బాలిక.. బావిలో శవమైతేలింది..! | Seven Year Old Girl Found Dead In Village Well After Three Days Missing In Mancherial | Sakshi
Sakshi News home page

బాలిక.. బావిలో శవమైతేలింది..!

Nov 28 2025 10:04 AM | Updated on Nov 28 2025 10:17 AM

 7 Years Girl Missing Incident

మూడు రోజుల క్రితం అదృశ్యం

ఇంటికి సమీపంలోని వ్యవసాయ బావిలో మృతదేహం

చంపి పడేసినట్లు అనుమానాలు 

ఘటన స్థలాన్ని సందర్శించిన ఏసీపీ

అభం శుభం తెలియని అమాయకురాలు.. తల్లిదండ్రుల గారాల పట్టి.. ఆస్తి పాస్తులు లేకపోయినా.. ఇద్దరు పిల్లలతో ఆ దంపతులు ఉన్నంతలో సంతోషంగా ఉంటున్నారు. ఎవరితోనూ వారికి గొడవలు లేవు.. ఆస్తి తగాదాలూ లేవు. కానీ, మూడు రోజుల క్రితం (సోమవారం సాయంత్రం) వారి ఏడేళ్ల కూతురు అదృశ్యమైంది. ఆరుబయట ఆడుకుంటుందని తల్లిదండ్రులు భావించారు. 7 గంటల ప్రాంతంలో భోజనం కోసం పిలుద్దామని వెళ్లగా కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఎక్కడున్నా తమ కూతురు క్షేమంగా వస్తుందని భావించిన ఆ తల్లిదండ్రులకు గురువారం ఉదయం గుండెలు పగిలే సమాచారం అందింది. అదృశ్యం కాస్త విషాదాంతమైంది. కనిపించకుండా పోయిన కూతురు బావిలో శవమై తేలింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో చోటు చేసుకుంది.

ఆదిలాబాద్ జిల్లా: నంబాల గ్రామానికి చెందిన శనిగారపు శేఖర్‌–రజిత దంపతులు. వారికి కుమారుడు, కూతురు మహన్విత(7) సంతానం. శేఖర్‌ మేకల కాపరిగా పనిచేస్తున్నాడు. రజిత కూలీ పనులు చేస్తుంది. ఇద్దరూ తమ ఇద్దరి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24న (సోమవారం) మహన్విత ఆరుబయట ఆడుకుంటూ అదృశ్యమైంది. బాలిక మిస్సింగ్‌పై పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేపట్టారు. ఆచూకీ కోసం గాలించారు. కూతురు తిరిగి వస్తుందని ఆ తల్లిదండ్రులు మూడు రోజులుగా ఎదురు చూస్తున్నారు. 

బావిలో శవమై..
కానీ అదృశ్యమైన మహన్విత గురువారం నంబాల గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో శవమై తేలింది. విషయం తెలిసిన వెంటన గ్రామస్తులతో పాటు, మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు బారీగా తరలివచ్చారు. బాలిక మృతిపై బంధువులు, గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలికను ఎవరో చంపి బావిలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి, లక్సెట్టిపేట ఎస్సైలు తహసీనొదీ్దన్, సురేష్‌తో పాటు పోలీస్‌ సిబ్బంది చేరుకున్నారు. డాగ్‌స్కా్వడ్‌తో తనిఖీలు నిర్వహించారు. క్లూస్‌టీంతో ఘటన స్థలంలో కొన్ని ఆధారాలను సేకరించారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

గ్రామంలో విషాదం..
మహన్విత ప్రాణాలతో కనిపిస్తుందనుకుంటే ఇలా గ్రామసమీపంలో వ్యవసాయ బావిలో శవమై కనిపించడంతో, అక్కడికి వచ్చిన పలువురు కంటతడిపెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఘటన స్థలం వద్ద రోదించారు. బాలిక మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement