ఇదేం పద్ధతి.. కిందకూర్చోబెట్టి చదివిస్తారా?
బంజారాహిల్స్: ‘‘ఈ రోజుల్లో కూడా పిల్లల్ని కింద కూర్చొబెట్టి ఎలా చదివిస్తున్నారు.. అధికారులు అసలు ఏం చేస్తున్నారు?’’ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని ఉదయ్‌నగర్‌లోని ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే దానం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలు నేలపై కూర్చొని పాఠాలు వింటున్న విద్యార్థులను చూసి చలించిపోయారు. వెంటనే హెచ్‌ఎంను రావాలని కోరారు. అయితే హెచ్‌ఎం.. సమావేవానికి వెల్లారని టీచర్లు చెప్పారు. దీంతో డీఈఓ రోహిణికి వీడియో కాల్ చేసి పిల్లల పరిస్థితిని వివరించారు. ‘‘మేడం ఈ పిల్లల పరిస్థితిని చూడండి.. కింద కూర్చొని చదువుతున్నారు’’ అని పేర్కొన్నారు. కనీసం స్కూల్‌లో గ్రీన్ బోర్డులు లేవు, తాగునీటి వసతి లేదు అని మండిపడ్డారు. తాను ఈ స్కూల్ గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడానని అయినా కూడా అధికారులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పిల్లలను కిందకూర్చొపెట్టి ఎలా చదువు చెబుతున్నారని.. వాళ్ళను చూస్తుంటే చాలా బాధగా ఉందని అన్నారు. వెంటనే విద్యార్థుల కోసం తాత్కాలికంగా షెడ్డు అయినా నిర్మించాలని కోరారు. అందుకు నిధుల విడుదలలో జాప్యం ఉంటే తన మిత్రులతో మాట్లాడి సీఎస్‌ఆర్ నిధులు కానీ లేదంటే తానే స్వయంగా ఇస్తానని అన్నారు. వెంటనే షెడ్డు నిర్మాణంతో పాటు స్కూల్‌లో గ్రీన్‌బోర్డులు, మంచినీటి కోసం ఆర్‌వో మిషన్‌ను ఏర్పాటు చేయాలని డీఈవోకు సూచించారు.
డీఈవోకు వీడియో కాల్ చేసిన దానం
ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం


