తుది దశకు ‘తరలింపు’
● ప్రభుత్వ భవనాల్లోకి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ● ‘మార్పు’పై స్థానికుల అభ్యంతరాలు
సాక్షి, సిటీబ్యూరో: నగర పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల తరలింపు వ్యవహారం తుదిదశకు చేరుకుంది.అద్దె భవనాల భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అధికారులు కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు నాయకులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. స్థానికంగానే కార్యాలయాలు ఉండాలని కోరుతున్నారు.
● ఇప్పటికే అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోకి మారనున్నాయి. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆఫీసులను ప్రభుత్వ భవనాల్లోకి మార్చడానికి ప్రభుత్వం విధించిన గడువు శుక్రవారంతో ముగియనుంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయి. ఒక్కో కార్యాలయానికి నెలకు రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తోంది. ఇలా ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనం ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తుండటంతో ఆర్థిక శాఖ అప్రమత్తమైంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రైవేట్ భవనాలకు అద్దెలు చెల్లించబోమని స్పష్టం చేసింది. దీంతో అందుబాటులో ఉన్న సర్కారీ భవనాల్లోకి ఆఫీసులను తరలిస్తున్నారు.
నిరసన సెగలు
స్థానికంగా అందుబాటులో ఉన్న ఆఫీసులను 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు తరలించడంపై సామాన్యులు మండిపడుతున్నా రు. ఒకవైపు స్థానికంగా అందుబాటులో ఉన్న ఆఫీసులు దూరంగా తరలించవద్దంటూ.. మరోవైపు తమ ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళనకు దిగుతున్నారు. ఇబ్రహీంపట్నం కార్యాలయాన్ని మంఖాల్ తుక్కుగూడ సమీపానికి తరలించే ఆలోచనను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కిలోమీటర్ల మేర ప్రయాణం భారమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల తరలింపు ప్రక్రియతో కొన్ని కొత్త చిరునామాలకు మారిపోయాయి. మరికొన్ని తరలింపునకు సిద్ధమవుతున్నాయి. ఎస్‌ఆర్ నగర్, బాలానగర్ కార్యాలయాలు వెంగళరావునగర్‌లోని ఆరోగ్య శాఖ భవనంలోకి మార్చారు. బంజారాహిల్స్, గోల్కొండ ఆఫీస్‌లను తాత్కాలికంగా షేక్‌పేట ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాంగణాలకు తరలించారు. పాతబస్తీలోని చార్మినార్, ఆజంపురా, దూద్‌బౌలి ఆఫీస్‌లు మలక్‌పేట గంజ్‌లోని రెవెన్యూ భవనంలోకి తరలించారు. హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని నాంపల్లిలోని గృహకల్ప భవనంలోకి మారింది. మేడ్చల్ పరిధిలోని ఉప్పల్, ఘట్‌కేసర్ ఆఫీసులను బేగంపేటలోని పాత విమానాశ్రయం సమీపంలో ఉన్న ప్రభుత్వ భవన సముదాయంలోకి లేదా కండ్లకోయకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శేరిలింగంపల్లి, గండిపేట వంటి ఆఫీసులను గచ్చిబౌలిలోని ‘తాలిమ్’ భవనంలోకి తరలించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి.


