
స్పైసీ బాంబూ షూట్స్ సలాడ్
కావలసినవి: వెదురు చిగుర్లు (బాంబూ షూట్స్)– ఒక కప్పు
తురిమిన క్యారట్లు–ఒక కప్పు
కీరదోస– అర కప్పు (సన్నగా తరగాలి)
కొత్తిమీర తురుము– పావు కప్పు
ఉల్లిపాయ ముక్కలు– పావు కప్పు
మిరపకాయలు– 2
వేరుశనగలు– పావు కప్పు (దోరగా వేయించినవి)
రైస్ వెనిగర్– 3 టేబుల్ స్పూన్లు
సోయా సాస్– 2 టేబుల్ స్పూన్లు
నువ్వుల నూనె– టేబుల్ స్పూన్
తేనె– టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పేస్ట్, నిమ్మరసం– ఒక టీ స్పూన్ చొప్పున
తయారీ: ముందుగా పండ్లను శుభ్రంగాకడిగి, పూర్తిగా ఆరబెట్టాలి. ముందుగా వెదురు చిగుర్లను కడిగి సన్నగా ముక్కలుగా చేసుకోవాలి. ఒకవేళ తాజా వెదురు చిగుర్లను ఉపయోగిస్తే, వాటిని ఉడికించి చల్లార్చాలి. ఒక పెద్ద గిన్నెలో ఈ వెదురు చిగుర్లు, కట్ చేసిన క్యారట్ ముక్కలు, కీరదోస ముక్కలు, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి.
ఈలోపు ఒక చిన్న గిన్నెలో రైస్ వెనిగర్, సోయా సాస్, నువ్వుల నూనె, తేనె, అల్లం–వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న కూరగాయల మిశ్రమంపై పోసి బాగా కలపాలి. 15 నిమిషాల తర్వాత వేరుశనగలు కూడా వేసి కలుపుకుని సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది.
వంకాయ–తమలపాకు బజ్జీ
కావలసినవి: వంకాయలు– 8 (మీడియం సైజులో ఉన్న వాటిని మధ్యలో నిలువుగా కత్తిరించుకోవాలి), తమలపాకులు– కొన్ని (పేస్ట్‌లా చేసి పెట్టుకోవాలి)
శనగపిండి– ఒక కప్పు, బియ్యపు పిండి–2 టీ స్పూన్లు, వాము కొద్దిగా
నువ్వులు, కొబ్బరి పొడి– 2 టీ స్పూన్లు చొప్పున, జీలకర్ర– అర టేబుల్ స్పూన్
పసుపు– పావు టీ స్పూన్, కారం– ఒక టీ స్పూన్, ఉప్పు– కావాల్సినంత
వెల్లుల్లి రెబ్బలు–8, నిమ్మరసం– ఒక టీ స్పూన్, నూనె– సరిపడా
తయారీ: ముందుగా ఒక పాన్‌లో నూనె వేసి వంకాయలను లైట్‌గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. చల్లారాక కొద్దికొద్దిగా తమలపాకు గుజ్జు నింపుకుని ఉంచుకోవాలి. అనంతరం నువ్వులు, కొబ్బరి పొడి, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, నిమ్మరసం కలిపి కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి.
మరో వైపు ఒక కప్పు శనగపిండిలో బియ్యపు పిండి, వాము, కారం, ఉప్పు, సరిపడా నీళ్లు కలిపి బజ్జీల పిండిని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆ వంకాయలను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. వీటిని వేగిన పల్లీలు, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలతో గార్నిష్ చేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.
జపనీస్ పొటాటో సలాడ్
కావలసినవి: బంగాళదుంపలు (సుమారు ఒక కేజీ, తొక్క తీసి ముక్కలు కట్ చేసుకోవాలి)
క్యారెట్–1 (కాస్త స్టీమ్ చేసి, చిన్నగా తరగాలి)
కీరదోసకాయ–1
ఉప్పు– ఒక టీ స్పూన్
ఉల్లిపాయ–1 (బాగా తురుముకోవాలి)
ఉడికించిన గుడ్డు– 1
మాయొనీస్ సాస్– ముప్పావు కప్పు
రైస్ వైన్ వెనిగర్–1 టేబుల్ స్పూన్
ఇతర కూరగాయ ముక్కలు– అభిరుచిని బట్టి
తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసి బంగాళదుంప ముక్కలను మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. మరోవైపు కీరదోసకాయను ముక్కలుగా కత్తిరించి ఉప్పు చల్లి పెట్టుకోవాలి. బంగాళదుంప ముక్కలు చల్లారాక, వాటిని గుజ్జులా చేసుకోవాలి. ఇందులో కీర దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన గుడ్డును వేసి బాగా కలపాలి.
అభిరుచిని బట్టి ఇతర కూరగాయల ముక్కలను కూడా కలుపుకోవచ్చు. ఇక బంగాళదుంప మిశ్రమంలో మాయొనీస్ సాస్, రైస్ వైన్ వెనిగర్ వేసి నెమ్మదిగా మరోసారి కలుపుకోవాలి. అనంతరం దాన్ని ఒక గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచి, తర్వాత బౌల్స్‌లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
(చదవండి: నూడుల్స్ తినడమే ఒక గేమ్!)