కార్పొరేషన్ల ఆదాయంలో భారీ తేడా
శేరిలింగంపల్లి రాబడి రూ.306 కోట్లు
చార్మినార్‌లో రూ.53 కోట్లు
ఒక్కో జోన్‌కు.. ఒక్కో తీరున వ్యత్యాసాలు
ఎక్కడి రాబడితో అక్కడే పనులు
అధికారులకు సవాల్‌గా సమాంతర ప్రగతి
సాక్షి, సిటీబ్యూరో : క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్) పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రజలందరికీ సమాన అభివృద్ధి, సమాన సదుపాయాల కోసమే ఉమ్మడి జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించినట్లు ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, అది సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మూడు కార్పొరేషన్ల ఆదాయం, చేయాల్సిన పనుల్లో ఎంతో వ్యత్యాసం ఉండటమే ఇందుకు కారణం.
ఉమ్మడి జీహెచ్‌ఎంసీలోనూ కొన్ని జోన్లలో ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ ఆదాయం ఉంది. కానీ, ఎక్కువ పరిధి ఉన్నందున.. ఆదాయం లేని ప్రాంతాల్లో సైతం మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైనందున ఎక్కడి ఆదాయాన్ని అక్కడే వినియోగించాల్సి ఉంటుంది.
జీహెచ్‌ఎంసీలో..
జీహెచ్‌ఎంసీకి అత్యధిక ఆదాయ వనరు ఆస్తిపన్ను. చార్మినార్ జోన్‌లో ఈ ఆర్థిక సంవత్సర ఆస్తిపన్ను డిమాండ్ రూ.534 కోట్లు కాగా, గత నెలాఖరు వరకు వసూలైంది కేవలం రూ. 53 కోట్లు మాత్రమే. అదే తరుణంలో శేరిలింగంపల్లి జోన్ డిమాండ్ రూ.675 కోట్లు కాగా, వసూలైంది రూ.306 కోట్లు. ప్రస్తుతం చార్మినార్ జోన్ జీహెచ్‌ఎంసీలో ఉండగా, శేరిలింగంపల్లి ఎంఎంసీలో ఉండటం తెలిసిందే. గతంలోఉమ్మడి జీహెచ్‌ఎంసీలో చార్మినార్ జోన్‌లో సైతం ఇదేతీరున ఆదాయం ఉన్నా, మిగతా జోన్ల మాదిరిగానే పనులు చేసేవారు.
వచ్చిన ఆదాయాన్నే అన్ని జోన్లకూ వినియోగించేవారు. ప్రస్తుతం చార్మినార్ జోన్‌లో పనులు చేయాలన్నా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆదాయాన్నే పంచినా జీహెచ్‌ఎంసీలో ఎక్కువ ఆస్తిపన్ను వసూలయ్యేది ఖైరతాబాద్ జోన్‌లో మాత్రమే. మిగతా జోన్లలో అంతంతమాత్రమే. ఆ జోన్ల అవసరాలకే అవి సరిపోవు. ఖైరతాబాద్ జోన్‌లో ఆస్తిపన్ను ద్వారా రూ.330 కోట్లు రాగా, మిగతా జోన్లలో రూ. 100 కోట్ల లోపునే ఉంది. డిమాండ్ దృష్ట్యా చూస్తే ఖైరతాబాద్ జోన్‌లోనూ వసూలు అంతంతమాత్రమే అని చెప్పక తప్పదు. చార్మినార్ జోన్‌లో మరీ తక్కువగా ఉన్నందున ఆ జోన్‌లో పనులు చేయకుండా ఉంటారా ? ఉంటే అక్కడి ప్రజాప్రతినిధులు ఊరుకుంటారా? ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే.
ఎంఎంసీలోనూ..
ఎంఎంసీలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. అక్కడి మూడు జోన్లలో మల్కాజిగిరి ఆస్తిపన్ను డిమాండ్ రూ.899 కోట్లు కాగా, వసూలైంది మాత్రం రూ.131 కోట్లే. ఈ కార్పొరేషన్‌లోని మూడు జోన్లలోనూ ఎక్కువశాతం ఆస్తిపన్ను వసూలైంది ఉప్పల్‌జోన్‌లో మాత్రమే. మిగతా జోన్లతో పోలిస్తే ఈ జోన్‌లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాల పనులు ఎక్కువగా ఉన్నాయి.
సీఎంసీ బెటర్
మూడు కార్పొరేషన్లలోనూ సైబరాబాదే బెటర్. డిమాండ్‌లో ఎక్కువశాతం ఆస్తిపన్ను వసూలైంది కూడా అక్కడే. అంతేకాదు, ఇప్పటికే ఫ్లై ఓవర్లు, రహదారులు, జంక్షన్లతో సహ ఎక్కువ సదుపాయాలున్నది ఇక్కడే కావడం తెలిసిందే. బహుళ అంతస్తుల నిర్మాణాలు, వాణిజ్య సముదాయాల డిమాండ్ కూడా ఇక్కడే ఎక్కువ కావడంతో భవిష్యత్‌లోనూ దీనికి నష్టమేం ఉండదు.
జీహెచ్‌ఎంసీకి కష్టం
జీహెచ్‌ఎంసీ లోని గోల్కొండ జోన్‌లోనూ ఆస్తిపన్ను డిమాండ్ రూ. వెయ్యికోట్లకు పైగా ఉన్నప్పటికీ, వసూలైంది కేవలం రూ.97 కోట్లుమాత్రమే. ఈ నేపథ్యంలో క్యూర్ వరకు సమానాభివృద్ధి సాధ్యమేనా? అంటే, ప్రభుత్వం నిధుల ఆసరా ఇవ్వనిది మాత్రం అసాధ్యమంటున్నారు మున్సిపల్ వ్యవహారాల నిపుణులు.


