పారిశ్రామిక రంగంలో యువతకు ప్రోత్సాహం
అఖిల భారత ఆర్య వైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం
హిమాయత్‌నగర్: దేశ ఆర్థికాభివృద్ధికి రెండు దశాబ్దాలకు పైగా కృషి చేస్తున్న అఖిల భారత ఆర్య వైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం (ఏఐఎవీఐఎఫ్) రజతోత్సవాలను ఫిబ్రవరి 1న నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ‘ప్రధాన్ కన్వెన్షన్’లో నిర్వహించనున్నట్లు ఏఐఎవీఐఎఫ్ అధ్యక్షుడు రాంబాబు పబ్బిశెట్టి తెలిపారు. గురువారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... 25 ఏళ్లుగా యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో రానున్న రోజుల్లో యువతకు పారిశ్రామిక రంగంలో మెళకువలు నేర్పించడంతో పాటు ఎంఎస్‌ఏంఈలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. వేడుకలకు తెలంగాణ, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టి.జి.భరత్, నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. ఇందులో పారిశ్రామిక రంగం పట్ల యువతలో ఆసక్తిని పెంపొందించేందుకు 50 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఫోరం నేతలు శ్రీనివాస్ బత్తుల, కాశీవిశ్వనాథం చింత, విజయ ప్రసాద్ గుంపల్లి, మంచి రాజశేఖర్, ఎర్రం బాలకృష్ణ పాల్గొన్నారు.


