
ఒక నగల దుకాణంలోకి చొరబడిన వ్యక్తిని సాధారణ దొంగగా భావించి, పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతడు పేరుమోసిన ‘గుడి’దొంగ ప్రకాశ్‌కుమార్ సాహుగా తేలడంతో వారు అవాక్కయ్యారు. ఈ ఉదంతం 2012లో జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని జమునాచౌక్ సమీపాన ఉన్న డాక్‌బంగ్లా ప్రాంతానికి చెందిన ప్రకాశ్‌కుమార్ సాహు 1996 నుంచి కొన్నేళ్ల పాటు దేవాలయాల్లోనే చోరీలు చేశాడు. ఇతడు ఆంజనేయస్వామి భక్తుడు కావడంతో ఆంజనేయుడి ఆలయాలు తప్ప మిగిలిన అన్ని ఆలయాల్లోనూ చేతివాటం చూపించాడు.
ఎక్కువగా సాయిబాబా, అమ్మవార్ల ఆలయాలపైనే కన్నువేసేవాడు. ఇతగాడు 1998లో విజయవాడ కనకదుర్గ ఆలయంలోకి చొరబడి అమ్మవారి ముక్కుపుడక, కిరీటం సహా ఆభరణాలను చోరీ చేశాడు. ఒడిశాలోని పూరీ జగన్నాథస్వామి ఆలయంలో 2001 నవంబర్ 10 అర్ధరాత్రి చొరబడి, పదమూడో శతాబ్ది నాటి మదనమోహన, అంబస్యనారాయణ విగ్రహాలను ఎత్తుకుపోయాడు. ఈ రెండు సంఘటనల్లోనూ అప్పటి ముఖ్యమంత్రులు స్పందించాల్సి వచ్చింది.
తొలినాళ్లల్లో కేవలం దేవాలయాలను మాత్రమే టార్గెట్‌గా చేసుకునే సాహు కొన్నాళ్లకు తన పంథా మార్చుకున్నాడు. జగన్నాథస్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసులో సాహు అదే ఏడాది నవంబర్ 27న భువనేశ్వర్ రైల్వేస్టేషన్‌లో చిక్కాడు. ఈ విచారణ నేపథ్యంలోనే ఇతగాడు బరంపురంలోని పెద్దబజారు ప్రాంతంలో ఉన్న రెండు నగల దుకాణాలనూ లూటీ చేసినట్లు అంగీరించాడు. వీటికి ముందే భువనేశ్వర్‌లోని లింగరాజ్ దేవాలయంలోనూ దొంగతనానికి పాల్పడ్డాడు. జగన్నాథస్వామి, లింగరాజ్ దేవాలయాల చోరీ కేసుల్లో సాహు జైలు శిక్ష పడింది.
ఇతడు ఏ దేవాలయాన్ని టార్గెట్‌గా చేసుకుంటాడో, అక్కడ ‘పని’ చేయడానికి ముందు భక్తుడిగా ప్రవేశించి ప్రార్థనలు చేస్తాడు. పూరీ గుడిలో చోరీకి వెళ్లిన సందర్భంలో విగ్రహాలు ముట్టుకునేప్పుడు, తీసేప్పుడు కళ్లు మూసుకుని చేశాడు. ఆపై భయపడిన సాహు మదనమోహన విగ్రహాన్ని భువనేశ్వర్ శివార్లలోని ఓ నూతిలో పడేశాడు. ఇతడు చేతివాటం ప్రదర్శించిన వాటిలో అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పురాతన ఆలయాలూ ఉన్నాయి. ఇతడు కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లోనూ నేరాలు చేశాడు. 2010లో హైదరాబాద్‌ను టార్గెట్ చేసిన సాహు అనేక ఆలయాల్లో చోరీలు చేశాడు. ఆపై కేపీహెచ్‌బీ భాగ్యనగర్ కాలనీలోని వాసవి జ్యూలర్స్, జూబ్లీహిల్స్‌లోని శ్రీకృష్ణానగర్‌లో బాబూలాల్ హీరాచంద్ జైన్ జ్యూలరీ షాపుల్లో నేరాలు చేశాడు.
