ఇంటర్ బోర్డు ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన
గన్‌ఫౌండ్రీ : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు.గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడుతూ... కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థుల నుంచి ప్రత్యేకంగా నగదు వసూలు చేసి వాటిని ఇంటర్ బోర్డు అధికారులకు అందజేసి మాస్ కాపీయింగ్‌కి పాల్పడ్డారని ఆరోపించారు. సీసీ కెమెరాలు సైతం పనిచేయకుండా చేసి చిట్టీలు పెట్టి మరి పరీక్షలు రాయించారని మండిపడ్డారు. అనంతరం ఇంటర్ బోర్డు అధికారికి వినతి పత్రం అందజేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, సహాయ కార్యదర్శి మమత, జిల్లా కార్యదర్శి అశోక్‌రెడ్డి, పాల్గొన్నారు.


