
2024లో భారతీయులు చేసిన ఖర్చు ఇదీ!
2030 నాటికి రూ.7,82,600 కోట్లకు చేరొచ్చు
అదనపు భారంగా విదేశీ మారకం చార్జీలు
గత సంవత్సరం రూ.1,700 కోట్ల వ్యయం
భారతీయ కుటుంబాలు తమ పిల్లల విదేశీ విద్య కోసం 2024లో రూ.3,78,400 కోట్లు ఖర్చు చేశాయి. 2030 నాటికి ఇది రెండింతలు దాటి రూ.7,82,600 కోట్లకు చేరుతుందని లండన్ కు చెందిన పేమెంట్స్ కంపెనీ వైజ్, కన్సల్టింగ్ సంస్థ ‘రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్’ నివేదిక వెల్లడించింది. భారతీయులు విదేశీ విద్య కోసం జరిపే చెల్లింపులపై బ్యాంకులు వసూలు చేసే మారకపు రేటు ఫీజు, రుసుములు గత ఏడాది రూ.1,700 కోట్లుగా నమోద య్యాయి. ఏటా రూ.30 లక్షలు పంపే ఒక సాధారణ కుటుంబం ఈ చార్జీల కింద రూ.60,000–75,000 కోల్పోవాల్సి వస్తోంది.
రూ.75 వేల వరకు...
భారతీయులు విదేశీ విద్య కోసం జరిపే చెల్లింపులపై బ్యాంకులు వసూలు చేసే మారకపు రేటు ఫీజు, రుసుములు గత ఏడాది రూ.1,700 కోట్లు నమోదయ్యాయి. ఆరేళ్లలో ఇది రూ.4,300 కోట్లకు చేరవచ్చని అంచనా. ఈ చెల్లింపులలో 95% పైగా సంప్రదాయ బ్యాంకింగ్ మార్గాల ద్వారా విదేశాలకు చేరుతున్నాయి. విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరిపినందుకుగాను బ్యాంకింగ్ సంస్థలు విదేశీ మారకపు రేటుపై 3–3.5% చార్జీ వసూలు చేస్తున్నాయి. లావాదేవీ పూర్తి కావడానికి 2–5 రోజుల సమయం పడుతోంది. ఏటా తమ పిల్లల చదువుల కోసం రూ.30 లక్షలు పంపే ఒక సాధారణ కుటుంబం ఈ చార్జీల కింద రూ.60,000–75,000 కోల్పోవాల్సి వస్తోంది. ఈ మొత్తంతో కొన్ని రోజులపాటు విద్యార్థులు రోజువారీ ఖర్చులు వెళ్లదీయవచ్చు. లేదా అదనపు కోర్సులు చేసేందుకు వెచ్చించవచ్చు.
యూఎస్‌లో అనిశ్చితితో..
రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం.. లిబరలైజ్డ్ రెమిటెన్ ్స స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద విదేశీ విద్య కోసం భారతీయులు విదేశాలకు పంపిన డబ్బు ఈ ఏప్రిల్‌లో రూ.1,410 కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 21% తక్కువ. 2025 మొదటి నాలుగు నెలల్లో విదేశీ విద్యకు ఎల్‌ఆర్‌ఎస్ కింద చేసిన ఖర్చు మొత్తంగా 21% తగ్గి రూ.7,516 కోట్లకు చేరుకుంది. గత ఆగస్టు నుంచి ఏప్రిల్ వరకు.. తొమ్మిది నెలలుగా ఈ పథకం కింద విదేశాలకు పంపిన డబ్బు తగ్గుతూ వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అమెరికాలో అనిశ్చితి. ఎల్‌ఆర్‌ఎస్ కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రయాణం, విద్య, వైద్య చికిత్స, విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులు వంటి లావాదేవీల కోసం రూ.2.15 కోట్ల వరకు విదేశాలకు పంపడానికి ఆర్‌బీఐ అనుమతి ఇస్తోంది.
ప్రపంచ సగటు 6.62%
ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2024 జూలై–సెప్టెంబర్‌లో విదేశాలకు పంపే మొత్తంపై ఈ చార్జీల ప్రపంచ సగటు 6.62% ఉంది. అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి అయ్యే ఖర్చు మధ్యవర్తులు లేదా కరస్పాండెంట్ బ్యాంకుల సంఖ్యను బట్టి పెరుగుతుంది. రుసుములు, కార్యాచరణ జాప్యాలు ప్రతి దశలోనూ ఉంటాయి. ఈ ఖర్చులు, జాప్యాల వల్లే కేంద్ర బ్యాంకులు విదేశాలకు నగదు బదిలీ చేయడానికి డిజిటల్ కరెన్సీలకు శ్రీకారం చుట్టాయి.
⇒ విదేశాల్లో ఉన్న పిల్లలకు గత ఏడాది విదేశీ విద్యకు అయిన వ్యయంలో నాలుగింట ఒక వంతు.. అంటే రూ.94,600 కోట్లను భారత్‌లోని కుటుంబ సభ్యులు బదిలీ చేశారు. మిగిలిన మొత్తాన్ని పార్ట్ టైమ్ ఉద్యోగాల ద్వారా సంపాదించిన మొత్తం, అలాగే ఉపకార వేతనాల ద్వారా విద్యార్థులు సమకూర్చుకున్నారు.
⇒ ప్రస్తుతం 18 లక్షల పైచిలుకు భారతీయ విద్యార్థులు వివిధ దేశాల్లో విద్యనభ్యనిస్తున్నారు. ఏడాది క్రితం ఈ సంఖ్య 13 లక్షలు మాత్రమే.
⇒ విద్యార్థుల ప్రాధాన్యతలో యూఎస్, కెనడా, యూకే టాప్–3లో నిలిచాయి.
⇒ వివిధ దేశాల్లో చదువుతున్న మొత్తం విద్యార్థుల్లో భారతీయుల వాటా 30–35% ఉంది. దశాబ్దం క్రితం ఈ సంఖ్య 11% మాత్రమే.
⇒ విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఆరేళ్లలో 25 లక్షలు దాటొచ్చు.