2012 అక్టోబర్ 11న ఉప్పల్‌లోని మహాలక్ష్మీ జ్యూలర్స్‌ను టార్గెట్ చేసుకున్న సాహు ముందే రెక్కీ చేశాడు. ఆ రోజు అర్ధరాత్రి అక్కడకు తన అనుచరులతో కలిసి వచ్చి ‘పని’ ప్రారంభించాడు. తన వెంట తెచ్చుకున్న పరదాను జ్యూలరీ షాపు ముఖద్వారం రోడ్డుపైకి కనిపించకుండా అడ్డుగా కట్టాడు. దుకాణం పైఅంతస్తులో ఉండే యజమాని కిందికి రాకుండా దర్వాజా, గ్రిల్స్‌ను బిగించేశాడు. తొలుత జ్యూలరీ షాపు గ్రిల్స్‌కు వేసిన తాళాలను కట్టర్లతో కట్ చేశాడు. షట్టర్ మధ్య భాగంలో గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి, ఆ భాగం తెరిచి దుకాణం లోపలికి ప్రవేశించి, రెండు సీసీ కెమెరాలను ధ్వంసం చేశాడు. అయితే, ఆలోపే ఒక దాంట్లో సాహు కదలికలు రికార్డు అయ్యాయి. అనంతరం ఇన్వర్టర్‌ను ఆఫ్ చేశాడు. లాకర్‌ను కట్టర్‌తో కట్ చేస్తుండగా పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది.
సాహు ఈ దుకాణంలోని ఇన్వర్టర్ విషయంలో చిన్న పొరపాటు చేశాడు. యజమాని హస్తామల్ శర్మ నివసించేది షాపు పైన ఉన్న ఇంట్లోనే. దుకాణానికి, ఇంటికి కలిపి ఒకే ఇన్వర్టర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. షాపులోకి ప్రవేశించిన సాహు గ్యాంగ్ అవసరం లేకపోయినా ఇన్వర్టర్ వైరు కట్ చేసింది. ఆ రోజు అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఉప్పల్ ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్పటికే ఇన్వర్టర్ వైర్ కూడా తెగి ఉండటంతో అదికూడా పని చేయలేదు. ఉక్కపోతతో మెలకువ వచ్చిన శర్మ బాల్కనీలోకి వచ్చి చూశాడు. గ్రౌండ్ ఫ్లోర్‌లో నుంచి పొగలు కనిపించడంతో అప్రమత్తమై చుట్టుపక్కల వారితో పాటు పోలీసులకు సమాచారం అందించాడు. శర్మ పిలుపుతో అప్రమత్తమైన చుట్టుపక్కల వారు ఇళ్లల్లో లైట్లు వేశారు. ఇది గమనించిన సాహు అనుచరులు పరారవగా, ఆ అవకాశం లేని సాహు దుకాణం మెట్ల కిందే నక్కాడు.
చుట్టుపక్కల వారు దుకాణం వద్దకు చేరుకోవడంతో పాటు అదే సమయంలో పోలీసులూ వచ్చారు. అప్పటి వరకు మెట్ల కింద నక్కిన సాహు ఈ హడావుడితో కంగారు పడ్డాడు. బయటకు వచ్చి జనం మధ్య నుంచి కొంతదూరం వెళ్లి ఒక్కసారిగా పరిగెత్తడం ప్రారంభించాడు. దీంతో స్థానికులు, పోలీసులు వెంబడించి అతడిని పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. మామూలు దొంగగా భావించిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఇతడు సాహు అనే విషయం బయటపడింది. దీంతో మల్కాజ్‌గిరి సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు తరలించారు. అప్పట్లో గుడులు, జ్యూలరీ దుకాణాలు కలిపి 13 చోరీలు అంగీకరించిన సాహు ఆ సొత్తును మహారాష్ట్రలో ఉన్న మిత్రుడి వద్ద దాచినట్లు చెప్పాడు. ఆఖరుసారిగా సాహు 2023 ఫిబ్రవరిలో కేరళలోని కొచ్చి పోలీసులకు చిక్కాడు.