వంద శాతం పైపులైన్ గ్యాస్ సిటీకి సన్నాహాలు
నగరంలో ప్రస్తుతం పైపులైన్ గ్యాస్ ఇలా..
సాక్షి, సిటీబ్యూరో
గ్రేటర్ పరిధిలో సిలిండర్ల కొరత, డెలివరీ నిరీక్షణ పెరుగుతుండటంతో పైపులైన్ గ్యాస్ (పీఎన్జీ) వైపు అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీల విస్తరణతో అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు గ్యాస్ గ్రిడ్‌గా మారేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పైపులైన్ వ్యవస్థ ఉన్న ప్రాంతాల్లో ప్రధాన నివాస ప్రాంతాలన్నింటినీ దీని పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలకు చమురు సంస్థలు చర్యలు చేపట్టాయి. తాజాగా వంట గ్యాస్ సంక్షోభంతో పైపులైన్ గ్యాస్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగినట్లయింది. స్విచ్ వేస్తే చాలు అన్నంత సులభంగా అందే వంట గ్యాస్‌వైపు నివాసితుల ఆసక్తి పెరిగింది. ఎల్పీజీ సరఫరాలో అంతరాయాలను అధిగమించడానికి ప్రభుత్వాలు కూడా ‘గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ’ను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగానే వందశాతం పైపులైన్ గ్యాస్ సిటీగా మార్చే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.
250కిపైగా భారీ నివాస సముదాయాల్లో..
నగరంలో పైపులైన్‌న్ గ్యాస్ సరఫరా బాధ్యతలను ప్రధానంగా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఇది గెయిల్, హెచ్‌పీసీఎల్ సంయుక్త భాగస్వామ్యంతో కార్యకలాపాలు సాగిస్తోంది. దీంతో పాటు ఇండియా ఆయిల్ సైతం తన పరిధిని విస్తరిస్తోంది. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నగరంలోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి, మణికొండ వంటి ఐటీ కారిడార్‌లతో పాటు శంషాబాద్ పరిసరాల్లో సుమారు 250కి పైగా పెద్ద నివాస సముదాయాల్లో పూర్తిస్థాయి గ్రిడ్ నెట్‌వర్క్ ఉంది. ఇండియన్ ఆయిల్ నగర శివార్లలోని కొత్త వెంచర్లు, అపార్ట్‌మెంట్‌లలో వేగంగా ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, మేడ్చల్ కారిడార్ విస్తరిస్తూ కనెక్షన్ల ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. మరికొన్ని ప్రైవేట్ సంస్థలు కొత్తగా వెలుస్తున్న టౌన్‌షిప్‌ల్లో సమీకృత గ్యాస్ గ్రిడ్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి.
విలాసం కాదు.. అత్యవసరం..
ప్రస్తుతం 80 శాతం కొత్త ప్రాజెక్టులు నేరుగా గ్యాస్ పైపులైన్ సౌకర్యంతోనే నిర్మాణాలు చేస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం ‘నేచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం ఆర్డర్ 2026’ ప్రకారం పైపులైన్ పనులకు అనుమతులను సులభతరం చేసింది. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు శివారులో కొత్తగా వెలుస్తున్న వెంచర్ల వరకు గ్యాస్ పైపులైన్ గ్రిడ్ విస్తరిస్తోంది. దీంతో హైదరాబాద్ వంటి గ్లోబల్ సిటీలో ’పైప్ గ్యాస్’ అనేది ఇప్పుడు విలాసం కాదు, అత్యవసరంగా మారింది. పెద్ద అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనిటీలలో ’సెంట్రలైజ్డ్ గ్యాస్ బ్యాంక్’ల నుంచి నేరుగా పైపులైన్ మోడ్‌కు మారే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
సిలిండర్ల వేట దాటి పీఎన్జీ వైపు మొగ్గు
వంటగదికి ‘పైపు ద్వారా గ్యాస్’కు భరోసా
విస్తరణకు చమురు సంస్థల సన్నాహాలు
సిద్ధమవుతున్న అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు
సిలిండర్ల కొరతను అధిగమించేందుకు ప్రయత్నాలు


