
ప్రతి జిల్లా అభివృద్ధి ఎలా సాధ్యం
మెరుగైన జీవనమెలా సాధ్యం
విద్య, నైపుణ్యాల అభివృద్ధి ఎలా
పాలన, పౌర సేవలు ఎలా ఉండాలి
రాష్ట్రాభివృద్ధికి మీరేం సూచిస్తారంటూ 8 అంశాలతో రాష్ట్ర ప్రభుత్వ సర్వే
తెలంగాణ రైజింగ్ విజన్–2047 పేరుతో ఆన్‌లైన్‌లో అభిప్రాయ సేకరణ
ఈ నెల 25వ తేదీ వరకు అభిప్రాయాలు పంచుకునే అవకాశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి కోణం ఎలా ఉండాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రైజింగ్ విజన్–2047 పేరుతో మొత్తం 8 అంశాలపై ఈ సర్వే నిర్వహిస్తోంది. ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సర్వే 25వ తేదీ వరకు కొనసాగనుంది.ప్రజలు తమ విలువైన అభిప్రాయాలను ఆన్‌లైన్ ద్వారా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తెలంగాణలోని ప్రతి పౌరుని జీవన ప్రమాణాలను మెరుగుç³ర్చడమే ఎజెండాగా ఈ రైజింగ్ కాన్సెప్ట్‌ను ముందుకు తీసుకెళుతోంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, జిల్లా, పట్టణం, నగరాల్లోని ప్రజల స్వరం, కలలు, ఆలోచనల ఆసరాగా భవిష్యత్ తెలంగాణ కోసం రూపొందిస్తోన్న ఈ విజన్ సాధ్యమని భావిస్తోంది. అందులో భాగంగానే 15 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. సర్వేలో భాగంగా 8 ప్రశ్నలను రూపొందించింది. ప్రతి ప్రశ్నకు కొన్ని సమాధానాలిచ్చి వాటిలో ఎలా వెళితే బాగుంటుందో సూచించాలని కోరింది. https://www. telangana.gov. in/ telanganarising/ అనే వెబ్‌సైట్‌లో ఈ సర్వేను పొందుపరిచింది.
సర్వేలోని అంశాలివే
త్రీ ట్రిలియన్ ఎకానమీ: 2047 నాటికి త్రీ ట్రిలియన్ ఎకనామీ సాధించడంలో భాగంగా ఉద్యోగాలకు అవసరమైన రంగాల్లో కోర్సులు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక వాతావరణం కల్పనలో భాగంగా విధానాల్లో సంస్కరణల అమలు, యువత నాయకత్వంలో వ్యాపారాలు.
మీ ఆలోచన మేరకు ఈ విజన్: వీలున్నంత సమీపంలో మంచి పాఠశాలలు, ఆస్పత్రుల ఏర్పాటు, మీమీ ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపార అవకాశాల కల్పన, మహిళల రక్షణ, మరిన్ని అవకాశాల కల్పన, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఆధునిక సేవలు.
అభివృద్ధి రంగాలు..: ఐటీ–ఏఐ–సైబర్ సెక్యూరిటీ, ఫుడ్ ప్రాసెసింగ్–అగ్రిటెక్–కోల్డ్ స్టోరేజి, ఫార్మా– బయోటెక్–ఆరోగ్య ఆవిష్కరణలు, ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ల తయారీ, పర్యాటకం–సాంస్కృతిక–సినీ–సృజనాత్మకత, డ్రోన్స్–అంతరిక్ష శాస్త్రం–రక్షణ.
మెరుగైన జీవితం..: అందరికీ స్వచ్ఛమైన గాలి, నీటి లభ్యత, మెరుగైన పారిశుధ్యం, చివరి మైలు వరకు బస్సు, రైలు మార్గాల అనుసంధానం, రక్షిత, సరసమైన గృహ సదుపాయం.
ఆరోగ్యం, శ్రేయస్సు...: ప్రతి మండలానికి ఆస్పత్రి, మొబైల్ ఆరోగ్య వాహనం ఏర్పాటు, తక్కువ ధరలకే ఆరోగ్య పరీక్షలు, మందులు, టెలీమెడిసిన్ లభ్యత, పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం, వ్యాధి నియంత్రణ, సరసమైన ధరలకు మానసిక ఆరోగ్య కౌన్సెలర్ల లభ్యత, ఆరోగ్య బీమా.
విద్య, నైపుణ్యాలు..: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, వాతావరణ, పారిశ్రామిక రంగాలపై బోధన, ఆధునిక శిక్షణ పరికరాలు, సుశిక్షుతులైన ఉపాధ్యాయులు, కళాశాలలు, ఐటీఐలలో నైపుణ్య ఆధారిత కోర్సులు, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సానుకూలత కల్పించడం, సాఫ్ట్ స్కిల్స్ అభివృద్ధి.
పాలన–పౌర సేవలు..: అన్ని రకాల ప్రభుత్వ సేవలకు ఒకటే పోర్టల్. ప్రజలకు అందుబాటులో ప్రతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల సమాచారం, తగినన్ని నిధులు, అధికారాలతో స్థానిక సంస్థల బలోపేతం.
2047లో తెలంగాణ ఎలా ఉండాలని ఊహించుకుంటున్నారు?..: (పైన పేర్కొన్న ఏడు అంశాలపై ప్రజల నుంచి ఆప్షన్లను కోరిన ప్రభుత్వం 8వ అంశానికి సంబంధించి తెలంగాణ ఎలా ఉండాలని ఊహించుకుంటున్నారో తమ ఆలోచనను అక్షర లేదా స్వర రూపంలో ఇవ్వాలని సర్వేలో కోరింది.)
కేవలం విధాన పత్రం కాదు.. ఉమ్మడి స్వప్నం
తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అనేది కేవలం విధాన పత్రమే కాదు. తెలంగాణ ప్రజల ఉమ్మడి స్వప్నం కావాలి. రాష్ట్ర భవిష్యత్ నిర్మాతలు ప్రజలే. ప్రజలందరూ కొంత సమయాన్ని వెచ్చించి ఈ చారిత్రక కసరత్తులో భాగస్వాములై మీ విలువైన అభిప్రాయాలను అందించాలి. –జయేశ్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి