అల.. ప్రచార పురంలో..
శివారు మున్సిపాలిటీల్లో రంజుగా రాజకీయం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నగర శివారులోని మున్సిపాలిటీల ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. రంగారెడ్డి జిల్లాలోని మెజారిటీ స్థానాల కై వసమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు అభ్యర్థుల గెలుపునకు ప్రచారం ముమ్మరం చేశారు. ఉదయం ఇంటింటా ప్రచారం చేసి, మధ్యాహ్నం పట్టణ కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం కుల సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, కార్మిక సంఘాలతో భేటీ అవుతున్నారు. గురువారం చేవెళ్లలో డీసీసీ చీఫ్ చల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జి భీంభరత్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ కో ఆర్డినేటర్ల నియామకం
బలమైన అభ్యర్థులను బరిలోకి దించిన అధికార పార్టీ తాజాగా ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో ఆర్డినేటర్‌ను నియమించింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కోఆర్డినేటర్‌గా వి.జగదీశ్వర్‌గౌడ్, చేవెళ్లకు ఎన్.భూపతిరెడ్డి, మొయినాబాద్‌కు ఎంఏ ఫయీం, శంకర్‌పల్లికి బొంతు శ్రీదేవి, షాద్‌నగర్‌కు టి.ప్రకాష్‌గౌడ్, ఆమనగల్లు మున్సిపాలిటీకి పి.విజయారెడ్డిని ఇన్‌చార్జిలుగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
అనుచరుల గెలుపు కోసం బీఆర్‌ఎస్
ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఇప్పటికే మున్సిపాలిటీల వారీగా ఇన్‌చార్జిలను నియమించింది. వీరంతా ప్రచార రంగంలోకి దిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో అన్నీ తానై వ్యవహరిస్తుండగా, మాజీమంత్రి సబితారెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్‌నగర్‌లో, మరో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆమనగల్లులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు నాలుగు రోజులే ఉండటంతో అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ ప్రచారం ముమ్మరం చేశాయి.
తాయిలాలకు తెరలేపారు..
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇల్లిల్లూ తిరుగుతున్నారు. బీజేపీ తరఫున మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ తరఫున డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్, బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి గురువారం మూడు చింతలపల్లి, ఎల్లంపేట, అలియాబాద్ మున్సిపాలిటీల పరిధుల్లో ప్రచారం సాగించారు.
గెలుపే ధ్యేయంగా పార్టీల వ్యూహం
ఇన్‌చార్జిలను నియమించిన బీఆర్‌ఎస్
తాజాగా కాంగ్రెస్ జాబితా ప్రకటన
రంగంలోకి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు


