సైబర్ క్రైం అధికారినంటూ మోసం
● అమాయకులనుంచి డబ్బు వసూలు ● నిందితుడి అరెస్ట్
అమీర్‌పేట: సైబర్ క్రైమ్ పోలీసు అధికారినంటూ అమాయకులను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న అంతర్రాష్ట్ర నేరగాడిని ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 44 కేసులు నమోదయ్యాయి. ఎస్‌ఆర్‌నగర్ ఏసీపీ రాఘవేంద్రరావు తెలిపిన మేరకు.. వరంగల్ జిల్లా పరకాల పులిగిల్లకు చెందిన జాల సాయిరామ్‌రెడ్డి బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు. ప్రస్తుతం కరీంనగర్‌లో ఉంటున్న సాయిరామ్ రాపిడో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు సైబర్ నేరాల బాట పట్టాడు.సోషల్ మీడియా కేంద్రంగా అమ్మాయిల పేరుతో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి యువకులకు వలవేస్తాడు. వారి ఫోన్ నెంబర్లు సేకరించి.. ఆ తరువాత సైబర్ క్రైమ్ పోలీసు అధికారినంటూ ఫోన్ చేస్తాడు. ఆన్‌లైన్‌లో అసభ్యకర పనులు చేస్తున్నారు..మీపై కేసు నమోదైందని భయపెట్టి అరెస్టు కాకుండా ఉండాలంటే ఫైన్ కట్టాలని డిమాండ్ చేసి డిజిటల్ మార్గాల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఆపై డిజిటల్ ఆధారాలు దొరక్కుండా వారి ఫోన్లను రీ సెట్ చేయిస్తాడు. తాజాగా ఎస్‌ఆర్‌నగర్‌లో ఓ విద్యార్థిని భయపెట్టి రూ.97,540 వసూలు చేయడంతో బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నింధితుడిని ఎట్టకేలకు అరెస్టు చేశారు.


