ముంచుకొస్తోంది గడువు | - | Sakshi
Sakshi News home page

ముంచుకొస్తోంది గడువు

Feb 20 2026 11:08 AM | Updated on Feb 20 2026 11:28 AM

-

మెట్రో రైల్‌ స్వాధీన ప్రక్రియ వేగవంతం

యాజమాన్య బదిలీ డెడ్‌లైన్‌ మార్చి 31

ఎల్‌అండ్‌టీకి రూ.2 వేల కోట్లు..

రుణాలకు రూ.13 వేల కోట్ల అవసరం

నిధుల సమీకరణకు కార్యాచరణ

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో మొదటి దశ స్వాధీన గడువు ముంచుకొస్తోంది. దీంతో రుణాల చెల్లింపునకు అవసరమైన నిధుల సేకరణపై అధికారులు దృష్టి సారించారు. వివిధ అంశాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికలను అందజేసేందుకు ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీలు కూడా కార్యాచరణను వేగవంతం చేశాయి. నిధుల సమీకరణకు అందుబాటులో ఉన్న మార్గాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌కమిటీకి నివేదికను త్వరలో అందజేయనున్నారు. ఒప్పందం ప్రకారం ఎల్‌అండ్‌టీ సంస్థకు రూ.2 వేల కోట్లు చెల్లించాలి. 

మరో రూ.13 వేల కోట్ల బ్యాంకు రుణాలను ప్రభుత్వం చెల్లించాలి. మార్చి 31లోపు యాజమాన్య బదిలీని పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. దీంతో నిర్ణీత గడువులోపే చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేసి మెట్రో యాజమాన్యం నుంచి వైదొలిగేందుకు తమకు వెసులుబాటు కల్పించాలని ఎల్‌అండ్‌టీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలో నిధుల సేకరణే ప్రధాన లక్ష్యంగా అధికార యంత్రాంగం కార్యాచరణ వేగవంతం చేసింది. నిరంతర సంప్రదింపులు సమావేశాలతో బేగంపేట్‌లోని హెచ్‌ఎఆర్‌ఎంఎల్‌ కార్యాలయంలో హడావుడి నెలకొంది.

కన్సల్టెన్సీల అధ్యయనం తుది దశకు

మెట్రోరైల్‌ స్వాధీన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ సంస్థల అధ్యయనం తుదిదశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలు, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఆస్తులు, అప్పులు అంశాలపై ఐడీబీఐ అధ్యయనం కొనసాగిస్తుండగా, మూడు కారిడార్‌లలో రైళ్ల నిర్వహణ, సాంకేతిక వ్యవస్థలు, ఇంధన వ్యయం, సిబ్బంది, తదితర అంశాలపై ఢిల్లీ మెట్రోరైల్‌ అధ్యయనం చేపట్టింది. ప్రస్తుతం ఈ రెండు సంస్థల నివేదికల ఆధారంగా స్వాధీన ప్రక్రియ సాగనుంది.

‘మెట్రోరైల్‌ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం కేటాయించిన సుమారు 249 ఎకరాల భూములు, మాల్స్‌ తదితర ఆస్తుల విక్రయంతో రుణాలు చెల్లించేందుకు అవకాశం ఉంది. మరోవైపు మొదటి దశ టేకోవర్‌ పూర్తయితే తప్ప రెండోదశకు కేంద్రం నుంచి అనుమతి, ఆర్థిక సహాయం లభించే అవకాశం లేదు. ఒప్పందం ప్రకారం ఎల్‌అండ్‌టీకి రూ.2 వేల కోట్లు చెల్లించి రూ.13 వేల కోట్ల బ్యాంకు రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement