
‘‘అన్నయ్యా! రామారావు బాబాయికి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్‌లో ఉన్నాడు. ఈసారి ఆయన కండిషన్ క్రిటికల్ అన్నాడు డాక్టర్. నువ్వు చూసి వెళితే బావుంటుంది’’ సొంత బాబాయి అనారోగ్యం కబురు తెలిసిన రెండురోజుల తర్వాత ఊళ్లో ఉన్న అన్న విశ్వనాథ్‌కి తీరిగ్గా ఫోన్ చేశాడు తమ్ముడు శంకరం.‘‘నేను సిటీకి నిన్ననే వచ్చాను. హాస్పిటల్‌లో ఉన్నాను. బాబాయి ఇంతకు ముందే పోయాడు. కబురింకా ఎవరికీ చెప్పలేదు. బిల్లు డబ్బు పూర్తిగా కడితే గాని శవాన్ని ఇవ్వరట. చంద్రం డబ్బు కోసం వెళ్లాడు’’ నిర్లిప్తంగా అన్నాడు విశ్వనాథ్.‘‘ఓ నిన్ననే వచ్చావా? చంద్రం నిన్నేమైనా డబ్బు అడిగాడా?’’ ఆతృతగా అడిగాడు శంకరం.‘‘అడిగాడు. అవసరానికి నేనేమీ సర్దలేకపోయాను. సమయానికి వాడి దగ్గర డబ్బు లేదట.
అప్పో సప్పో చేసి తెద్దామంటే సమయం లేదు. ఉత్త చేతులతో వచ్చాను. బిల్లు ఆరు లక్షల ప్యాకేజీ. చంద్రం ఇబ్బంది పడుతున్నాడు’’ బాధగా అన్నాడు విశ్వనాథ్ తమ్ముడు శంకరంతో.‘‘అన్నయ్యా! వాళ్ల దగ్గర డబ్బు లేకపోవడమేమిటి? జాలి కబుర్లు! నీ దగ్గర్నుంచి ఎంతో కొంత గుంజుదామని చంద్రం ప్రయత్నం. వాడు డబ్బు తిరిగిచ్చే మనిషి కాదు. నన్నూ అడిగాడు. నిర్మొహమాటంగా లేదని చెప్పాను’’ అన్నాడు శంకరం కఠినంగా.‘‘అవేం మాటలురా! కష్టంలో సాయం చేయకపోతే ఎలా? అందునా మనకి సాయం చేసిన బాబాయి కుటుంబానికి...’’ తమ్ముడిని మందలించాడు విశ్వనాథ్.‘‘నీదంతా అమాయకత్వం. నేనన్న దాంట్లో తప్పేముంది? అందరినీ నమ్ముతావు. చంద్రం సంగతి నీకు తెలియదు. అటు ఉద్యోగం, ఇటు రియల్ ఎస్టేట్ బిజినెస్. రెండు చేతులా సంపాదిస్తున్నాడు.
బాబాయి మాత్రం తక్కువా? బోలెడంత వెనకేసుకున్నారు. వాళ్లకేం తక్కువని మనల్ని డబ్బడగాలి?’’ తమ్ముడి మాటల్లో ఈర్షా్య ద్వేషాలు విశ్వనాథ్‌ని కలవరపెట్టాయి.‘‘ఎవరెంతటి వారైనా సమయానికి చేతిలో డబ్బు ఉండకపోవచ్చు. అత్యవసరమని అడిగినా సాయం చేయలేకపోయాము. ఇక ఆ విషయం వదిలెయ్’’ అసహనంగా అన్నాడు విశ్వనాథ్.‘‘అయినా నీ దగ్గర డబ్బెక్కడుంది అప్పనంగా ఇవ్వడానికి? అయినాదానికి, కానిదానికి అప్పు చేస్తావు. వడ్డీలు కడతావు. నీకలవాటేగా!’’ అన్నని రెట్టించి దెప్పుతూ అన్నాడు శంకరం.తమ్ముడి మాటలు మౌనంగా భరించాడు విశ్వనాథ్.‘‘సరేలే! ఈ వాదులాట మనకెప్పుడూ ఉన్నదేగా! నిన్ననంగా సిటీకి వచ్చినవాడివి ఇంటికి రాలేదు. నీ ఆరోగ్యం మాత్రం పట్టించుకోవు’’ నిష్ఠూరమాడాడు శంకరం.
‘‘బాబాయి దగ్గర నేనొక్కడినే ఉన్నాను. ఇంకెవరూ రాలేదు. అందుకే రాలేకపోయాను’’ సంజాయిషీ ఇచ్చాడు విశ్వనాథ్.‘‘ఏం వాడింట్లో మనుషులేమయ్యారు? అన్నీ నాటకాలు..’’ ఉడుక్కుంటూ అంటుండగానే సిస్టర్ వచ్చి, ‘రామారావు పేషెంటు తాలూకు ఎవరున్నారో లోనికి రండి’ అని చెప్పి వెళ్లింది. తమ్ముడి ఫోన్ కట్ చేసి లోనికి వెళ్లాడు విశ్వనాథ్.‘‘డబ్బు కట్టి రూమ్ నంబరు పద్దెనిమిదికి వెళ్లండి. బాడీ ఎంబామ్ అవుతోంది’’ అంటూ తొందరపెట్టింది సిస్టర్.‘‘ఎంబామ్ అవుతోందా? అంటే?’’ ప్రశ్నించాడు విశ్వనాథ్.‘‘ఏం లేదు! బాడీని రెడీ చేస్తున్నాం’’ అని వివరం చెప్పకుండా లోనికి వెళ్లింది నర్సు.చంద్రం సాయంకాలం ఆరుగంటలకు వచ్చి బిల్లు కట్టాక శవాన్ని ఇచ్చారు. చంద్రం తన కారులో, విశ్వనాథ్ బాడీతో అంబులెన్సులో చంద్రం ఇంటికి బయలుదేరారు.
మరుసటిరోజు రామారావు దహన సంస్కారాలు పూర్తయ్యే సరికి ఉదయం పదకొండు గంటలు దాటింది. అక్కడికి వచ్చిన బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరుగా శ్మశానం వీడి వెళుతున్నారు. స్నానం చేసి, బట్టలు ఆరేసి ఓ మూల బెంచీ మీద నీరసంగా కూర్చుని ఉన్నాడు విశ్వనాథ్.‘‘శంకరం ఇంటికి వెళుతున్నావుగా! కర్మలకు రా అన్నా!’’ అని చెప్పి వెళ్లాడు చంద్రం.‘‘పద! ఇక మనం కూడా వెళదాం’’ అన్నాడు శంకరం అన్న దగ్గరకొచ్చి.ఆరేసిన బట్టలు మడిచి సంచిలో పెట్టుకుని, ‘‘ఒంట్లో నలతగా, తల దిమ్ముగా ఉందిరా! నిన్నటి నుంచి సరిగ్గా తినలేదు. ఆకలవుతోంది. అన్నం తిని వెంటనే ఊరికి బయలుదేరాలి. తెచ్చుకున్న డబ్బు ఖర్చయిపోయింది. దారి ఖర్చుకు డబ్బులు కావాలి’’ శ్మశానం బయటకు నడుస్తూ, మొహమాటపడుతూ తమ్ముడితో మెల్లగా అన్నాడు విశ్వనాథ్.
