష్టాలన్నింటినీ ఒడుపుగా ఒడిసిపట్టుకుంటున్న నగర పార్టీ సంస్కృతిలో ఈ పండుగ కూడా కలగలిసిపోయింది.
జర్మనీ దేశపు సంప్రదాయ బీరోత్సవం ఈ అక్టోబరు ఫెస్ట్. బీర్ ప్రియులకు హుషారెత్తించే ఈవెంట్లతో జర్మనీ రాజధాని నగరమైన మ్యునిచ్‌లో దీనిని భారీ ఎత్తున నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో బీర్ లవర్స్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. స్పెయిన్‌లో జరిగే టమాటినా ఫెస్ట్ లాగే జర్మనీలో జరిగే ఈ వేడుక కూడా బాగా పాపులర్.
క్రేజీ.. ఈవెంట్..
‘మద్యపాన ప్రియులందు బీరు పాన ప్రియులు వేరయా’ అంటారు కొందరు. నిజానికి మందుబాబుల్లో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే బీరును ఇష్టపడేవారు తక్కువే. అదే సమయంలో ‘బీర్బ’ల్‌లు అనిపించుకునే చాలా మంది దీన్ని ఒక మత్తుని అందించే డ్రింక్‌లా కాక కాలక్షేపపు పానీయంలా భావిస్తారు.
అయితే మత్తు కోసం స్ట్రాంగ్ బీర్లు గటగటా లాగించే వారిని పక్కన పెడితే.. కాఫీషాప్‌లు, కెఫేల తరహాలో నగరంలో వీటి తయారీకి సేవనానికి ప్రత్యేక బ్రూవరీలు సైతం ఉన్న నేపథ్యంలో అక్టోబర్ ఫెస్ట్ మరింత క్రేజీగా మారుతోంది.
నగరంలో సందడి షురూ..
ఈ ఫెస్ట్ సందర్భంగా నగరంలోని హోటళ్లు, పబ్స్, కేఫ్‌లు, రెస్టారెంట్స్.. జర్మన్ వంటకాలతో పాటు బీర్‌తో కూడిన ప్రత్యేక మెనూ అందిస్తాయి. ఈ కార్యక్రమాలు సంప్రదాయ జర్మన్ రుచికరమైన వంటకాలు, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలతో బవేరియన్ వాతావరణాన్ని పునఃసృష్టిస్తాయి. స్థానికులు మ్యూనిచ్‌కు ప్రయాణించకుండానే ప్రపంచంలోనే అతిపెద్ద బీర్ పండుగను ఆస్వాదించిన అనుభూతిని అందిస్తున్నాయి.
బ్రాట్‌వ్రాస్ట్, సౌర్‌క్రాట్, ష్నిట్జెల్ బవేరియన్ క్రీమ్ వంటి జర్మన్ వంటకాలతో ప్రత్యేక మెనూ రూపొందిస్తాయి. ఈ ఈవెంట్‌లలో లైవ్ జర్మన్ మ్యూజిక్ కూడా ఉంటుంది. సంప్రదాయ జానపద సంగీతం కొన్నిసార్లు బవేరియన్–శైలి దుస్తులు ఉంటాయి. మద్యపానం అలవాటు లేనివారికి ఇక్కడ సాఫ్ట్, ఎనర్జీ డ్రింక్స్ కూడా రెడీగా ఉంటాయి. అదిరిపోయే డీజే మ్యూజిక్ కిక్ ఎలాగూ ఉంటుంది. వీటికి తోడుగా రకరకాల కాంటెస్ట్‌లు, సరదా గేమ్స్, క్విజ్ వంటివి యూత్‌కి ఎంజాయ్‌మెంట్ ఇస్తాయి.
ఇక ఫైర్‌తో, బాటిల్స్‌తో రకరకాల విన్యాసాలు చేసే జగ్లర్స్, నృత్యాలతో అదరగొట్టే డ్యాన్స్ ట్రూప్స్.. వగైరా చిల్డ్ డ్రింక్స్‌కి ఛీర్స్ చెబుతాయి. ‘బీర్ మాత్రమే కాదు ఫుడ్‌ని, విందు వినోదాలను కోరుకునే యూత్ కోసం ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. మా అక్టోబర్ ఫెస్ట్ వినోదప్రియులు ఎవరినీ నిరాశపరచదు’ అని ఆరెంజ్ బైస్కిల్ ఎండీ భవ్యగవర చెప్పారు. ఈ వేడుక కోసం నగరం నుంచి జర్మనీ వరకూ రాకపోకలు సాగించే పార్టీ ప్రేమికులు కూడా ఉన్నారంటే నమ్మక తప్పదు.
సాంస్కృతిక ఉత్సవం..
అక్టోబర్ ఫెస్ట్ అనేది జర్మన్ దేశపు సంస్కృతిలో ఒక భాగం. ఈ వేడుకలో బీర్ ప్రధానమైన అంశమే అయినప్పటికీ విభిన్న రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. నగరంలో గత కొంత కాలంగా ఈ ఫెస్ట్‌ను చాలా ఇష్టంగా ఆదరిస్తున్నారు. మా సంస్థ ఆధ్వర్యంలో కూడా ఏటా ఈ ఫెస్ట్‌ను ఒక రోజు ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులతో పాటు అన్ని వర్గాల వారి కోసం ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో నిర్వహించనున్నాం.
– సందీప్, గోతె జంత్రమ్
(జర్మన్ కల్చరల్ సెంటర్)
జర్మనీలో మొదలైంది..
సెంట్రల్ మ్యూనిచ్‌లోని థెరిసియన్ వైస్ ఫెయిర్ గ్రౌండ్‌లో గత శనివారం అక్టోబర్ ఫెస్ట్ మ్యునిచ్ నగర మేయర్ ఘనంగా ప్రారంభించారు.
దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద బీర్ ఉత్సవంగానే కాదు జానపద కళల ఉత్సవంగా పిలుస్తారు.
ఇది పేరుకు భిన్నంగా, ఆక్టోబర్ ఫెస్ట్ ఎల్లప్పుడూ సెపె్టంబర్‌లో ప్రారంభమవుతుంది. సాధారణంగా సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 5 వరకు జరుగుతుంది.
జర్మనీ దేశపు ఈ ప్రధాన పర్యాటక కార్యక్రమం ప్రస్తుతం 190వ సారి జరుగుతోంది. ఈ ఏడాది కనీసం 6 మిలియన్ల మంది సందర్శకులు వస్తారని అంచనా. అయితే 2023లో ఎప్పుడూ లేని విధంగా 7.2 మిలియన్ల మంది హాజరుకావడం ఓ రికార్డ్. ఈ సందర్భంగా వీరు సేవించిన బీరు మొత్తం పరిమాణం 1.95 మిలియన్ గ్యాలన్లు.
ఈ సంవత్సరం ఫెస్ట్‌లో «బీర్ దరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సుమారు 15 యూరోల నుంచి 17 యూరోల మధ్య అంటే మన రూపాయలలో చెప్పాలంటే రూ.1500పైనే..
ఈ ఫెస్ట్‌లో భాగంగా పలువురు వ్యాపారులు టెంట్స్ ఏర్పాటు చేస్తారు. ఆయా టెంట్స్ అందించే ప్యాకేజీల్లో సందర్శకులు బీరు తాగడంతో పాటు, వినోద యాత్రలకు వెళ్లవచ్చు.
(చదవండి: భారత్‌లో పర్యటించాలనుకుంటే ఈ తప్పిదాలు చెయ్యొద్దు..! విదేశీ యువతి సూచనలు)