భారతీయ భాషలు మేధో సంపదకు పునాదులు
హిమాయత్‌నగర్: భారతీయ భాషలు దేశ మేధో సంపదకు పునాదులని జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి అన్నారు. భారతీయ భాషలు, సాహిత్యం, బోధనా శాస్త్రం, అనువాద అధ్యయనాలు, భాషా సాంకేతికతలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ఆవరణలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, భారతీయ భాషా సమితి, విద్యా భారతి ఉన్నత శిక్షా సంస్థాన్ సహకారంతో మంగళవారం నిర్వహించిన రెండు రోజుల జాతీయ సెమినార్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతృభాషల ఆధారిత విద్య విమర్శనాత్మక ఆలోచనను పెంపొందిస్తుందన్నారు. ఉన్నత విద్యలో భాషా సమానత్వం లేకపోతే సామాజిక అసమానతలు పెరుగుతాయని హెచ్చరించారు. భాషా సాంకేతికతలు, పరిశోధన, అనువాదం, బహుభాషావాదం పరస్పరం అనుసంధానమై ఉంటాయన్నారు. యువత తమ భాషా వారసత్వాన్ని గ్లోబల్ జ్ఞానంతో కలిపి ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా పండితులు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనగా, 100కు పైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు. అనంతరం పరిశోధన పత్రాలు సమర్పించిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సమ్మక్క సారలమ్మ విశ్వవిద్యాలయం వీసీ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ వేదుల శాంతి తదితరులు పాల్గొన్నారు.


