పండక్కి వెళ్లి.. సిటీకి మళ్లీ ..
సొంతూళ్ల నుంచి తిరుగు పయనం
సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లినవారు చాలావరకు ఆదివారం నగరానికి చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కిక్కిరిసిన రద్దీతో బయలుదేరిన బస్సులు, రైళ్లు నగరానికి చేరుకున్నాయి. మరోవైపు సొంత వాహనాల్లోనూ జనం పెద్ద ఎత్తున బయలుదేరి రావడంతో ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ పోటెత్తింది. మరోవైపు సంక్రాంతి సందర్భంగా రిటర్న్ జర్నీ కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపింది. కాకినాడ, విశాఖ, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి బయలుదేరిన రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శబరిమలకు వెళ్లిన అయ్యప్ప భక్తులు కూడా ప్రత్యేక రైళ్లలో నగరానికి బయలుదేరారు. దీంతో వివిధ మార్గాల్లో రైళ్లలో రద్దీ భారీగా పెరిగింది. సంక్రాంతి రాకపోకలను దృష్టిలో ఉంచుకొని సుమారు 51 రైళ్లను ఏర్పాటు చేశారు. తిరుగు ప్రయాణికుల రద్దీతో సికింద్రాబాద్, చర్లపల్లి, లింగంపల్లి తదితర స్టేషన్లలో సందడి నెలకొంది.
ఆర్టీసీ ఏర్పాట్లు..
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 6,400 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. కానీ ప్రయాణికుల డిమాండ్ మేరకు 5,375 ప్రత్యేక బస్సులను నడిపినట్లు అధికారులు తెలిపారు. రిటర్న్ జర్నీ కోసం ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. విజయవాడ, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాల రద్దీ భారీగా పెరిగింది. టోల్‌గేట్ల వద్ద గంటల తరబడి నిలిచిపోయాయి. దీంతో ప్రయాణ సమయం విపరీతంగా పెరిగింది. మరోవైపు సోమవారం కూడా పలు జిల్లాల నుంచి రద్దీకనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాము చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చినట్లు పేర్కొన్నారు.తిరుగు ప్రయాణంలో కూడా ఆర్టీసీ బస్సులకు పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొన్నట్లు చెప్పారు. రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనపు సిబ్బందిని నియమించారు.
సొంత వాహనాల్లోనూ....
ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు సొంత వాహనాల్లోనూ సిటీ జనులు పల్లెల నుంచి నగరానికి తరలారు. దీంతో అన్ని వైపులా రహదారులు పోటెత్తాయి. వివిధ మార్గాల్లో సుమారు 30 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు తరలివెళ్లినట్లు అంచనా. ప్రస్తుతం వారంతా నగరానికి చేరుకుంటున్నారు. మరోవైపు దూరప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, రైళ్లలో నగరానికి చేరుకున్న వాళ్లు ఇళ్లకు చేరుకొనేందుకు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. ఎల్‌బీనగర్–మియాపూర్, నాగోల్–రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్‌లలో మెట్రో రైళ్లలో రద్దీ కనిపించింది.
రాజధానికి పోటెత్తిన నగర వాసులు
ప్రయాణికులతో బస్సులు, రైళ్లు కిటకిట
అదనపు సర్వీసులతో ఉపశమనం


