మాట మార్చి.. నిధులు ఏమార్చి!
● ఆరు స్వీపర్లని ఒకసారి.. రెండని మరోసారి ఆర్టీఐ కింద సమాధానం
● పీసీబీలో రూ.కోటి గోల్‌మాల్!
మెకానికల్ రోడ్ స్వీపర్ వాహనాల కొనుగోళ్లలో అక్రమాలు
సాక్షి, సిటీబ్యూరో: రోడ్లు శుభ్రం చేసే యంత్రాల పేరిట కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) నిధులు ఊడ్చేసింది. స్వీపింగ్ వాహనాల కొనుగోళ్లపై బాధ్యతారాహిత్యంగా స్వీపింగ్ ఆన్సర్ ఇచ్చింది. జాతీయ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం(ఎన్‌సీఏపీ) కింద హైదరాబాద్, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాలను కేంద్రం ఎంపిక చేసింది. గాలి కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టింది. రాజధాని నగరంలో వాయునాణ్యతను పెంపొందించడానికి రూ.614 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలోనే రహదారులపై ఉన్న దుమ్ము, ధూళి, చెత్తను శుభ్రం చేయడానికి మెకానికల్ రోడ్ స్వీపర్(ఎంఆర్‌ఎస్) వాహనాలను కొనుగోలు చేయాలని పీసీబీ అధికారులు నిర్ణయించారు. అయితే వాయుకాలుష్య నియంత్రణ, గాలి నాణ్యత పెంపొందించడానికి ఏ రకమైన చర్యలు తీసుకున్నారని ఆర్‌టీఐ కింద ఓ వ్యక్తి అడగ్గా రహదారులను శుభ్రం చేయడానికి 6 ఎంఆర్‌ఎస్ వాహనాలు కొనుగోలు చేశామని సమాధానం ఇచ్చారు. పదిరోజుల వ్యవధిలో మరోసారి సంబంధిత వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు, ఇతర వివరాలు కావాలని అడగ్గా ఆరు కాదు, రెండు వాహనాలే కొన్నామని మాట మార్చారు. ఒకదానిని పటాన్‌చెరు, మరోదానిని జీడిమెట్ల ఐలాకు అప్పగించామని చెప్పారు.
కొల్లగొట్టింది రూ.కోటిపైనే..?
పీసీబీ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం 11.9 టన్నుల సామర్థ్యం కలిగిన ఒక్కో వాహనం సుమారు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ధర పలుకుతుంది. ఆరు వాహనాలకు సుమారు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్లు వరకు వెచ్చించి ఉండొచ్చని సమాచారం. ఇప్పుడు ఉన్నపళంగా నాలుగు వాహనాలు లేవంటే, వాటికి వెచ్చించిన సుమారు రూ.కోటికిపైగా ఏమయ్యాయనే ప్రశ్న తలెత్తుతోంది. 2021 ఆగస్టులో రెండు వాహనాలను కొనుగోలు చేసినట్లు, వీటిని పటాన్‌చెరు, జీడిమెట్ల ఐలా కమిషనర్లకు అప్పగించినట్లు చూపిస్తున్నారే తప్ప, ఎన్ని నిధులు వెచ్చించారనే సమాచారం, వాహనాల రిజిస్ట్రేషన్ నెంబరు, ఇతర వివరాలేవీ పీసీబీ కార్యాలయంలో అందుబాటులో లేవు.
రూ.50 లక్షలకు నో టెండర్?
కాలుష్యనియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇటీవల తెలంగాణ పీసీబీ సుమారు రూ.50 లక్షలు కేటాయించింది.
నిబంధనల ప్రకారం రూ.5 లక్షల కంటే ఎక్కువ కాంట్రాక్టు ఇచ్చే సమయంలో ఓపెన్ టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఎల్–1 (తక్కువ ధర) కోడ్ చేసిన వారికి పనులు అప్పగించాలి. అయితే నిబంధనలను పక్కన పెట్టి నిధులు కేటాయించడంపై ఆంతర్యమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయమై ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ పై నుంచి ఒత్తిడి ఉందని, అందుకే టెండర్ లేకుండా ఇవ్వాల్సి వచ్చిందని, ఇందులో తమకేం సంబంధం లేదని పేర్కొన్నారు. గతంలోనూ ఓ సంస్థకు ఇలాగే రూ.25 లక్షలు నామినేషన్ పద్ధతిలో కేటాయించడం విశేషం. అయితే దీని వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరనేది అంతుచిక్కడంలేదని సిబ్బంది అంటున్నారు.


