నల్గొండ జిల్లా: నార్కెట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన సోమనబోయిన ధనలక్ష్మి 2007లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందారు. సర్పంచ్‌గా కొనసాగుతూనే 2009–2010లో బీఈడీ, 2010– 2012లో పీజీ పూర్తి చేశారు. ప్రస్తుతం నకిరేకల్ మండలం చందుపట్ల గురుకుల జూనియర్ కళాశాలలో తెలుగు «అధ్యాపకురాలిగా కొనసాగుతున్నారు. ధనలక్ష్మి సర్పంచ్ గా ఉన్న సమయంలో బ్రాహ్మణ వెల్లంల గ్రామ పంచాయతీ 2007–2008 నిర్మల్ పురస్కారానికి ఎంపికైంది.
ఓటు వేయాలంటే దూరం నడవాల్సిందే
గట్టుప్పల్ : గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గిరిజన తండాలకు చెందిన ఓటర్లకు ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు దూరభారం తప్పడం లేదు. అంతంపేట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌కు రంగంతండా సుమారు 1.5 కిలోమీటర్లు, అజనాతండా 3 కిలోమీటర్లకు పైగా, దేవులతండా 0.5 కిలోమీటర్లు, రాగ్యాతండా 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ నాలుగు తండాల్లో సుమారు 650మంది ఓటర్లు ఉన్నారు. ఆయా తండాల ప్రజలు ఏళ్లుగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అంతంపేటకు వస్తున్నారు. దీంతో వృద్ధులు, అంగవైకల్యం కల్గిన వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో కూడా అంతంపేట ప్రాథమిక పాఠశాలలోనే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు మండల పంచాయతీ అధికారి సునీత తెలిపారు.


