ఇదే‘నయా’ జీహెచ్‌ఎంసీ..!
నయా జీహెచ్‌ఎంసీలో
● ఒక్కో సెగ్మెంట్‌లో 2, 3 సర్కిళ్లు
● ఒక్కో సర్కిల్‌లో 4–6 వార్డులు
● మొత్తం 60 సర్కిళ్లు.. 12 జోన్లు
అసెంబ్లీ నియోజకవర్గ పరిధే వార్డు హద్దు
సాక్షి, సిటీబ్యూరో
జీహెచ్‌ఎంసీలో వార్డుల (కార్పొరేటర్ డివిజన్ల) డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయింది. జీహెచ్‌ఎంసీ 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. రాజకీయంగా, పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవకుండా ఒక వార్డును పూర్తిగా ఒకే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ వార్డులు 150 నుంచి 300 వరకు పెరగడంతో ప్రస్తుతమున్న 30 సర్కిళ్ల సంఖ్య 60కి చేరింది. 6 జోన్లను 12 జోన్లకు పెంచారు. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు సర్కిళ్లు, మరికొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడు సర్కిళ్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక వార్డులు ఒక్కో సర్కిల్‌లో 4 నుంచి 6 వరకు ఉన్నట్లు తెలిపారు. నాలాలు, రైల్వేట్రాక్, రహదారులు వంటి వాటిని సైతం ఒకే వార్డు పరిధిలో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే వాటిపైనా పలు ఫిర్యాదులు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కొన్ని వార్డుల్లో జనాభా ఎక్కువగా, కొన్నింట తక్కువగా ఉన్నట్లు అధికారులు అంగీకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధితో పెరిగిన ఇళ్ల నిర్మాణాలు, పెరగబోయే జనాభాను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇదీ స్థూలంగా.. మారిన జీహెచ్‌ఎంసీ ముఖచిత్రం.
ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, తాజాగా అవి 26కు పెరగనున్నాయి. ఇవి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నాయి.


