ఉదయం స్నాచింగ్... మధ్యాహ్నం అరెస్ట్
గన్‌ఫౌండ్రీ: నగరంలో మరో చైన్ స్నాచింగ్ ఉదంతం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం అబిడ్స్ పరిధిలో ఒంటి మహిళ మెడ నుంచి బంగారం గొలుసులాక్కువెళ్లాడు.. దీన్ని సవాల్‌గా తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేవలం ఆరు గంటల్లో నిందితుడిని పట్టుకున్నారు. అబిడ్స్ చాపల్ రోడ్డులోని ఓ హాస్టల్‌లో నివసిస్తున్న శిరీష (24) ఆ సమీపంలోని మల్లారెడ్డి హాస్పిటల్‌లో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం నైట్ డ్యూటీ చేసిన ఈమె విధులు ముగించుకుని బుధవారం ఉదయం హాస్టల్‌కు వెళ్తున్నారు. అదే సమయంలో బైక్‌పై ఆమె వెనుక వైపు నుంచి వచ్చిన ఓ దొంగ పంజా విసిరాడు. శిరీష గమనించే లోపే ఆమె మెడలో ఉన్న 2.5 తులాల బంగారు గొలుసును లాక్కున్నాడు.బాధితురాలు అతడిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఈ పెనుగులాటలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ స్నాచర్ కోసం టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. స్నాచింగ్ జరిగిన ప్రాంతం నుంచి మొదలు పెట్టిన టాస్క్‌ఫోర్స్ అధికారులు నిందితుడు వచ్చిన, వెళ్లిన మార్గాల్లో ఉన్న 40 సీసీ కెమెరాల్లో ఫీడ్ అధ్యయనం చేశారు. అలా వచ్చిన సమాచారం ఆధారంగా ముందకువెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఇతడి తొలి నేరమని, గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదని తెలుస్తోంది. కేవలం తనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, పెరిగిన పసిడి ధరల నేపథ్యంలోనే ఈ స్నాచింగ్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా నిందితుడు సల్మాన్ పాషా యాకుత్‌పుర ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తేలింది.


