మరికొన్ని బిల్లులు కామన్‌ | - | Sakshi
Sakshi News home page

మరికొన్ని బిల్లులు కామన్‌

Feb 6 2026 7:09 AM | Updated on Feb 6 2026 7:09 AM

మరికొన్ని బిల్లులు కామన్‌

మరికొన్ని బిల్లులు కామన్‌

మరికొన్ని బిల్లులు కామన్‌

ట్రేడ్‌లైసెన్స్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌ ఫీజులు సైతం..

కార్యాచరణకు సిద్ధమవుతున్న యంత్రాంగం

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆలోచనకనుగుణంగా ఆస్తిపన్ను, వాటర్‌/డ్రైనేజీ, కరెంట్‌ బిల్లులు ఒకే చోట నుంచి ఒకేసారి చెల్లించే సదుపాయం కోసం ఇప్పటికే ప్రాథమిక చర్యలు చేపట్టిన అధికారులు.. మరికొన్ని అంశాలను కూడా సంబంధిత ప్లాట్‌ఫామ్‌లో పొందుపరచాలని భావిస్తున్నారు. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య (పీటీఐఎన్‌)కు సంబంధించిన యజమానుల ఫోన్‌ నంబర్లను అప్‌డేట్‌ చేయడంతో పాటు విద్యుత్‌ మీటర్లకు సంబంధించిన ఫోన్‌నంబర్ల మ్యాపింగ్‌ కూడా చేయనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకే ప్లాట్‌ఫామ్‌లో ఇతరత్రా చెల్లింపులకు సంబంధించిన అంశాలను కూడా చేర్చాలని భావించిన వారు జీహెచ్‌ఎంసీకి సంబంధించి ఇంకా దుకాణాలు నిర్వహించే వారి ట్రేడ్‌లైసెన్సులు, ప్రకటనల పన్నులు, ఆయా ఉల్లంఘనలకు సంబంధించి చలానాల ద్వారా విధించే పెనాల్టీలను సైతం అదే ప్లాట్‌ఫామ్‌లో చేర్చేందుకు సిద్ధమయ్యారు. దుకాణాలు నిర్వహించేవారు ట్రేడ్‌లైసెన్సులు తీసుకోవాలి.. అలాగే దుకాణాల ముందు ఏర్పాటు చేసే బోర్డులకు ప్రకటనల ఫీజు కూడా చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు రోడ్లపై చెత్త వేసినా, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసినా విధించే పెనాల్టీలు సైతం అందులోనే పొందుపరచాలనుకుంటున్నారు. సొంత ఇళ్ల యజమానులకే పీటీఐఎన్‌లుండటం తెలిసిందే. అవి ఉండి నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు, పెనాల్టీలను కూడా అదే ప్లాట్‌ఫామ్‌లో పొందుపరుస్తారు. మిగతా వారి నుంచి సాధారణ పద్ధతుల్లోనే వసూలు చేస్తారు. రవాణాశాఖకు సంబంధించిన ఉల్లంఘనల పెనాల్టీలను సైతం అదే ప్లాట్‌ఫామ్‌లో చేర్చాలని భావిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పీటీఐఎన్‌, విద్యుత్‌మీటర్ల నంబర్ల మ్యాపింగ్‌ ద్వారా నివాస కేటగిరీలో ఉండి వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవనాలను గుర్తించనున్నారు. గ్రేటర్‌ పరిధిలో దాదాపు 9.15 లక్షల విద్యుత్‌ మీటర్లు వాణిజ్య కేటగిరీలో ఉండగా, వాణిజ్య కేటగిరీలో ఆస్తిపన్ను చెల్లింపులు మాత్రం ఆమేరకు లేవు. ఈ నేప థ్యంలో క్షేత్రస్థాయి సర్వే, మొబైల్‌ నంబర్ల మ్యాపింగ్‌తో నివాస కేటగిరీలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాలను గుర్తించి వాణిజ్య కేటగిరీకి మారుస్తారు. తద్వారా జీహెచ్‌ఎంసీకి ఎంతో ఆదాయం పెరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement