పంచవటి కాలనీలో హిట్ అండ్ రన్
మణికొండ: పిల్లలను స్కూల్ నుంచి తీసుకుని వచ్చేందుకు స్కూటీపై వెళుతున్న ఓ మహిళను ఇన్నోవా కారు ఢీ కొట్టి వెళ్లిపోయిన సంఘటన మణికొండ సర్కిల్ పరిధిలోని పంచవటి కాలనీలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కాలనీకి చెందిన భవానీ అనే మహిళ తమ పిల్లలను స్కూల్ నుంచి తీసుకుని వచ్చేందుకు స్కూటీపై కాలనీలోని 9బి వద్ద రోడ్డు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఆమెను ఢీ కొట్టింది. దాంతో ఆమె కింద పడి తీవ్ర గాయాలు కావడంతో కాలనీ వాసులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఇన్నోవా కారు ఆగకుండా వెళ్లి పోయిందని, ఇందుకు సంబందించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయినట్లు తెలిపారు. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
క్రిప్టో కరెన్సీ పేరుతో టోకరా
– దృష్టి మరల్చి రూ.కోటితో పరారీ
బంజారాహిల్స్: నగదుకు బదులుగా క్రిప్టో కరెన్సీ ఇస్తానంటూ నమ్మించి దష్టి మరల్చి రూ.కోటి నగదుతో ఉడాయించిన ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. మెహెదీపట్నం ప్రాంతానికి చెందిన ఉమర్ అనే వ్యాపారవేత్తకు బంజారా శాలిబండ ప్రాంతానికి చెందిన ఎత్తెషామ్ ఆన్ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తామని నమ్మబలికాడు. దీంతో అతడి మాటలు నమ్మిన ఉమర్ సోమవారం సాయంత్రం రోడ్ నెంబర్ 1 లోని తాజ్ దక్కన్ హోటల్ కు వచ్చాడు.. రూ. కోటి కి బదులుగా క్రిప్టో కరెన్సీ ఇస్తామని చెప్పడంతో నగదు అప్పగించాడు. కొన్ని నిమిషాల్లోనే క్రిప్టో కరెన్సీ వస్తుందంటూ దృష్టి మరల్చిన నిందితుడు అక్కడి నుంచి ఉడాయించాడు. ఎంతసేపు గడిచినా ఎతేశ్యామ్ వెనక్కి రాకపోవడం, అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలు
మణికొండ: లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నార్సింగి ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షేక్‌పేట వినోదనగర్ కాలనీలో నివసించే కురుకుంట రవి (38) మేసీ్త్రగా పనిచేసేవాడు. 2018లో నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అలకాపూర్ టౌన్ షిప్‌లో లైంగికదాడికి పాల్పడ్డాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఎల్‌బీనగర్‌లోని జిల్లా 13వ అదనపు జడ్జి మంగళవారం దోషిగా నిర్దారించి 20 ఏళ్ల కఠిన జైలు శిక్షతో పాటు రూ. 5వేల జరిమానా విధించింది. అప్పట్లో సీఐగా పనిచేస్తూ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన జీవీ రమణ గౌడ్ ప్రస్తుతం నార్సింగి ఏసీపీగా పనిచేస్తున్నారు. సాక్ష్యాలు అందించడంలో కానిస్టేబుళ్లు అంజిలప్ప, జ్యోతి ఎంతో కృషి చేశారని సీఐ తెలిపారు.
భార్య విడాకుల నోటీసు పంపిందని..
– మనస్తాపంతో భర్త ఆత్మహత్య
ఘట్‌కేసర్: భార్య నుంచి విడాకుల నోటీస్ రావడంతో మనస్తాపానికి లోనైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సం ఘటన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎదులాబాద్ ప్రాంతానికి చెందిన గట్టుపల్లి వెంకటేశ్ (40)కు, కీసరకు చెందిన మౌనిక అలియాస్ విజయలక్ష్మితో 2019లో వివాహం జరిగింది. మౌనిక తల్లి కీసరలోని గురుకుల్‌లో స్వీపర్‌గా పనిచేస్తోంది. తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో మౌనిక ఆమెకు బదులుగా విధులు నిర్వహిస్తూ కీసరలో భర్తతో కలిసి ఉంటోంది. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వెంకటేశ్ విడాకులు ఇవ్వకపోవడంతో లాయర్ ద్వారా మౌనిక నోటీసు పంపింది. దీంతో మనస్తాపానికి లోనైన వెంకటేష్ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్కూటీని ఢీ కొట్టిన కారు


