పెళ్లన్నాడు.. రూ.35 లక్షలు కొల్లగొట్టాడు
● యువతిని నమ్మించిమోసగించిన సైబర్ నేరగాడు
● పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
సాక్షి, సిటీబ్యూరో: ఆన్‌లైన్ మ్యాట్రిమోనీలో గుర్తు తెలియని వ్యక్తితో ఆ యువతికి పరిచయమైంది. రోజూ ఫోన్‌లో జరిపిన చాటింగ్‌లు పెళ్లి వరకు వెళ్లాయి. జాతకాలు కలవలేదని తల్లిదండ్రులు నిరాకరించినా ససేమిరా అన్నారు. సీన్ కట్ చేస్తే.. సైబర్ నేరస్తుడి వలలో చిక్కుకున్న ఆ యువతి ఏకంగా రూ.35 లక్షలు మోసపోయింది. మల్కాజిగిరి సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. వివరాలు ఇలా.. కమిషనరేట్ పరిధిలోని ఓ యువతి మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంది. సైబర్ నేరస్తుడు (40) ఆమె ప్రొఫైల్‌ను యాక్సెప్ట్ చేసి, తాను బాగా చదువుకున్నానని, వ్యాపారవేత్తనని పరిచయం పెంచుకున్నాడు. తక్కువకాలంలోనే వారి మధ్య చనువు ఏర్పడింది. ఫోన్‌లో గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. చాటింగ్‌లు చేసుకునేవారు. పథకం ప్రకారం సైబర్ కేటుగాడు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. దీన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు.. జాతకాలు సరిచూపించి అనుకూలంగా లేవని పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించారు. అయినప్పటికీ బాధితురాలు నిందితుడితో టచ్‌లోనే ఉంది. ఆమె తన వలలో పడిపోయిందని నిర్ణయించుకున్న నిందితుడు.. వ్యాపారాలను విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఆమె కోసం వజ్రాలు తీసుకున్నానని నమ్మించాడు. వ్యాపార విస్తరణకు డబ్బు కావాలని కోరాడు. దీంతో యువతి సొమ్మును నిందితుడు సూచించిన ఖాతాలకు బదిలీ చేసింది. ఇంకా కావాలనడంతో.. కుటుంబ సభ్యులతో పాటు ఆమె బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి మరీ బదిలీ చేసింది. తర్వాత నిందితుడు స్పందించలేదు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.


