సాగర్ తీరం.. ఆనంద రాగం!
బుద్ధ పూర్ణిమ పునరభివృద్ధికి ప్రణాళికలు
సాక్షి, సిటీబ్యూరో: బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పునరభివృద్ధికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. పర్యాటకులను, సందర్శకులను ఆకట్టుకొనేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు సమగ్రమైన మాస్టర్‌ప్లాన్ రూపొందించనుంది. ఇందుకోసం కన్సల్టెన్సీని ఎంపిక చేసేందుకు సంస్థల నుంచి ఆసక్తుల వ్యక్తీకరణకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ త్వరలో బిడ్డింగ్ వెలువరించే అవకాశం ఉంది. శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, అంబేడ్కర్ మహా విగ్రహం, తెలంగాణ అమరుల స్మారకం, బుద్ధ విగ్రహం వంటి చారిత్రక కట్టడాలతో విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాంతంగా హైదరాబాద్ సంస్కృతి, తెలంగాణ కళలు ప్రతిబింబించేలా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. పర్యాటకులను ఆకట్టుకొనే నైట్ బజార్ కూడా ఏర్పాటు చేయాలని అప్పట్లో భావించారు. ఈ ప్రణాళికలు ఇప్పటివరకు అమలు కాలేదు. ఈ క్రమంలోనే బుద్ధపూర్ణిమ రీ డెవలప్‌మెంట్‌కు హెచ్‌ఎండీఏ తాజాగా ప్రణాళికలు రూపొందించింది.
అందంగా.. ఆహ్లాదంగా..
సుమారు 1,300 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న హుస్సేన్‌సాగర్ పరీవాహక ప్రాంత అభివృద్ధి కోసం అప్పటి ఉమ్మడి ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు అనుబంధంగా బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసింది. 2004 నుంచి బీపీపీ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్కు, లేక్‌వ్యూపార్క్, సంజీవయ్య పార్క్, ఎకోపార్క్, పీవీ జ్ఞానభూమి, పీపుల్స్‌ప్లాజా, ఎకో కన్జర్వేషన్ జోన్ తదితర ప్రాంతాలు ప్రస్తుతం బీపీపీలో భాగంగా ఉన్నాయి. వీటి నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా లభిస్తోంది. బీపీపీ పునరభివృద్ధిలో భాగంగా ఈ పార్కులు అంతర్జాతీయ హంగులను సంతరించుకుంటాయి. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని, ఆహ్లాదాన్ని అందజేస్తాయి. మరోవైపు రిక్రియేషన్ కార్యకలాపాల విస్తరణలో భాగంగా పర్యాటకులకు 24 గంటల పాటు ఎంటర్‌టైన్‌మెంట్ లభించే నైట్‌బజార్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉందని అధికారులు చెప్పారు. హుస్సేన్‌సాగర్ చెరువులోకి స్కైవాక్ సైకిల్ వే నిర్మించాలని హుమ్టా ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం అంబేడ్కర్ విగ్రహాన్ని ఆనుకొని ఐమాక్స్ థియేటర్ వద్ద ఉన్న విశాలమైన స్థలం, ఎకో కన్జర్వేషన్‌లో ఉన్న మరికొన్ని ప్రాంతాలను సద్వినియోగం చేసుకోవడం పునరభివృద్ధి ప్రాజెక్టు లక్ష్యం. ఈ మాస్టర్‌ప్లాన్ రూపకల్పనపై కన్సల్టెన్సీ ని ఎంపిక చేసేందుకు ఓ ప్రైవేట్ సంస్థకు బాధ్యతలను అప్పగించినట్లు అధికారులు తెలిపారు.


