యువకుడి దారుణ హత్య
చాంద్రాయణగుట్ట: వైన్ షాప్ ముందు ఓ యువకుడు ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఛత్రినాక పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. కర్ణాటకకు చెందిన సతీష్ చావ్లే (35) శంషీర్‌గంజ్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై శంషీర్‌గంజ్‌లోని తుల్జా భవానీ వైన్స్‌లో మద్యం ఆగేందుకు వచ్చాడు. మద్యం తాగే క్రమంలో మరో వ్యక్తితో గొడవ జరిగింది. ఇద్దరు గల్లా పట్టుకొని బయటికి వచ్చారు. రోడ్డుపైకి వచ్చాక మరో వ్యక్తి తన స్నేహితుడికి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో కడుపు, మెడ భాగాలలో తీవ్రంగా పొడిచాడు. సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు గాయపడ్డ వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వైన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తితో అనుకోకుండా గొడవ జరిగిందా...? ఏదైనా ముందస్తు పథకంలో భాగంగా జరిగిందా..? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.


