‘మొండికుంట’కు హైడ్రా ఫెన్సింగ్
చెరువుతో పాటు ప్రభుత్వ భూమి ఆక్రమణ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) గురువారం మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలో భారీ ఆపరేషన్ చేపట్టింది. మొండికుంట చెరువులో అక్రమంగా వెలిసిన వందలాది తాత్కాలిక షెడ్లు, పదుల సంఖ్యలో ఉన్న దుకాణాల ను తొలగించింది. ఈ చెరువుతో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణలు తొలగించిన అధికారులు మొత్తం 11 ఎకరాలకు కంచె వేశారు. దీని మార్కెట్ విలువ రూ.2200 కోట్ల వరకు ఉంటుందని అధికారులు ప్రకటించారు. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నం.53లో ఉన్న మొండికుంటతో పాటు సర్వే నం.55లోని ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించారు. దీనిపై స్థానికులు ప్రజావాణి ద్వారా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. ఫలితంగా దాదాపు 11 ఎకరాలు కబ్జాకు గురైనట్టు తేలింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఆలయాన్ని హద్దుగా చూపించిన కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడినట్టు అధికారులు నిర్ధారించారు. ఆలయం హద్దుగా పలు షాపులు, మెకానిక్ షెడ్లు, ఐరన్ అండ్ స్టీల్ షాపు ఇలా పలు రకాల దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇలా 30కి పైగా ఉన్న షాపుల ద్వారా కబ్జా చేసిన వాళ్లు నెలకు రూ.లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నారు. మొండికుంటతో పాటు అక్కడ ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలపై గత నెల 31న హైడ్రా విచారణ చేపట్టింది. రెవెన్యూ అధికారులతో పాటు కబ్జాలకు పాల్పడిన వారు కూడా ఈ సమవేశంలో పాల్గొన్నారు. వారి సమక్షంలోనే ఆక్రమణలు జరిగినట్టు రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాటిలైట్ చిత్రాలను పరిశీలించిగా ఇదే నిర్థారణ అయింది. ఇదే విషయాన్ని అధికారులు కబ్జాదారులకు తెలిపారు. వారికి కొంత సమయమిచ్చిన హైడ్రా గురువారం ఆక్రమణలను తొలగించే పనిని చేపట్టింది. వందల సంఖ్యలో ఉన్న తాత్కాలిక షెడ్లను భారీ బందోబస్తు మధ్య హైడ్రా తొలగించింది.
మొత్తం 11 ఎకరాల్లో ఉన్న నిర్మాణాల తొలగింపు
దీని మార్కెట్ విలువ దాదాపు రూ.2200 కోట్లు
మాదాపూర్ హైటెక్స్ సమీపంలో భారీ ఆపరేషన్


