
విహార యాత్రలకు ఉవ్విళ్లూరుతున్న భారతీయులు
విదేశీ ప్రయాణాల్లో విహార యాత్రలదే సింహభాగం
భారతీయ ప్రయాణికుల్లో 42.5% విహార యాత్రికులే..
థాయ్‌లాండ్‌కే అత్యధిక మంది పయనం
ప్రజల ఆదాయాలు పెరుగుతుండటంతో జీవితంలో ఆనందాలు అనుభవించేందుకు అందులో కొంత ఖర్చు చేసేందుకు వెనుకాడటంలేదు. ముఖ్యంగా విహార యాత్రలపై భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. ఎప్పుడెప్పుడు ప్రత్యక్షంగా చూద్దామా అన్న ఆసక్తిని రేకెత్తించేలా సామాజిక మాధ్యమాల్లో విదేశీ నగరాలు, సందర్శనీయ స్థలాలు ఊరిస్తుండటంతో విదేశీ ప్రయాణాలు పెరుగుతున్నాయి. విదేశాలను చుట్టివస్తున్న భారతీయుల సంఖ్య అయిదేళ్లుగా పెరుగుతోంది. భారతీయుల విదేశీ ప్రయాణాల్లో 2020లో 31.9 శాతంగా ఉన్న విహార యాత్రికుల వాటా, 2024లో 42.5 శాతానికి చేరిందంటే ప్రజల్లో ఉన్న ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు.

కేంద్ర పర్యాటక శాఖ ఇటీవల విడుదల చేసిన ఇండియా టూరిజం గణాంకాల ప్రకారం భారత్ నుంచి 2020లో మొత్తం 72.9 లక్షల మంది వివిధ దేశాల్లో పర్యటించారు. ఈ సంఖ్య 2024లో 3.08 కోట్లకు పెరిగింది. విహార యాత్రల్లో భారతీయుల తొలి డెస్టినేషన్‌గా థాయ్‌లాండ్ నిలిచింది. గత ఏడాది ఈ దేశానికి వెళ్లిన వారిలో ఏకంగా 92.93 శాతం మంది విహార యాత్రలకే వెళ్లారు. 2022తో పోలిస్తే థాయ్‌లాండ్ వెళ్లిన విహార యాత్రికుల సంఖ్య రెండింతలు పెరిగి గత ఏడాది 19.1 లక్షలకు చేరింది.