చూపు ప్రసాదించారు
మూణ్నెల్ల శిశువుకు వెలుగులు
● చెక్ రిపబ్లిక్ పసికందు కళ్లకు శస్త్రచికిత్స
● విజయవంతంగా చేసిన ఎల్వీ ప్రసాద్ వైద్యులు
బంజారాహిల్స్: పుట్టుకతోనే చూపులేని పసికందుకు నగరంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల వెలుగులు ప్రసాదించింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఇమాద్ అనే మూడు నెలల పసివాడు ‘పీటర్స్ అనోమలీ’ అనే అరుదైన కంటి సమస్యతో బాధపడుతున్నాడు. కనుపాపలు పూర్తిగా తెల్లబడి చూపు లేకుండాపోయింది. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల కల్లం అంజిరెడ్డి క్యాంపస్ వైద్యులు బాలుడిని పరిశీలించి.. రెండు కళ్లకూ ‘కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌న్’ (నల్ల గుడ్డు మార్పిడి శస్త్ర చికిత్స) విజయవంతంగా నిర్వహించారు. ఎడమ కన్ను మరింత క్లిష్టంగా ఉండడంతో అందులో గ్లకోమా (కంటి ఒత్తిడి) సమస్య కూడా ఉంది. దీనిని అదుపు చేసేందుకు ‘ట్రాన్స్‌స్కెరల్ సైక్లో ఫోటోకోగ్యులేషన్’ అనే పద్ధతిని, మందులను ఉపయోగించారు. శస్త్ర చికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న శిశువులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. బాలుడు వస్తువులను గుర్తుపట్టడం, చూపును స్థిరంగా ఉంచడం వంటి సానుకూల లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలకు చెందిన పీడియాట్రిక్ కార్నియా నిపుణులు డాక్టర్ మురళీధర్ రామప్ప మాట్లాడుతూ.. పీటర్స్ అనోమలీ వంటి క్లిష్టమైన సమస్యల్లో ఫలితాలను కచ్చితంగా చెప్పలేమన్నారు. సరైన సమయంలో శస్త్ర చికిత్స చేయడం, నిరంతర పర్యవేక్షణ ద్వారా చూపు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు ఆనందాన్ని పంచుకుంటూ.. బిడ్డ మొదటిసారి తమను చూస్తూ కళ్లల్లో కళ్లు పెట్టి నవ్వినప్పుడు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేమన్నారు.