అదే సమయానికి వారి పక్కనుంచి మహాప్రస్థానం వ్యాన్ పెద్ద శబ్దం చేస్తూ వెళ్లింది. ఆ రొదలో విశ్వనాథ్ మాటలు గాలిలో కలిసిపోయాయి. తన మాటలు శంకరం వినలేదని విశ్వనాథ్ గమనించలేదు. ఇద్దరూ శ్మశానం నుంచి బయట రోడ్డు మీద ఆటో స్టాండ్‌కి వచ్చారు. అదే సమయానికి ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడాడు శంకరం.తిరిగి వస్తూనే, ‘‘అన్నయ్యా! మీ మరదలు ఫోన్ చేసింది. తనకు పట్టింపులు ఎక్కువ. శ్మశానం నుంచి ఎవరిళ్లకు వారు వెళ్లాలట. నీకు తెలిసే ఉంటుంది. అందుకే నువ్వు సరాసరి ఊరికి వెళ్లు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు’’ అని పక్కన నిలబడి, పాసింజర్ కోసం తమనే గమనిస్తున్న ఆటోను పిలిచాడు శంకరం.‘‘సార్‌ని బస్టాండ్‌లో దింపు’’ అని ఆటో డ్రైవర్‌కి చెప్పి, ఇంకొక ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు శంకరం నిర్దయగా.తమ్ముడేమన్నాడో సరిగ్గా అర్థమయ్యీ కాక క్షణంపాటు తొట్రుపాటుకు లోనయ్యాడు విశ్వనాథ్.
తమ మధ్య జరిగిన సంభాషణ మననం చేసుకున్నాడు. తమ్ముడన్న మాట అప్పుడు అర్థమైంది.‘అవును వాడన్నది నిజమే! కొందరికి ఇలాంటి పట్టింపులు ఉంటాయి. అయినా సొంత అన్నదమ్ముల మధ్య ఇలాంటి ఆంక్షలా?’ విరుద్ధ ఆలోచనలతో విశ్వనాథ్ మనసు కళ్లెంలేని గుర్రంలా పరుగెట్టింది. అంతటి నిస్సత్తువ, అశక్తతలోను అతని పెదవులపై వెర్రి చిరునవ్వొకటి తళుక్కుమని మాయమైంది. ఇంటికి చేరాలి. ఎలా వెళ్లాలి? అన్న ఆలోచన మిగతా ఏ ఆలోచనను దరిచేరనివ్వలేదు. ఏం చేయాలో తోచడం లేదు.తెచ్చుకున్న డబ్బు బాబాయి అత్యవసర మందులకు ఖర్చయింది. ఆ డబ్బును చంద్రాన్ని అడిగి తీసుకుందామనుకున్నాడు. మనసొప్పక అడగలేదు. ఇప్పుడు బస్సు టికెట్‌కి కూడా సరిపడా డబ్బులు లేవు. ఎవర్ని అడగాలి? దిక్కుతోచని స్థితి. శరీరంలో సత్తువ క్షీణించింది.
నాలుగు పిడచగట్టింది. మెదడు మొద్దుబారింది. చుట్టూ ఏం జరుగుతోందో, తనెక్కడ ఉన్నాడో సైతం అర్థం కావడంలేదు అతనికి. ఆలోచనా శక్తి మందగించింది. ఎవరో.. ఏదో.. అడుగుతున్నట్లుగా అనిపిస్తోంది.‘‘ఏ బస్టాండ్‌కి వెళ్లాలి సార్?’’ అడుగుతున్నాడు ఆటో డ్రైవర్.సమాధానం ఏం చెప్పాలో తోచడం లేదు. అతనికి మెదడు నుంచి నోటి మాటకు సంకేతం అందడం లేదు. యాంత్రికంగా జేబులు తడుముకున్నాడు విశ్వనాథ్.జేబులో మిగిలి ఉన్న ఒక్క యాభై రూపాయల నోటు, మొబైల్ ఫోను చేతిలోకి తీసుకున్నాడు.‘‘ఎక్కడికి వెళ్లాలి సార్?’’ మళ్లీ అడిగాడు ఆటో డ్రైవర్, విశ్వనాథ్‌ని పరికించి చూస్తూ.‘‘ఆటో వద్దు, డబ్బుల్లేవు..’’ అతని నోటి మాటలు ముద్దగా వచ్చాయి.‘‘గూగుల్ పే ఉంది సార్!’’‘‘నాకు లేదు. బస్టాండ్‌కి దారి చెప్పు. నడిచి వెళతాను’’ ఒంట్లో శక్తినంతా కూడదీసుకుని అంటూనే, మొదలు నరికిన మానులా కుప్పకూలిపోయాడు విశ్వనాథ్.
