
న్యూఢిల్లీ: దేశరాజధాని ప్రజలకు దీపావళికి ముందుగానే పండుగలాంటి వార్త వెలువడింది. ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కు అనుమతిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఐదేళ్ల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీపావళిని పురస్కరించుకొని అక్టోబర్ 18 నుంచి, 21వ తేదీ వరకు గ్రీన్ క్రాకర్స్ వెలిగించేందుకు అనుమతులు మంజూరు చేసింది. అయితే రాత్రి 8 నుంచి 10 గంటల వరకే బాణసంచా కాల్చేందుకు అనుమతిచ్చింది. ఇదేవిధంగా సర్టిఫైడ్ క్రాకర్స్ దుకాణాలవారు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ విక్రయించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయి ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఢిల్లీ–ఎన్సీఆర్‌లో గ్రీన్ పటాకుల విక్రయానికి సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది. అయితే ఈ-కామర్స్ ద్వారా పటాకుల విక్రయంపై నిషేధం విధించింది. అలాగే క్యూఆర్ కోడ్ ఉన్న గ్రీన్ పటాకుల విక్రయానికే అనుమతులిచ్చింది. పటాకులు విక్రయాలతో పాటు వాటిని వెలిగించే సమయంలో పోలీస్ అధికారులు ప్రత్యేక పహారా బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. సాంప్రదాయ పటాకులు అక్రమంగా విక్రయిస్తున్నారని, వీటివలన కాలుష్యం పెరిగిపోతున్నదని కోర్టు వ్యాఖ్యానించింది. ‘అర్జున్ గోపాల్’ కేసు తీర్పు దరిమిలా అందుబాటులోకి వచ్చిన గ్రీన్ పటాకుల కారణంగా ఉద్గారాలు తగ్గినట్లు కోర్టు అభిప్రాయపడింది. నీరీ సంస్థ గ్రీన్ పటాకుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని సుప్రీంకోర్టు ప్రశంసించింది. పర్యావరణ పరిరక్షణ–సాంప్రదాయ ఉత్సవాల మధ్య సమతౌల్యం సాధించడమే లక్ష్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
గ్రీన్ క్రాకర్స్ అంటే..
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్)–నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌ఈఈఆర్‌ఐ) ప్రకారం తక్కువ షెల్ సైజుతో, రసాయనాలు తక్కువగా వినియోగిస్తూ, బూడిద వాడకుండా తయారు చేసే బాణసంచాను గ్రీన్ క్రాకర్స్‌గా పిలుస్తున్నారు.
మామూలుగా వాడే హానికరమైన సల్ఫర్ నైట్రేట్స్, సోడియం, లెడ్, మెగ్నీషియం, బేరియం, అత్యంత హానికరమైన బ్లాక్ పౌడర్‌ను వీటిలో వాడరు. అందుకే వీటితో కాలుష్యం 30% తక్కువగా ఉంటుంది. శబ్ద కాలుష్యమూ తక్కువే. సాధారణ బాణసంచా 160 డెసిబుల్ శబ్దంతో పేలితే ఇవి 110 డెసిబుల్ శబ్దం చేస్తాయి. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో గ్రీన్ క్రాకర్స్‌కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) అనుమతినిచ్చింది.
గ్రీన్ క్రాకర్స్‌ను గుర్తించడం ఎలా ?..
ఎన్‌ఈఈఆర్‌ఐ ఫార్ములా ప్రకారం ప్రస్తుతం తమిళనాడులో ప్రఖ్యాత బాణాసంచా కేంద్రమైన శివకాశీలోనే తయారు చేస్తున్నారు. వీటిని గుర్తించడానికి వీలుగా సీఎస్‌ఐఆర్–ఎన్‌ఈఈఆర్‌ఐ ఆకుపచ్చ రంగు లోగోను బాణాసంచా బాక్సులపై ముద్రిస్తున్నారు. క్యూఆర్ కోడ్ కూడా ఈ బాక్సులపై ఉంటుంది. గ్రీన్ క్రాకర్స్ మూడు రకాలున్నాయి.

స్వాస్: వీటిని కాల్చినప్పుడు నీటి ఆవిరి కూడా విడుదలై గాల్లో ధూళిని తగ్గిస్తుంది. గాలిలో సూక్ష్మ ధూళికణాలు 30% తగ్గుతాయి
స్టార్: వీటిలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వాడరు వాయు కాలుష్యానికి కారణమైన పర్టిక్యులర్ మేటర్ (పీఎం)ని తగ్గించడంతో పాటు శబ్ద కాలుష్యాన్ని కూడా నివారిస్తాయి
సఫల్: ఈ రకమైన గ్రీన్ క్రాకర్స్‌లో మెగ్నీషియమ్‌కు బదులుగా అల్యూమినియమ్ తక్కువ మోతాదులో వాడతారు.సంప్రదాయ బాణాసంచాతో పోలిస్తే శబ్ద కాలుష్యం తక్కువ.
కేంద్రం లైసెన్స్ ఇచ్చిన కేంద్రాల్లోనే గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.