‘కండల ఇంజెక్షన్ల’పై నిఘా !
సాక్షి, సిటీబ్యూరో: కండల కోసం జిమ్‌లకు వెళ్తున్న యువతను టార్గెట్‌గా చేసుకుని, వైద్యుల సిఫార్సు లేకుండా, అక్రమంగా స్టెరాయిడ్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న ముఠాలపై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా ఉంచారు. గత వారం ఓ వ్యక్తి చిక్కగా తాజాగా పశ్చిమ మండల అధికారులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. ఇతడి నుంచి రూ.1.20 లక్షల విలువైన 120 బాటిళ్ల మెఫెంటైర్మెన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ గురువారం వెల్లడించారు. జిర్రాకు చెందిన రషీద్ మత్లూబ్ ఖాన్ వృత్తి రీత్యా జిమ్ ట్రైనర్. ఇతగాడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బాడీ బిల్డింగ్ చేసే యువతను లక్ష్యంగా చేసుకున్నాడు. కండలు త్వరగా పెరగాలని కోరుకునే యువకులకు ఎలాంటి లైసెన్స్, డాక్టర్ సలహా, సిఫార్సు లేకుండా ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నాడు. వీటిని గుజరాత్‌లోని సూరత్ నుంచి ’ఇండియా మార్ట్’ ఖరీదు చేస్తున్నాడు. తన భార్య పేరుతో కొరియర్ ద్వారా నగరానికి రప్పిస్తున్నాడు. ఇతగాడు ఎక్కువగా మెఫెంటైర్మెన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్నాడు. వీటిని సాధారణంగా లోబీపీ ఉన్న వారికి చికిత్స కోసం వాడతారు. యువత వీటిని బాడీ బిల్డింగ్ కోసం వాడి ప్రాణాంతకమైన గుండె, కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్, ఎస్సై ఎండీ జాహెద్‌లతో కూడిన బృందం వలపన్ని రషీద్‌ను పట్టుకుంది. కొన్నాళ్లుగా ఇదే దందా చేస్తున్న ఇతడిపై అత్తాపూర్, అబిడ్స్, టప్పాచబుత్రా పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
20 ఇంజక్షన్ బాటిళ్లు స్వాధీనం..
చాంద్రాయణగుట్ట: స్టెరాయిడ్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న యువకుడిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్, ఫలక్‌నుమా పోలీసులు గురువారం సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసారావు తెలిపిన మేరకు..ఫలక్‌నుమాకు చెందిన అబ్దుల్ గఫార్ ఖాన్(30) బార్కాస్ ప్రాంతానికి చెందిన అహ్మద్ నహదీ అనే వ్యక్తి వద్ద ‘మెఫెంటైర్మెన్ సల్ఫేట్’ అనే స్టెరాయిడ్స్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి, త్వరగా కండలు పెరగాలని కోరుకునే యువతకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.ఆదిరెడ్డి, ఎస్‌ఐలు ఎస్.శేషు, ఎం.మహేష్‌ల బృందం ఫలక్‌నుమా పోలీసులతో కలిసి నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.24 వేల విలువజేసే 20 ఇంజక్షన్ బాటిళ్లు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు నహదీ పరారీలో ఉన్నాడు.