ఆటో అతను కంగారుపడుతూ ఆటో పక్కకు ఆపి, ఇంజిన్ ఆఫ్ చేసి, పడిపోయిన విశ్వనాథ్‌ని తట్టి లేపుతూ, స్పృహ కోల్పోయాడని నిర్ధారించుకున్నాడు. పరుగున ఆటో నుంచి వాటర్ బాటిల్ తెచ్చి, విశ్వనాథ్ ముఖం మీద నీళ్లు చల్లుతూ, ‘‘సార్.. సార్!’’ అంటూ తట్టి లేపే ప్రయత్నం చేశాడు.రెండు మూడు నిమిషాల తర్వాత కొద్ది తెలివి వచ్చి, మగతగా కళ్లు తెరిచాడు విశ్వనాథ్.విశ్వనాథ్ వీపు చుట్టూ చేయి వేసి, కూర్చోవడానికి సాయం చేసి, వాటర్ బాటిల్ అందించి, ‘‘కాసిని నీళ్లు తాగండి సార్’’ అన్నాడు ఆటో డ్రైవర్.నీళ్లు తాగి, ‘‘నాకేమైంది?’’ పీలగా లోగొంతుతో ప్రశ్నించాడు విశ్వనాథ్.‘‘మీరు స్పృహతప్పి పడిపోయారు. మీరు పడిపోయినప్పుడు.. మీ ఫోను, యాభై రూపాయల నోటు కింద పడ్డాయి’’ అని వాటిని, బట్టలున్న బ్యాగును విశ్వనాథ్ చేతికి అందించాడు ఆటో డ్రైవర్.
ఆ నోటును అతనికే తిరిగి ఇచ్చి, తినడానికి ఏమైనా తెమ్మని సైగ చేశాడు విశ్వనాథ్.అతను పరుగున వెళ్లి, పక్కనే ఉన్న పాన్‌షాపులో బిస్కట్ ప్యాకెట్ తెచ్చి, ‘‘ఇవి తినండి! మీ సుగర్ లెవల్ పడిపోయినట్లుంది’’ అని పక్కనే ఉన్న పళ్ల బండి మీద నుంచి రెండు అరటిపండ్లు తెచ్చి ఇచ్చాడు.నీళ్లు తాగి, నాలుగు బిస్కట్లు, అరటిపండు తిని, రెండో పండు బ్యాగులో వేసుకుని,‘‘చాలా సాయం చేశావు. థాంక్యూ తమ్మీ! ఒంట్లో ఇప్పుడు బాగుంది. కొద్దిగా శక్తి వచ్చింది’’ అని లేచి, వెళ్లడానికి ఉద్యుక్తుడయ్యాడు.‘‘నిన్ను ఇందాక నా ఆటో కాడ వదిలి వెళ్లినతను ఎవరు?’’ అడిగాడు ఆటో డ్రైవర్.‘‘నా తమ్ముడు’’ అన్నాడు విశ్వనాథ్.‘‘సొంత తమ్ముడా? ఇందాక ఆయనన్న మాటలు నేను ఇన్నా. నిన్ను ఇంటికి రావద్దు. సీదా ఊరికి పొమ్మన్నడు కదా!’’ అన్నాడు ఆటో డ్రైవర్.మౌనంగా లేచి నిలబడి, ‘‘నేను వెళతాను’’ అన్నాడు విశ్వనాథ్.‘‘ఎలా వెళతారు? డబ్బులు లేవన్నారు కదా!’’ అన్నాడు ఆటో డ్రైవర్.
‘‘నడిచి వెళతాను. ఎవరైనా తెలిసిన వాళ్లకి ఫోను చేద్దామన్నా ఫోన్ చార్జ్ అయిపోయినట్టుంది. నంబర్లు అందులో ఉన్నాయి. దేవుడు ఏదో విధంగా తప్పక సాయం చేస్తాడు’’ అన్నాడు విశ్వనాథ్ ఆకాళంలోకి చూస్తూ.‘‘అంతదూరం నడవడం కష్టమన్నా! నువ్వు నడిచే స్థితిలో లేవు. నిన్ను బస్టాండులో దింపి వెళతాను’’ అని విశ్వనాథ్ భుజం చుట్టూ చేయి వేసి, ఆటో దగ్గరికి నడిచాడు అతను.‘‘నీ పేరేంటి?’’ అడిగాడు విశ్వనాథ్.‘‘శంకర్’’‘‘ఓ.. నీది నా తమ్ముడి పేరే’’‘‘తమ్ముళ్లందరూ ఒకేలా ఉండరన్నా’’‘‘ఎందుకలా అన్నావు?’’‘‘మీకు తెల్వదా?.. ఇంతకీ ఏ ఊరెళ్లాలి?’’ మాట మారుస్తూ అడిగాడు శంకర్.‘‘కోదాడ వెళ్లాలి.. శంకర్! నువ్వు నా ఫోన్ తీసుకో. నాకు బస్సు చార్జి మందం మూడువందలు ఇవ్వు. ఫోను ఖరీదు పదిహేను వందలు ఉంటుంది’’ అన్నాడు విశ్వనాథ్.
‘‘తప్పు సార్! అట్టా మాట్లాడొద్దు. అవసరం ఎప్పుడు ఎట్టా ఎవరికి ఎవరితో వస్తుందో ఎవరికి ఎరుకన్నా! సాయానికి వెల కట్టకూడదు’’ అన్నాడు ఆటో శంకర్.ఆటో స్పీడ్ అందుకుంది. కాసేపట్లో బస్టాండ్ ఎంట్రీ గేటు దాటి ఆటోను ఓ మూలగా పార్క్ చేశాడు శంకర్. విశ్వనాథ్‌ని క్యాంటీన్‌కి తీసుకువెళ్లి భోజనం అయ్యాక, కోదాడ టికెట్ తీసుకుని బస్సు ఎక్కించాడు.‘‘శంకర్! నీ ఫోన్ నంబరు ఒక చిట్టీ మీద రాసివ్వు. ఊరికెళ్లగానే డబ్బు పంపిస్తాను. నువ్వు చేసిన సాయం జీవితాంతం గుర్తుంచుకుంటాను. నీకు కృతజ్ఞతలు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే! మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం నువ్వు. చిన్నవాడివైనా చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను’’ నమస్కరిస్తూ అన్నాడు విశ్వనాథ్.
చిట్టీ మీద తన ఫోన్ నంబరు రాసి ఇస్తూ, ‘‘అన్నా! అట్టా చేయకు. నాకస్సలు నచ్చదు. నీ పానం బాగా లేదని కండక్టర్‌కి చెప్పి, నా ఫోన్ నంబరు ఇంకో చిట్టీ మీద రాసిచ్చిన. తోవలో అవసరమొస్తే నాకు ఫోన్ చెయ్యమని చెప్పిన. ఎందుకైనా మంచిది, నీ తమ్ముడి ఫోన్ నంబరు నోటికి గుర్తుంటే నాకు చెప్పన్నా’’ అడిగాడు ఆటో శంకర్.ఫోన్ నంబరు చెప్పాడు విశ్వనాథ్. నంబరు నోట్ చేసుకుని, ‘‘ఇంటికి చేరగానే ఫోను చెయ్యన్నా. నమస్తే! నేనుంట’’ అని చెప్పి బయటకు వచ్చి, బస్టాండులోని పబ్లిక్ ఫోన్ నుంచి విశ్వనాథ్ తమ్ముడు శంకరానికి ఫోన్ చేశాడు ఆటో శంకర్.‘‘హలో! సంకరం గారేనా మాట్లాడేది?’’ అన్నాడు ఆటో శంకర్.
