జలమండలి..చలో బస్తీ | - | Sakshi
Sakshi News home page

జలమండలి..చలో బస్తీ

Feb 20 2026 11:08 AM | Updated on Feb 20 2026 11:30 AM

-

వారంలో నాలుగు రోజులు బస్తీల్లోనే..

ఉదయం 7 నుంచి 10 గంటల వరకు

నీటి సరఫరా, సీవరేజీ లీకేజీ సమస్యలకు తక్షణ పరిష్కారం

సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల తాగునీరు, మురుగునీటి సమస్యల సత్వరమే పరిష్కారమే లక్ష్యంగా జలమండలి సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టనుంది. ‘బస్తీ బాట’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించనుంది. మేనేజింగ్‌ డైరెక్టర్‌ నుంచి వార్డు స్థాయి మేనేజర్ల వరకూ బస్తీబాట పట్టనున్నారు. జల మండలి పరిధిలోని బస్తీ, కాలనీల్లో మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు తాగునీరు, సీవరేజీ సమస్యలు గుర్తిస్తారు. ప్రజలతో మాట్లాడి తాత్కాలిక సమస్యలు తక్షణమే పరిష్కరిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారులు యథావిధిగా కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారు.

పర్యటనలో ప్రాధాన్య అంశాలివే..

మురుగునీటి సమస్య: మ్యాన్‌హోల్స్‌ పరిస్థితి, పైపులైన్‌ లీకేజీలు, ఓవర్‌ఫ్లో, డీసిల్టింగ్‌ పనుల పర్యవేక్షణ.

తాగునీటి సరఫరా: నీటి వృథా, లీకేజీలు, లో–ప్రెషర్‌ సమస్యలు, మోటార్ల అక్రమ బిగింపును అరికట్టడం. నీటి నాణ్యతను స్వయంగా పరిశీలించడం.

అవగాహన: భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, ఇంజక్షన్‌ బోర్‌వెల్స్‌ ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం. బస్తీబాట పర్యటన తీరును పరిశీలించేందుకు జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌, జాయింట్‌ ఎండీ, డైరెక్టర్లు, రీజియన్‌ ఈడీలు, డైరెక్టర్‌ (ఆపరేషన్‌)లు, జోన్‌ సీజీఎం, జనరల్‌ మేనేజర్లు, సర్కిల్‌ డీజీఎంలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు.

రోజువారీ నివేదిక

ప్రతి వార్డు మేనేజర్‌ పర్యటన రోజువారీ కార్యక్రమానికి సంబంధించిన నివేదికను ఆన్‌లైన్‌ యాప్‌లో సర్కిల్‌ డీజీఎంలకు పంపిస్తారు. సర్కిల్‌ డీజీఎంలు సర్కిల్‌ వారీగా జోన్‌లకు, జోన్‌్‌ నుంచి రీజియన్‌కు, రీజియన్‌ నుంచి కేంద్ర కార్యాలయానికి ఆన్‌లైన్‌ నివేదికలు సమర్పిస్తారు. వీటిపై ప్రతి వారం శనివారం సమీక్ష సమేవేశం నిర్వహిస్తారు.

మెరుగైన సేవల కోసమే..

నగర వాసులకు తాగునీరు, సీవరేజీ సమస్యలు లేకుండా మరింత మెరుగైన సేవలందించేందుకు బస్తీబాట చేపడుతున్నాం. క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటాం.

– అశోక్‌ రెడ్డి, జలమండలి ఎండీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement