నేపాల్‌లో స్కెచ్.. జూబ్లీహిల్స్‌లో అమలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త రవీంద్ర శర్మ నివాసంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో నేపాలి గ్యాంగ్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. చోరీ ప్లాన్ నేపాల్ లో వేయగా అమలు జూబ్లీహిల్స్ లో జరిగింది. స్కెచ్ వేసిన జీవన్ చాంద్ 2021 అక్టోబర్ 16న ఖైరతాబాద్‌లోనిహిల్స్ కాలనీలో యజ్ఞ అగర్వాల్ అనే వ్యాపారవేత్త ఇంట్లో రూ.80 లక్షలు విలువచేసే వజ్రాభరణాలు దొంగిలించి పరారయ్యాడు. అప్పటినుంచి సైఫాబాద్ పోలీసులు ఈ దొంగ కోసం వెతుకుతుండగా ఇంకా పరారీ లోనే ఉన్నాడు. జీవన్ మధ్యలో ఒకసారి హైదరాబాదుకు వచ్చి మరో దొంగతనం చేసి పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యాడు. తాజాగా నందగిరిహిల్స్‌లో రవీంద్ర శర్మ నివాసంలో దొంగతనానికి నేపాల్‌లోనే జీవన్ పక్కా స్కెచ్ వేసి భూపేంద్ర షాహి అనే వ్యక్తిని వంట మనిషిగా పెట్టించాడు. రెండు వారాల వ్యవధిలోనే భూపేంద్ర షాహి తన అనుచరుడు నేపాల్ కు చెందిన కృష్ణ చాంద్, రమేష్ తో కలిసి రెక్కీ నిర్వహించి గత శుక్రవారం రూ.1.30కోట్ల విలువచేసే వజ్రాలు దొంగిలించి పరారయ్యాడు. భూపేంద్రశాహి, కృష్ణ చాంద్ ఇద్దరూ కలిసి ముంబైలో నేపాల్‌కు చెందిన తమ స్నేహితులు లలిత్, కిషన్ సాయి వద్ద ఆశ్రయం పొందారు. దొంగతనం చేసిన సమయంలో అక్కడ పడిపోయిన సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు వీరి జాడ కనిపెట్టారు. భూపేంద్ర షాహి, కృష్ణ చాంద్ ఇద్దరు నేపాల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్లో రమేష్ పరారీలో ఉన్నాడు. భూపేంద్ర షాహిని వంట మనిషిగా మాట్లాడిన మదన్ లాల్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు నేపాల్ బార్డర్ దాటకముందే హైదరాబాద్ పోలీసులకు చిక్కారు ప్రధాన నిందితుడు జీవన్ ను హైదరాబాదుకు రప్పించేందుకు పోలీసులు ఇంటర్ పోల్ ను ఆశ్రయించాలని నిర్ణయించారు. మొత్తానికి జూబ్లీహిల్స్ లో జరిగిన దొంగతనం వల్ల 2021 లో సైఫాబాద్ లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు బయటపడ్డాడు.
పరారీలో ప్రధాన నిందితుడు.. గతంలో నగరంలోనూ చోరీ
మరో ఇద్దరి రిమాండ్


