
ప్రపంచంలో రకరకాల పత్రికలు ఉన్నాయి. దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు సర్వసాధారణంగా అందరికీ తెలిసివే! అక్కడక్కడా ద్వైమాసిక పత్రికలు, త్రైమాసిక పత్రికలు కూడా ఉన్నాయి. అరుదుగా ఏడాదికి రెండుసార్లు మాత్రమే ప్రచురితమయ్యే అర్ధవార్షిక పత్రికలు, ఏడాదికి ఒకే సంచికను వెలువరించే వార్షిక పత్రికలు కూడా ఉంటాయి. ఫ్రాన్స్ నుంచి వెలువడే ‘లా బూజీ డి సాపోర్’ అనే ఈ పత్రిక మాత్రం అలాంటిలాంటి పత్రిక కాదు. ప్రపంచంలోని పత్రికలన్నింటిదీ ఒకదారి అయితే, ఈ పత్రికది మరోదారి. జన్మానికో శివరాత్రి అన్నట్లుగా ఈ పత్రిక క్రమం తప్పకుండా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే ప్రచురితమవుతుంది. అది కూడా ఠంచనుగా ప్రతి లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29వ తేదీన ఇది విడుదలవుతుంది. లీపు సంవత్సరం వచ్చిందంటే చాలు, దీనికోసం పెద్దసంఖ్యలో పాఠకులు ఎదురుచూస్తూ ఉంటారు.
అలా మొదలైంది...
హాస్య, వ్యంగ్య కథనాలను ప్రధానంగా ప్రచురించే ఈ పత్రిక 1980లో మొదలైంది. ఇప్పటి వరకు ఈ పత్రిక వెలువరించినవి పన్నెండు సంచికలు మాత్రమే! పెద్దగా వ్యాపార ప్రణాళికలు, ఘనమైన లక్ష్యాలు వంటివేవీ లేకుండానే ఈ పత్రిక ఇద్దరు మిత్రుల చిలిపి ఆలోచన ఫలితంగా పుట్టుకొచ్చింది. జాక్వెస్ డి బుయిసన్, క్రిస్టియన్ బెయిలీ అనే మిత్రులు కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నపుడు ‘లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి కదా, ప్రతిసారీ ఫిబ్రవరి 29న విడుదలయ్యేలా ప్రత్యేకంగా ఒక పత్రికను తీసుకొస్తే భలేగా ఉంటుంది కదా!’ అని అనుకున్నారు. జాక్వెస్ పాలిటెక్నీషియన్, క్రిస్టియన్ ఔత్సాహిక ప్రెస్ టెక్నీషియన్– అంతేకాకుండా, పాతపత్రికల సేకర్త కూడా!
ఇద్దరూ కలసి ఎలాగైనా, ఫిబ్రవరి 29న విడుదలయ్యేలా పత్రిక ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారు. పత్రికకు ఏ పేరు పెడదామని ఆలోచించారు. పంతొమ్మిదో శతాబ్ది చివరిరోజుల నాటి కార్టూన్ క్యారెక్టర్ ‘సాపర్ కామెంబర్’ గుర్తొచ్చింది. ఆ కార్టూన్ పాత్ర ఫిబ్రవరి 29న వస్తుంది. నాలుగేళ్లకు ఒకసారి పుట్టినరోజు జరుపుకొనే ఆ పాత్ర బోలెడంత హాస్యం సృష్టిస్తుంది. అందుకే, ఆ పాత్ర గుర్తొచ్చేలాంటి పేరు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ‘లా బూజీ డి సాపోర్’ (సాపర్స్ క్యాండిల్) అనే పేరు పెట్టారు. తొలి సంచికను 1980 ఫిబ్రవరి 29న ఇరవై పేజీలతో టాబ్లాయిడ్ సైజులో విడుదల చేశారు. మార్కెట్‌లోకి విడుదలైన కాపీలు హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. అప్పటి నుంచి ఈ పత్రిక ప్రతి లీపు సంవత్సరంలోను ఫిబ్రవరి 29న ఠంచనుగా మార్కెట్‌లోకి తన సంచికను విడుదల చేస్తోంది. ప్రస్తుతం జీన్ డి లిండీ ఈ పత్రికకు ప్రధాన సంపాదకుడిగా కొనసాగుతున్నారు.
హాస్యరస ప్రధానం
ప్రధానంగా ఇది హాస్యరస ప్రధానమైన పత్రిక. ఎక్కువగా హాస్య, వ్యంగ్య కథనాలను ప్రచురిస్తుంది. అయినా, దీనిపైన రాజకీయ విమర్శలు లేకపోలేదు. జాతీయ అతివాదానికి ఈ పత్రిక మద్దతుగా కథనాలను ప్రచురిస్తోందని కొన్ని ఫ్రెంచ్ పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే, తమది పూర్తిగా రాజకీయాలకు అతీతమైన పత్రిక అని ప్రధాన సంపాదకుడు జీన్ డి లిండీ చెప్పుకుంటారు. ఈ పత్రిక ప్రతులు ఫ్రాన్స్‌లోనే కాకుండా బెల్జియం, స్విట్జర్లండ్, లగ్జెంబర్గ్, కెనడా దేశాల్లో కూడా అమ్ముడవుతాయి. చివరిగా 2024లో విడుదలైన ఈ పత్రిక ప్రతులు రెండు లక్షలకు పైగా అమ్ముడయ్యాయి. ‘మేం ప్రచురించే ప్రతి సంచికలోనూ గడచిన నాలుగేళ్లలో జరిగిన రాజకీయ పరిణామాలను సింహావలోకనం చేస్తాం.
అలాగని మాది రాజకీయ పత్రిక కాదు. రాజకీయాలకు అతీతంగా మేం పత్రికను నడుపుతున్నాం. బ్రెగ్జిట్ మొదలుకొని పర్యావరణ మార్పుల వరకు రకరకాల సమస్యలను మా పత్రికలో చర్చిస్తుంటాం. కథనాలు హాస్యస్ఫోరకంగా, వ్యంగ్యంగా ఉంటే పాఠకులను త్వరగా ఆకట్టుకోగలవని మా ఉద్దేశం. నవ్వు ఆరోగ్య లక్షణం. పాఠకులను నవ్వించాలనేదే మా లక్ష్యం’ అంటారు ఈ పత్రిక ప్రధాన సంపాదకుడు జీన్ డి లిండీ. ఈ పత్రిక 2024 సంచిక ధర 4.90 యూరోలు. మిగిలిన పత్రికల్లాగానే ఈ పత్రికను కూడా మార్కెట్‌లోకి విడుదలైనప్పుడు కొనుక్కోవచ్చు. ఎప్పటి సంచికను అప్పుడు కాకుండా, ఒకేసారి చందా కట్టాలనుకుంటే, 100 యూరోలు చందా కట్టినట్లయితే, వందేళ్ల పాటు– అంటే, పాతిక సంచికలు అందుతాయి. ప్రపంచ పత్రికా రంగంలో ఈ ఫ్రెంచ్ పత్రికది ఒక విలక్షణమైన కథ.