‘‘నా పేరు శంకరం.. సంకరం కాదు’’‘‘సంకరన్నా! ఇది ఇను. ఇందాక ఒక పెద్దాయన అమీర్‌పేట శ్మశానం బయట ఆటో స్టాండు కాడ స్పృహ తప్పి పడిపోయిండు. ఆయన ఫోను నుంచి గిదే నంబరుకి చివరి ఫోన్ చేసిండు. అందుకే నీకు ఫోన్ చేసిన. ఆయన నీకు చుట్టమో పక్కమో నాకు తెల్వదు. అంబులెన్సుకు నేనే ఫోను చేసిన. వాళ్లొచ్చి ఆయన్ని తీసుకుపోయిన్రు. ఏ హాస్పిటల్‌కి తీసుకుపోయిన్రో నాకు తెల్వదు. ఆ మనిషి నీకు తెలిసుంటే వివరం కనుక్కుంటావని, ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోను చేసిన, గంతే!’’ అని ఫోను పెట్టేశాడు ఆటో శంకర్.అన్న విశ్వనాథ్‌కి ఏమైనా ప్రమాదం జరిగిందా అనే అనుమానం వచ్చి భయపడ్డాడు శంకరం. వెంటనే అన్నకి ఫోన్ చేశాడు. ఫోన్ పనిచేయడం లేదని రికార్డెడ్ మెసేజ్ వస్తోంది.
‘‘రమా! అన్నయ్య శ్మశానం దగ్గర స్పృహతప్పి పడిపోయాడట! అంబులెన్స్ వాళ్లు ఏదో ఆస్పత్రికి తీసుకెళ్లారట. నీ మాట విని బుద్ధిలేని పనిచేశాను. నీకు పట్టింపని నన్ను పెంచిన అన్నని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేసి వచ్చాను. ఇంటికి రాకూడదన్నాను. మానవత్వం లేకుండా ప్రవర్తించాను. చేతిలో డబ్బుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు అన్నయ్యను ఎక్కడని వెదకాలి?’’ అని తల పట్టుకుని బాధపడుతూ వెంటనే బయలుదేరాడు.అమీర్‌పేట చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రులన్నీ మూడుగంటల పాటు వెదికాడు.
గాంధీ హాస్పిటల్ ఎమర్జెన్సీ చెక్ చేశాడు. జాడ తెలియలేదు. మళ్లీ అన్నకి ఫోన్ చేశాడు. ఇంకా ఫోన్ పనిచేయడం లేదని మెసేజ్ వస్తోంది. ఏం చేయాలో పాలు పోలేదు.
ఊళ్లో వదినకు ఫోన్ చేశాడు. అన్న ఇంకా రాలేదని, ఆయన ఫోను పనిచేయడంలేదని వదిన చెప్పింది. శంకరానికి కంగారు ఇంకా ఎక్కువైంది. తను చేసిన పనికి శంకరం మనసు వ్రయ్యలైంది.ఇంతలో ఫోను మోగింది. ఫోను తీశాడు శంకరం. ఏదో ల్యాండ్‌లైన్ నుంచి ఫోను.‘‘శంకరం! ఇప్పుడే కోదాడ బస్సు దిగి, నువ్వు కంగారు పడుతున్నావేమోనని బస్టాండు నుంచి ఫోను చేస్తున్నాను. నువ్వు నన్ను వదిలి వెళ్లాక నీరసంతో కళ్లు తిరిగి కూలబడ్డాను. ఎవరో ఆటో అతను.. అతని పేరు కూడా శంకరమే! సొంత తమ్ముడిలా నాకు భోజనం పెట్టించి, టికెట్ కొని బస్సు ఎక్కించి వెళ్లాడు. క్షేమంగా ఊరికి చేరానని చెప్పడానికి ఫోన్ చేశాను. ఉంటాను’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు విశ్వనాథ్!